- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండెల్ని పిండేసిన ప్రమాదం!
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భద్రతా ప్రమాణాలు, ప్రమాద నివారణ చర్యలు, పరిశ్రమల్లో కార్మికుల రక్షణపై పునరాలోచన అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తోంది.

విశాఖ నగరం స్టీల్ ప్లాంట్‌లో 150 టన్నుల వేడి ఉక్కు ద్రవం ఒకేసారి లీక్ అయిన పెను ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం, 6 గురు తీవ్ర గాయాల పాలవడం తీవ్ర విషాదం. 1500 డిగ్రీల వేడిమికి భారీ పరికరాలు కూడా మాడి మసి అయిన దుర్ఘటనలో బాధితులు, మృతులు ఎంత నరకం చూసి ఉంటారో తలచుకుంటేనే గుండె ముక్కలౌతుంది. తమ కుటుంబాల కోసం శ్రమిస్తూ విధి నిర్వహణలో ఉన్న కార్మికులు క్షణాల్లో ప్రాణా లు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ఈ లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గతంలో ప్రమాదాలు జరిగినా, ఇలా భారీ స్థాయిలో విస్పోటనం జరగడం బహుశా ఇదే తొలిసారి. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను, నిర్వహణ, ప్రమాద నివారణ, తనిఖీ వ్యవస్థల పట్ల సందేహాల్ని రేకెత్తించే ప్రమాదమిది. విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ఈ ప్రభుత్వరంగ సంస్థ పట్ల ప్రభుత్వాలు పూర్తి శ్రద్ధ పెట్టడం అవసరం. లాభ నష్టాల కోణాలతో పాటు పూర్తి భద్రత, అవసరమైన సిబ్బంది భర్తీ, ప్రమాద రహిత చర్యలు, ఉద్యోగ భద్రత, గనుల కేటాయింపులతో మంచి ఉత్పాదకత తదితర కోణాలపై దృష్టి పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలను సాధించాలి. జాతి గౌరవంగా భావించాలి. ఇప్పుడు జరిగిన ప్రమాదం ఆయా బాధితుల కుటుంబాలకే పరిమితం కాదు. వారి ప్రాణాల్ని కబళించడంతో పాటు, కర్మాగారం ప్రతిష్టని కూడా మసకబార్చింది. మృతుల త్యాగం వృథా కాకూడదంటే ఈ విషాదం నుంచి గుణపాఠాలు నేర్చు కోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత సురక్షితమైన, ఆధునికమైన, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆదర్శ పరిశ్రమగా తీర్చిదిద్దడమే వారికి నిజమైన నివాళి అవుతుంది. ఆయా కుటుంబాల్ని ఆదుకోవడంతో పాటు ప్రమాదంపై అంతర్జాతీయ ప్రమాణాలతో లోతైన దర్యాప్తు జరగాలి. తప్పుల్ని గుర్తించి లోపాల్ని సరిదిద్దాలి. ఇలాంటి దుర్ఘటనలు ఇక ఎన్నడూ పునరావృతం కాకూడదంటే సంపూర్ణ ప్రమాద రహిత కర్మా గారంగా తీర్చిదిద్దే సమగ్ర చర్యలు అవసరం.
-డా.డీవీజీ శంకరరావు,
94408 36931






