సమస్య బొద్దింకలు కాదు.. అపరిశుభ్రత!

by Ravi |   (  Updated:2026-07-24 00:30:34  IST  )

బొద్దింకల కథ ద్వారా సమస్యలను పైపైగా కాకుండా మూల కారణాల వద్ద పరిష్కరించాల్సిన అవసరాన్ని వివరించే విశ్లేషణ..

సమస్య బొద్దింకలు కాదు.. అపరిశుభ్రత!
X

‘ఈ బొద్దింకల గోల భరించలేకపోతున్నాను.. వీటిని భూమి మీద లేకుండా చేసేయాలి’ అంటూ విసుక్కుంటూ అంది మా ఆవిడ. ‘నీ వల్ల కాదు’ అని నవ్వుతూ అన్నాను. ఏం అన్నట్టు ముఖం పెట్టింది. ‘ఎందుకంటే అవి డైనోసార్ల కన్నా భూమ్మీద ముందు పుట్టిన జీవులు.. డైనోసార్లు పిచ్చుకల కన్నా దారుణంగా అంతరించాయి.. కానీ ఇవి మాత్రం నిలదొక్కుకున్నాయి.’ ‘అవి 32 కోట్ల సంవత్సరాల నుండి ఉన్నట్టు శాస్త్రవేత్తలు రుజువులు చూపిస్తున్నారు. అవి వేడిలో ఉండగలవు, చలిలో ఉండగలవు, తిని ఉండగలవు, తినకుండా ఉండగలవు.. అంతెందుకు.. తల తీసేసినా కొన్ని రోజులు బతకగలవు’. ఆ జాతి మనుగడ, గొప్ప దనాల గురించి తర్వాత చెప్దురు గానీ.. మన ఇంట్లో సమస్య వినండి’ "సరేలే అయితే.. ఏమిటి సమస్య?" బొద్దింకలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.. అదుపు చెయ్యలేక పోతున్నాను." "నన్నేం చెయ్యమంటావు?" "ఇలాంటి జ్ఞానబోధలు పక్కన పెట్టి ఏ హిట్టో, ఫట్టో పట్టుకు రమ్మంటాను" "అలా అయితే పూర్తిగా అవి పోతాయా?" "అవెక్కడికి పోతాయి.. రెండ్రోజులాగి మళ్ళీ తయారౌతాయి." "అర్థమైంది కదా. అసలు సమస్య నువ్వు చూడడంలోనే ఉంది. చూసే దృష్టి మారాలి.. సమస్య బొద్దింకలు కాదు. వాటిని పెంచే పరిసరాలు.. అపరిశుభ్ర వాతా వరణం, పగిలిన సింకులు, మూత వెయ్యని డ్రెయిన్లు, మూత పెట్టని డస్ట్ బిన్లు". " ఆ వాతావరణాన్ని సరిచేస్తే బొద్దింకలు వాటికవే మాయమవుతాయి. అపరిశుభ్రత లేకపోతే చస్తే మన వైపు రావు.. వచ్చినా ఒకటో, రెండో. గుంపులుగా అయితే రావు.. వాటిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు." 'అర్థమైంది' అన్నట్టు ఆవిడ హిట్ సంగతి వదిలి, ప్లంబర్ కోసం నెంబర్ వెదకడం మొదలు పెట్టింది.. పగిలిన సింక్ మార్చాలి కదా! ( ఢిల్లీలో నిరసన చేద్దామన్న బొద్దింకల పార్టీ పిలుపు ఎందుకు విజయవంతమౌతుంది? వ్యవస్థలో అవినీతి, అపరిశుభ్రత పెరిగింది కనుక. పాల కులు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేసినా చేస్తున్నట్లు కనబడినా, ఆ నమ్మకం కలిగినా బొద్దింకల (పిలుపులకు) ప్రభావం ఉండదు.. అలా చెయ్యడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత కూడా.. సమస్యని చూసే దృష్టి మారితేనే పరిష్కారాలు కళ్లకు కబడతాయి.)

-డా.డి.వి.జి. శంకర రావు,

94408 36931

Next Story