- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేతన సవరణ ఆలస్యంతో ముసురులో ఉద్యోగుల భవిష్యత్తు..
వేతన సవరణ (పీఆర్‌సీ) ప్రతి ఐదేళ్లకోసారి జరగడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది ఉద్యోగుల జీవన ప్రమాణానికి అనుసంధానం. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో పాత వేతనాలతో జీవనం కొనసాగించడం కష్టం.

వేతన సవరణ (పీఆర్‌సీ) ప్రతి ఐదేళ్లకోసారి జరగడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది ఉద్యోగుల జీవన ప్రమాణానికి అనుసంధానం. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో పాత వేతనాలతో జీవనం కొనసాగించడం కష్టం. వేతన సవరణ అమలుతో ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది, పనితీరు మెరుగవుతుంది. పెరిగిన వేతనాలు కొనుగోలు శక్తిని పెంచుతాయి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. ప్రభుత్వం కూడా పన్ను ఆదాయం ద్వారా లాభపడుతుంది. అందుకే 12వ పీఆర్‌సీని ఆలస్యం చేయకుండా ప్రకటించి, రీవైజ్డ్‌పే ఫిక్సేషన్‌ను తక్షణమే పూర్తి చేయాలి.
డీఏ చెల్లింపు జీవనాధారం
కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) అనేవి ద్రవ్యోల్బణం పెరుగుదల పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు రక్షణ పొందే సాధనాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ/డీఆర్‌కు రాష్ట్రాలు అనుసరణ చేయడం ఒక విధి. డీఏ నిలిపివేయడం లేదా వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు ఉల్లంఘనతో సమానం. 2018 నుండి జూలై 2023 వరకు ప్రభుత్వం 11 డీఏ/డీఆర్‌లను ప్రకటించింది. అయితే వాటిలో కేవలం రెండు మాత్రమే బిల్లింగ్ చేయబడ్డాయి. మిగిలిన తొమ్మిది డీఏ/డీఆర్‌లు ఇప్పటికీ కాగితాలమీదే ఉన్నాయి. పీఎఫ్‌లోనూ వాటి ప్రభావం కనిపించలేదు. ఏ శాఖా లెక్క తేల్చలేదు, ఏ అధికారి సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన డీఏ/డీఆర్ ఎరియర్లు వాస్తవంలోనికి వస్తాయా అన్న సందేహం సహజం.
ఎరియర్లపై గాఢమైన నిశ్శబ్దం
11వ పీఆర్స్సీ ప్రకారం 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ వరకు రావలసిన ఎరియర్లు జనవరి 2022 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి చెల్లిస్తామని జీవో 103లో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎవరికీ చెల్లింపులేదు. అలాగే పెన్షనర్లకు వాయిదాలుగా ఇవ్వాల్సిన ఎరియర్లు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయాయి. ఈ మౌనం వృద్ధుల పట్ల నిర్దయకు నిదర్శనం. అలాగే పదవీ విరమణ తర్వాత లభించే గ్రాట్యుటీ, EEL, GIS వంటి హక్కు సొమ్ములు ఉద్యోగుల జీవిత పంట. కానీ వాటి చెల్లింపులు సంవత్సరన్నరగా నిలిచి పోవడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఎరియర్ల చెల్లింపు.. న్యాయపరమైన కర్తవ్యం
ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీవిత కాలం సమర్పించి రాష్ట్రానికి సేవ చేస్తారు. వారికి రావలసిన వేతనాలు, డీఏలు, పీఆర్సీ ఎరియర్లు చెల్లించకపోవడం అనేది ప్రభుత్వ విశ్వస నీయతను దెబ్బతీస్తుంది. ఈ చెల్లింపులు కేవలం బకాయిలు కావు. అవి కష్టార్జిత హక్కులు. వాటి ఆలస్యం వల్ల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయి. ప్రభుత్వం ఎరియర్ల చెల్లింపుకు తక్షణ కార్యాచరణ రూపకల్పన చేయాలి.
ఐక్యతే మార్గం!
ఈ దుర్వ్యవస్థను ఎదుర్కోవడానికి ఉద్యోగుల, పెన్షనర్ల ఐక్యత తప్ప మార్గం లేదు. ఉపాధ్యాయుల డీఏ సాధన కోసం చూపిన ఉద్యమం దిశనే అన్ని ఉద్యోగ సంఘాలు అనుసరించాలి. వివేచనతో, విభేదాలను పక్కనబెట్టి, ఒకే వేదికపై కట్టుబడి నడిస్తేనే మన హక్కులు సాధ్యమవుతాయి. ఉద్యోగులు, పెన్షనర్ల సంఘా లు, రాజకీయ పార్టీల ప్రభావం లేకుండా, ఏ ప్రభుత్వ యాజ మాన్యం ఉన్నా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించడానికి ప్రయత్నించాలి. ‘అందరం కలిస్తే IR, అందరం మెలిస్తే పీఆర్సీ, కలిసి మెలిసి నడిస్తే.. ఎరియర్స్’. ఐక్యతే ఉద్యోగుల రక్ష, పెన్షనర్ల రక్ష, ఆర్థిక న్యాయానికి పునాది. ఇది బాధలోనూ బలాన్ని వెతికే సమయం. హక్కుల సాధనకు ఐక్యతే శక్తి.
- టి. ఎం. బి. బుచ్చిరాజు,
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్
97034 25006






