- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మానవత్వం మరచిన భారతం
భారతదేశంలో ఉత్పత్తి శక్తులుగా ఉండి దేశ నిర్మాతలుగా ఉన్న దళితులపైన ఇంకా అమానుషంగా దాడులు జరగడం బాధాకరమైన విషయం. భారతదేశ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, విద్య, కళ, తాత్విక, ఉత్పత్తి రంగాలన్నింటిలోనూ దళితుల శ్రమ, కృషి తత్వం వల్లనే అభివృద్ధి జరుగుతుంది అని దాడులు చేసే వారికి తెలియడం లేదు. భారతదేశం వ్యవసాయక దేశం, నాట్లు వేసేవారు, కోతలు కోసేవారు, విత్తులు విత్తేవారు, ఎనభై శాతం దళితులైనప్పుడు, వారు చేసే శ్రమ వలననే మనకి ఆహారం లభిస్తుందని, దాడులు చేసేవారు తెలుసుకోలేక పోతున్నారు. అది వారి అజ్ఞానం, మనకి అన్నం పెట్టే వారి మీదే దాడులు చేయటం వలన మనం ఆర్థిక, సామాజిక రంగాలలో వెనకబడిపోతామని వారికి తెలియట్లేదు. అందువల్లే ఈ దాడులు జరుగుతున్నాయి.
మానవ పరిణామ శాస్త్రాన్ని బట్టి స్పృశ్యా అస్పృశ్య భావాలు కొన్ని మత భావాల వలనే ఏర్పడ్డాయి.... వీటిలో శాస్త్రీయత లేదు. డా॥బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో అస్పృశ్యతా నివారణ చట్టా న్ని రూపొందించిన తరువాత భారతదేశంలో దళితుల చైతన్యం పెరిగింది. అన్ని రంగాలలో వాళ్లు అభివృద్ధి చెందడం ప్రారంభించారు.
ఉత్తరాదిలో పెరిగిన దాడులు..
కానీ భారత రాజ్యాంగం మీద అవగాహనలేని కొన్ని మతవాద, కులాధిపత్య శక్తులు వారి చైతన్యం మీద దెబ్బగొట్టాలని చూస్తున్నారు. ఈ దాడుల వెనుక హిందూ మతోన్మాదుల ఈర్ష్య, ద్వేషం, మాత్సర్యం, క్రోధం దాగి వున్నాయి. దీనికి హిందూ మతోన్మాదుల్లో దాగివున్న మనుస్మృతి భావజాలం మెదడుల్లో నుండి తొలిగిపోక పోవడమే కారణం. అసలు రాజ్యాంగం 17వ అధికరణం ఏమి చెబుతుందంటే. అధికరణం 17- ద్వారా అంటరానితనం నిషేధింపబడింది. దీనిని ఏ రూపంలోనూ ఆచరించకూడదు. అంటరానితనం పేరుతో ఎవరినైనా తక్కువగా చూస్తే చట్ట ప్రకారం శిక్ష విధింపబడుతుందని.
నిజానికి కేంద్రంలో మోడీ పాలన ప్రారంభమైన తర్వాత ఈ దాడులు బీజేపీ పాలిత రాష్ట్రాలలో విపరీతంగా పెరిగాయి. 2014లో నుంచి దళితులపై దాడులు అధికమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అఘాయిత్యాల తీవ్రత మరింత అధికంగా ఉంది. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మిత్రపక్ష పార్టీగా ఉన్న జేడీయూ అధికారంలో ఉన్న బిహార్‌లో 21 పైగా దళితుల ఇళ్లకు నిప్పు పెట్టిన ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2022లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలపై దాడులకు పాల్పడిన కేసులు దాదాపు 23, రాజస్థాన్‌లో 16 శాతం, ఎస్టీలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులు 30 శాతం మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయని నివేదిక తెలిపింది.
ఆరు రాష్ట్రాల్లోనే 81 శాతం కేసులు..
