ఆర్టీసీ కార్మికుల వెతలు తీరాలి!

by Ravi |   (  Updated:2026-04-24 01:00:50  IST  )

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వారి కష్టాలు, ప్రభుత్వ వైఖరి, న్యాయమైన డిమాండ్లపై, ప్రజా రవాణా వ్యవస్థలో వారి కీలక పాత్రపై విశ్లేషణ.

ఆర్టీసీ కార్మికుల వెతలు తీరాలి!
X

ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులందరి కన్నా కష్టమైన విధులు నిర్వహిస్తున్న వారు ఆర్టీసీ ఉద్యోగులు.. ఎండనక, వాననక డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీలో పడే తిప్పలు ఎవరి నోటైనా అయ్యో పాపం అనిపిస్తాయి.. అయినా అరకొర జీతభత్యాలు, సదుపాయాల లేమితో వారు కుటుంబాలను నెట్టుకొస్తు న్నారు. నిత్యం ప్రజా రవాణాలో పాల్గొంటూ వారు కోట్లాది జనజీవనంలో అత్యవసర పాత్ర పోషిస్తున్న వారు ప్రభుత్వ దృష్టిలో మాత్రం చిన్నచూపుకు గురవుతున్నారు..

ప్రయివేటు, సొంత వాహనాలు పెరగడంతో ఆర్టీసీ ఆదాయం తగ్గుముఖం పట్టి సంస్థ నష్టాల బారిన పడు తోంది. సంస్థ లాభాలతో ముడిపడి ఉన్న వారి బతుకులు రోజు‌రోజుకూ కుంచించుకు పోతున్నాయి. అందుకే వారు ఏమడిగినా సంస్థ నష్టాల్లో నడుస్తుంటే ఎలా తీర్చుతాం? అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు.. ఒకపైపు పెరుగుతున్న ధరలు, కుటుంబ అవసరాలు వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి, అప్పుల్లోకి లాగుతున్నాయి. ఇలా ఎంతకాలం అని విసిగి వేసారిన దశలోనే వారు ఇక తప్పదని సమ్మెకు సిద్ధపడు తున్నారు. నిజానికి ప్రభుత్వం ఎంతో సానుభూతితో పరిష్కరించవలసిన సమస్యలు వారివి.

గత సమ్మెను నిర్దయగా అణచివేసి..

2019 తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఇది. ఆనాటి సమ్మె చరిత్రాత్మకమైనది. కేసీఆర్ ప్రభుత్వం ఎంత జడిపించినా అదరని బెదరని వారి దీక్ష, పట్టుదల కార్మి కోద్యమ స్ఫూర్తిని నిలబెట్టాయి. అక్టోబరు 4 అర్థరాత్రి నుండి సమ్మె మొదలై 52 రోజులు కొనసాగి నవంబరు 25న ముగిసింది. ఈ సమ్మెను కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోని వారి పట్ల నియంతలా వ్యవహరించారు. చాలా మొండిగా, నిర్దయగా సమ్మెను అణచివేసే ప్రయత్నం చేశారు.. సమ్మె పట్ల ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మొత్తం 36 మంది తమ సహోద్యోగులు చనిపోయారని ఐకాస ప్రకటించింది. సమ్మెను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తూ, అక్టోబరు 5వ తేదీలోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కానట్టే అని ప్రభుత్వం బెదిరింపు హెచ్చరిక జారీ చేసింది. 50 రోజులు సమ్మె చేసినా దిగి రాని ప్రభుత్వంపై ఆశలు చంపుకొని, కుటుంబ, ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆ చిరుద్యోగులు బేషరతుగా విధుల్లో చేరక తప్పలేదు.

కేసీఆర్ మాట నిలుపుకోకపోవడంతో..

ఆ తర్వాత ఆర్టీసీలో ఇకపై సమ్మెలుండవు, కార్మిక సంఘాలను నిషేధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక నిర్ణయం. కేసీఆర్ నియంతృత్వానికి పరాకాష్ట. సమ్మె 15వ రోజైన అక్టోబర్ 19న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా, సంఘీభావంగా రాష్ట్ర బంద్ విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోని మిగతా ఉద్యోగ సంఘాలు చర్చలకు డిమాండు చేశాయి. అయినా ప్రభు త్వం మనసు కరగలేదు. బస్సులు రోడ్లమీదికొచ్చాక శాంతించిన కేసీఆర్ ఓ రోజు ఉద్యోగుల్లో కొందరిని తమ నివాసానికి రప్పించి భోజనాలు ఏర్పాటు చేశారు.. డిపోకు ఒకరిద్దరు ఉద్యోగ ప్రతినిధులు ఉంటారని, వారు మధ్య వర్తిత్వం నెరుపుతారని ఏవేవో మాటలు చెప్పి పంపించారు. కానీ అవేవి కాగితాల్లోకి రాలేదు. 50 రోజులు అరిగోస పోసుకొని కొందరిని పిలిచి కడుపుకింత పెట్టడంతో ఉద్యోగు‌లకు న్యాయం జరిగినట్లు కాదు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట నిలుపుకోలేదు.. దాని ఫలితాన్ని బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో చవి చూసింది.

ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్దమైనవే!

అయితే ఏ రకంగా చూసినా ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తుత డిమాండ్లు న్యాయబద్దమైనవే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. 2021 నుండి వేతన సవరణ అనేది విధానాల్లో ఉన్నదే. కార్మిక సంఘాల పునరుద్ధరణ ఉద్యోగుల హక్కు. రాష్ట్రంలో తెల్ల చొక్కాలు తొడిగే అన్ని విభాగాల్లో యూనియన్లు ఉన్నపుడు యూనిఫారం ధరించే ఆర్టీసీ కార్మికులకు రద్దు చేయడం దుర్మార్గం. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులను ఆర్థిక భారం అని ఆలోచించకుండా ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించవలసిన అవసరం ఉంది. ఈ విపత్కర పరిస్థితిలో ఆర్టీసీ కార్మికులు ఒంటరి కాదని నిరూపించవలసిన బాధ్యత రాష్ట్ర ఉద్యోగులపై, పౌరులపై ఉంది. జీతాలు నష్టపోయే ఈ సమ్మె గతం మాదిరి దీర్ఘకాలం సాగకుండా, విఫలం కాకుండా ఆ ఉద్యోగులకు సకల జనులు మద్దతుగా నిలవాలి. ముందుగా రాజకీయ విపక్షాలు బహిరంగ సంఘీభావం ప్రకటించి కదం కలిపి నడవాలి. ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటనలు ఇచ్చి నల్ల బ్యాడ్జీలతో విధులకు వెళ్లాలి.. పౌర సంఘాలు సైతం ఉద్యోగుల దీక్షల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని పరిష్కార దిశగా సహకరించాలి. నిస్పృహతో ఉద్యోగుల ఆత్మ సమర్పణ దాకా వ్యవహారం వెళ్లవద్దు. ఏ రూపంలో అయినా సమ్మె నిలువరింపు వైపు ప్రభుత్వం అడుగులు పడేలా ఉద్యోగులకు అందరూ తోడ్పడాలి.

- బద్రి నర్సన్

94401 28169

Next Story