- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత ప్రభుత్వం అమలు చేయలేదు.. ఈ ప్రభుత్వమైనా చేస్తుందా?
రాష్ట్ర విభజనకు ముందే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకై

రాష్ట్ర విభజనకు ముందే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకై తలపెట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) పుష్కర కాలం దాటినా నేటికీ అమలుకు నోచుకోలేదు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కారుగా గొప్పగా ప్రచారం చేసుకున్న కేసీఆర్ పదేళ్ల బంగారు తెలంగాణలో సైతం దీనిని అమలు చేయలేదు. దీనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా అమలు చేస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు గంపెడు ఆశతో ఉన్నారు.
ప్రభుత్వం వైద్య చికిత్సకు గరిష్టంగా రూ. రెండు లక్షల పరిమితిని విధిస్తూ, నగదు రహిత వైద్య చికిత్స, రీయింబర్స్‌మెంట్ రెండూ కొనసాగుతాయని ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేయడమే కానీ, నగదు రహిత వైద్య చికిత్స మాత్రం నేటికీ అమల్లోకి రాలేదు. పోనీ, చికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చును కూడా రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్నదా? అంటే, అదీ లేదు.. అత్యవసర పరిస్థితుల్లో సైతం కార్పొరేట్ హాస్పిటల్స్ నగదు రహిత వైద్య చికిత్సలకు నిరాకరిస్తున్నాయి. గత ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వచ్చే జూన్ 2, రాష్ట్రావతరణ దినోత్సవం కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రకటించడం చాలా అవసరం.
ఆదిలోనే మాట తప్పిన గత సర్కార్
ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌తో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగదు రహిత వైద్య చికిత్సకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే! ఆ తర్వాత ఒక్క అడుగు ముందుకు పోలేదు. స్కీం అమలు కోసం పూర్తి గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ సర్కార్ ఆ తర్వాత మాట తప్పింది. దరిమిలా, హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ ససేమిరా అంటున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా గరిష్టంగా కాంట్రిబ్యూషన్‌కి రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అంగీకరించినా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం. తమ వేతనం/పెన్షన్‌లో ఒక శాతం మొత్తం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, దానికి సమానంగా ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌తో నగదు రహిత వైద్య చికిత్స స్కీంకి అంగీకారం తెలుపుతూ టీఆర్‌టీఎఫ్ సహా చాలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మతి లేఖలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయి. అయినా, ప్రభుత్వం పథకాన్ని అమల్లోకి తేలేదు..
మిగతా రాష్ట్రాల్లో ఇలా..!
పలు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తున్న కాంట్రిబ్యూషన్‌తో బేరీజు వేసి చూస్తే తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అంగీకరించిన ఒక శాతం కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. కేరళలో మెడిసెప్ పథకం ద్వారా నెలకు రూ.500 కాంట్రిబ్యూషన్‌తో నగదు రహిత వైద్య చికిత్స అమలు చేస్తున్నారు. కర్ణాటక ఆరోగ్య సంజీవిని స్కీం ద్వారా ఆ రాష్ట్రంలో నెలకు రూ. 250 నుండి వెయ్యి రూపాయల కాంట్రిబ్యూషన్‌తో ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజించి నగదు రహిత వైద్య చికిత్సను అందిస్తున్నారు. కర్ణాటకలో ప్రత్యేక హైపవర్ కమిటీ ద్వారా పథకాన్ని అమలు చేయని హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటూ పకడ్బందీగా ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తమిళనాడులో సర్వీసులో ఉన్న ఉద్యోగుల వద్ద నెలకు రూ.300 పెన్షనర్ల నుంచి రూ.497 చందా తీసుకొని నగదు రహిత వైద్య చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా వెయ్యి రూపాయలతో లిమిట్ లేకుండా నగదు రహిత వైద్య చికిత్స అందిస్తున్నది. పై విషయాలను పరిశీలించినట్లయితే, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి ఒక శాతం కాంట్రిబ్యూషన్, అంతే మొత్తం ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే రాష్ట్రంలో ఈహెచ్ఎస్‌కి సరిపోతుందని స్పష్టంగా అర్థమవుతుంది.
ఈహెచ్ఎస్ ఇలా ఉండాలి..
అన్ని రకాల వ్యాధులకు పరిమితి లేని నగదు రహిత చికిత్సలను గుర్తింపు పొందిన అన్ని ఆస్పత్రుల్లో అందించాలి. దీర్ఘకాలిక వ్యాధులకు నగదు రహిత చికిత్సతో పాటు ప్రతిరోజు మెడిసిన్స్ వాడాల్సిన జబ్బులకు మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకూ వర్తింపజేయాలి. గుర్తించబడిన ఆసుపత్రుల్లో హోదాతో సంబంధం లేకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలి. అత్యవసర, ప్రాణాపాయ పరిస్థితుల్లో గుర్తింపులేని ఆసుపత్రులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పుడు సత్వరమే రీయింబర్స్‌మెంట్ అందించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి ప్రతి నెలా వసూలు చేసే మొత్తం, ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ రెండింటిని కలిపి ప్రత్యేక ట్రస్టు ద్వారా పథకాన్ని నిర్వహించాలి. ట్రస్ట్‌లో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలకు సైతం భాగస్వామ్యం కల్పించాలి. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించని, ధిక్కరించే హాస్పిటల్స్ గుర్తింపు రద్దుకు సిఫార్సు చేసే అధికారాన్ని సైతం ఈ కమిటీలకు అప్ప జెప్పాలి. వచ్చే జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవం కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రకటించాలని కోరుకుంటున్నాం.
మానేటి ప్రతాపరెడ్డి,
గౌరవాధ్యక్షుడు, టీఆర్‌టీఎఫ్
98484 81028