2022లో ఎసిసి (షెడ్యూల్డ్ కులాలు) చట్టం కింద 51,656 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 12,287 (23.78 శాతం), రాజస్థాన్ 8,651 (16.75 శాతం), మధ్యప్రదేశ్ 7,732 (14.97శాతం), బిహార్ 6,799 (13.16 శాతం ), ఒడిశా 3,576 (6.93 శాతం), మహారాష్ట్ర 2,706 (5.24 శాతం) నమోదయ్యాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఎస్సీ చట్టం కింద 81 శాతం కేసులు నమోదవడం విశేషం. 2022లో భారతీయ శిక్షాస్మృతితో కలిపి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దేశ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 52,866 కేసులు నమోదైతే... ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, హర్యానా, గుజరాత్, కేరళ వంటి 13 రాష్ట్రాల్లోనే దాదాపు 97.7 శాతం నమోదయ్యాయని ఈ నివేదిక తెలిపింది. ఈ 13 రాష్ట్రాల్లో ప్రత్యేకించి 2022లో ఎస్టీలపై 9,735 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 2,979 (30.61 శాతం) కేసులతో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక 2,498 (25.66 శాతం)లతో రాజస్థాన్ రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా 773 (7.94 శాతం), మహారాష్ట్ర 691 (7.10 శాతం), ఆంధ్రప్రదేశ్ 499 (5.13 శాతం) వున్నాయి.
దేశ అంతరంగంపై అస్పృశ్యతా కళంకం
దేశ అంతరంగం ఇంకా అస్పృశ్యతా కళంకంతో మసిబారుతుందని దేశంలోని లౌకిక వాదులు, ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. ఈ రాష్ట్రాలే గాక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణాలో కూడా కులాధిపత్య దాడులు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్‌ను సరిగా అమలు జరిపి ప్రత్యేక కోర్టులు ద్వారా వారిని శిక్షించకపోవడమే కారణమవుతున్నాయి. నిజానికి భారతదేశంలో ఈ అస్పృశ్యత కుల భావన వలన సంపద పెరగడం లేదు. సంపద కొందరి చేతుల్లోనే గుత్తాధిపత్యంగానే వుంది. ఈ విషయం మీద సామాజిక విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
చట్ట సమానత్వం ఎలా సాధ్యం?
చట్టం ముందు అందరూ సమానులే. భారత భూభాగ పరిధిలో చట్టం ముందు అందరూ సమానులే. చట్టం నుండి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది. పౌరులకు గల ఈ హక్కును ప్రభుత్వం ఏ పౌరునికీ నిరాకరించరాదు. రాజ్యాంగంలోని 14,15,16,17,18 అధికరణాలు చట్ట సమానత్వానికి సంబంధించినవి. చట్ట సమానత్వాన్ని రూల్ ఆఫ్ లా అంటారు. అంటే చట్టం ముందు ఎవరూ అధికులు కారు. చట్ట పరమైన అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి. అయితే ఆర్థికంగాను, సామాజికంగాను, భౌగోళికపరంగాను, విద్యాపరంగాను అసమానతలున్న ఈ దేశంలో సమాన అవకాశాలు, చట్ట సమానత్వం ఎలా సాధ్యం? అందువలన ఈ అధికరణాన్ని వాస్తవిక దృక్పథంతో, విస్తృత పరిధిలో అన్వయించుకోవాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. అందుకే భారతీయులమంతా అస్పృశ్యత లేని సమాజం కోసం పోరాడదాం. పాలకులు వారి వారి ఓటు రాజకీయాల కోసం రాజ్యాంగ విధూరులు అవుతారు. ప్రజలే స్పృశ్య భారత సృష్టికర్తలు కావాలి. అప్పుడే ప్రపంచంలో భారతదేశం తలెత్తుకు నిలబడుతుంది. ఆ కృషిలో మనందరం భాగస్వాములమౌదాం.
డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695