- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్ట్ ఆఫీస్ కనుమరుగు..నిజమేనా?
ప్రజల సౌకర్యార్ధం వీధి వీధికి నెలకొల్పబడిన ఎరుపు రంగు పోస్ట్ బాక్సులు సెప్టెంబర్ 1, 2025 వ తేదీ నుండి

ప్రజల సౌకర్యార్ధం వీధి వీధికి నెలకొల్పబడిన ఎరుపు రంగు పోస్ట్ బాక్సులు సెప్టెంబర్ 1, 2025 వ తేదీ నుండి కనుమరుగు కాబోతున్నా యనే వార్త ప్రసార మాధ్యమాల్లో చదివాను.. యాభై సంవత్సరాలు పైబడిన చాలా మందికి పోస్ట్ ఆఫీస్, పోస్ట్ బాక్స్, ఉత్తరాలతో అవినాభావ సంబంధముండేది. నిరక్ష్యరాస్యు లు చదువుకున్న వారితో ఉత్తరాలు రాయించుకొని తమకు కావలసిన వారికి పంపించుకునే వారు. చదువు రానివారికి ఉత్తరం వచ్చినట్లయితే బట్వాడా చేసిన పోస్ట్ మాన్ ద్వారా చదివించుకునే సందర్భాలూ లేకపోలేదు..
మన దేశంలో బ్రిటిష్ కాలంలోనే తపాలా, టెలిగ్రాఫ్ విభాగాలు వేర్వేరుగా స్థాపింపబడి, పరిణామ క్రమంలో ఆ రెండు విభాగాలు విలీనమైనాయి. 160 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన మోర్ టెలిగ్రామ్ శకం 2013 తోనే ముగిసింది. ప్రజలు సులభమైన, వేగవంతమైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన ఇతర సాంకేతికతపై ఆధారపడటం మూలాన టెలిగ్రాఫ్ అంకానికి ప్రభుత్వం వీడ్కోలు పలికింది.
ప్రపంచంలోనే నంబర్‌వన్ పోస్టల్ సంస్థ
తపాలా శాఖ కాలక్రమేణా కేవలం ఉత్తరాలు, పార్శిళ్ల బట్వాడా మాత్రమే కాకుండా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్వర్తించే విధులను కూడా చేపట్టింది. ఆన్లైన్ సేవలు, ట్రాకింగ్ లాంటి అధునాతన సేవలతో సాంకేతికత చేరింది. లక్షన్నర పైగా పోస్ట్ ఆఫీసులతో మన దేశం ప్రపంచంలోనే ముందున్నట్లు తెలుస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం ఒక ఉత్తరం మారుమూల పల్లెటూరుకు చేరాలంటే 20 రోజుల నుండి నెల రోజుల దాకా సమయం పట్టేది. ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్‌లు లేని గ్రామాలు ఉన్నాయి.
కోట్ల మందిని పలకరించిన ట్రింగ్ ట్రింగ్
ఉత్తరాలు రాయటం కూడా ఒక కళ. దస్తూరిని బట్టి మనిషి స్వభావాన్ని నిర్ధారించవచ్చుననే వారు. టెలిగ్రామ్ వచ్చిందంటే దుర్వార్త వస్తుందనే ఆందోళన ఉండేది. సైకిల్‌పై వచ్చిన పోస్ట్ మాన్ ట్రింగ్ ట్రింగ్ బెల్ మ్రోగించుకుంటూ 'పోస్ట్' అనగానే ఉత్తరం ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదిరి చూసే జనం పరిగెత్తుకుంటూ ఉత్తరాన్ని అందుకునే రోజులు దాదాపు కనుమరుగయ్యాయి. ప్రేయసీప్రియుల, భార్యాభర్తల మధ్య ఉత్తరాలు చిలిపిగా ఉంటే తండ్రి కొడుకుల నడుమ ఉత్తరాలు మరో రకం. హాస్టల్‌లో ఉండే కొడుకు డబ్బు కోసం తండ్రిని అర్థిస్తే, తండ్రి తన అసహాయతను తెలియజేస్తూ జవాబు రాయటం, కూతురు ప్రసవిస్తే ఉత్తరం ద్వారా ఆ విషయం పట్నంలో ఉద్యోగం చేసే అల్లుడికి తెలియజేయడం, రచయితకు రచన ప్రచురించలేక పోతున్నామని పత్రిక ఎడిటర్ తిరుగు టపాలో జవాబివ్వటం ఇవన్నీ ఉత్తరాల ద్వారా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సంబోధనల్లో మ్యాజిక్
ఒక ఉత్తరం గంగా భాగీరథి సమానురాలు సంబోధనతో మొదలైతే, ఇంకొకటి గౌరవనీయులైన లేదా మహారాజశ్రీతో మొదలై, భవదీయుడు, ఇట్లు తమ విధేయుడు లాంటి సంబోధనలతో ముగుస్తాయి. కొంత కాలం క్రితం పత్రికల యాజమాన్యాలు ఏదో ఒక రకమైన పోటీ నిర్వహించి, లేదా ప్రశ్నలు-జవాబులు కార్యక్రమం ద్వారా పాఠకుల సంఖ్యను పెంచుకునేవి. తద్వారా వారికి అందజేయవలసిన ఉత్తరాలు కుప్పలు తెప్పలుగా ఉండేవి. వాటిని సైకిళ్లపై బట్వాడా చేయడానికి పోస్ట్ మాన్ నానా తంటాలు పడవలసి వచ్చేది. పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఒక నిర్దిష్ట అంశం ఇచ్చి దానిపై లెటర్ రైటింగ్ పోటీ నిర్వహించేవారు. దాని వల్ల వారిలో పదాల ఎంపిక, వాక్య నిర్మాణం, భాషా నైపుణ్యం మెరుగు పడతాయి.
రద్దవుతున్నది పోస్ట్ బాక్స్ కాదు..
నిరుద్యోగికి ఇంటర్వ్యూకు హాజరు అవ్వాల్సిందిగా తేదీని తెలియజేస్తూ పంపిన ఉత్తరం, తేదీ ముగిసిన తర్వాత చేరవేసిన సందర్భాలు లేకపోలేదు. తద్వారా పుణ్య కాలం ముగిసి, నిరుద్యోగి తల పట్టుకొని ఏడ్చే పరిస్థితి దాపురించేది. ఇంతటి జ్ఞాపకాలు ఉన్న ఈ పోస్ట్ డబ్బాలు ప్రజల చేతికి ఎప్పటికప్పుడు సాంకేతికత ద్వారా వేగవంతంగా సమాచారం అందడం కారణంగా ఉత్తరాలు కనుమరుగవుతున్నాయని తపాలా శాఖ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ విధులకు ప్రాధాన్యతనిస్తూ, ఎర్ర రంగు పోస్ట్ బాక్స్‌లకు స్వస్తి పలుకుతుందని భావించి ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ఆ వార్త నిజమని మొదటగా నమ్మాను. ఈ వ్యాసం ముగించే ముందు ధ్రువీకరణలో తేలిందేమంటే ఆ వార్తలో నిజం లేదని, కేవలం రిజిస్టర్ పోస్ట్ మాత్రమే రద్దు చేస్తున్నారని తెలిసింది.
తడకమళ్ళ మురళీధర్
పూర్వ జిల్లా జడ్జి
98485 45970






