- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహుముఖ ప్రజ్ఞాశీలి మలయశ్రీ
ప్రముఖ కవి, పరిశోధకులు, శతాధిక గ్రంథకర్త డాక్టర్ మలయశ్రీ (86) కన్నుమూశారు. తెలుగు సాహిత్యంలో తొలి కంద పద్యాలు కరీంనగర్ జిల్లాలోనే పుట్టాయని నిరూపించిన ఆయన అసాధారణ సాహితీ ప్రస్థానం, హేతువాద దృక్పథం మరియు తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర గురించి పూర్తి వివరాలు..

తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించిన డాక్టర్ మలయశ్రీ కొంతకాలంగా వయోభారంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తన 86 ఏట భౌతికంగా మన మధ్య నుండి నిష్క్రమించారు.. ఆయన ప్రముఖ కవి, రచయిత, కథకుడు, నవలాకారుడు, శతాధిక గ్రంథ కర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు..
మలయశ్రీ 1940 ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రామంలో జన్మించారు. ఎంఏ, ఎంఓఎల్, పీహెచ్‌డీ చేసిన ఆయన ప్రభుత్వ తెలుగు టీచర్‌గా, లెక్చరర్‌గా పని చేశారు.. ఆయన చరిత్రకారుడే కాకుండా నిరంతర సాహితీ సృజన శీలి కూడా.. ఏ విషయాన్ని అయినా కూలంకషంగా అధ్యయనం చేయడం, తెలుసుకోవడం తన రచనల ద్వారా ఇతరులకు ఎరుక పరచడం ఆయనకు గల ఏకైక సుగుణం. అందుకే ఆయన బహుముఖంగా విస్తరించిన అపురూపమైన అరుదైన ప్రజ్ఞాశీలి.
జగమెరిగిన హేతువాది!
మలయశ్రీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన హేతువాది. చెప్పింది నిజజీవితంలో ఆచరించి చూపిన మార్గదర్శి. ఆయన నడిచి వచ్చిన తొవ్వ అనితర సాధ్యం. ఆయనే చెప్పుకున్నట్టు భౌతికవాది, లోక విరోధి అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఉపాధ్యాయ పదవీ విరమణ చేసిన తరువాత కరీంనగర్ పట్టణంలో స్థిరనివాసం ఏర్ప రచుకున్నారు. భౌతిక వాది అనే పత్రికను తీసుకువచ్చాడు. నవ్య సాహిత్య పరిషత్‌ను స్థాపించి ప్రగతిశీల కవులకు ప్రతిభ కలిగిన రచయితలకు అవార్డులు అందజేశారు.. ఒక సామాన్య కుటుంబంలో జన్మించినా, అసామాన్యంగా తన ప్రతిభ వ్యుత్పత్తులను తెలుగునేల నలు దిశలా వెదజల్లిన మలయశ్రీ శతాధిక గ్రంథకర్త. ఆయన 1974లో రాసిన శాంతి పథం నాటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు నాన్ డీటెయిల్ ఉపవాచకంగా ఎన్నిక చేయబడినది.
తెలుగు భాషా ప్రేమికుడు..
కరీంనగర్ జిల్లా చెంజెర్లలో 1940లో పుట్టిన మలయశ్రీ. 50 పైగా పుస్తకాలు రాశారు.. నవ్యసాహిత్య పరిషత్‌ను స్థాపించి ప్రగతిశీల రచయితలకు ప్రతి ఏటా మలయశ్రీ సాహితీ అవార్డు అందజేశారు. ‘కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’ అనే అంశంపై పరిశోధన చేసి 1995లో డాక్టరేట్ అందుకున్నారు. క్రీ.శ. 946 నుంచి 1995 వరకు కరీంనగర్ జిల్లా వెయ్యేండ్ల సాహిత్య చరిత్రపై లోతుగా పరిశోధించి, అక్షరీకరించారు. గంగాధర మండలం కురిక్యాల బొమ్మలమ్మ గుట్టపై క్రీ.శ. 946 కాలపు జినవల్లభుని త్రిభాషా శాసనంలోని మూడు కంద పద్యాలే తెలుగు సాహిత్యంలో మొదటివనీ, కందం పుట్టింది కరీంనగర్ జిల్లాలోననీ, మలయశ్రీనే తొలిసారి వెలుగులోకి తెచ్చారు. పోతన రచనగా భావించిన ‘నారాయణ శతకం’ రాసింది ‘వెలగందుల నారయ’ అని మలయశ్రీ నిరూపించారు. ‘శ్రీకృష్ణ శతకం’ రచించింది మన ధర్మపురి కాకుత్సం రామాజు కవి అని సాక్ష్యాధారాలతో తేల్చి చెప్పారు. 150కి పైగా గ్రంథాలు రచించారు. ఆయన రచనలు నేటికీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ‘బాల సాహిత్యం’ ద్వారా చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచారు. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. తెలుగు భాష ఎంత ప్రాచుర్యమైందో, అంతే విశిష్టమైందని, దానిని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని తెలిపారు..
తెలంగాణ ఉద్యమానికి చేయూత
మలయశ్రీ కవిగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తన కవితలు, పద్యాలతో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులను చేశారు. మాతృభాష సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. తెలుగు భాష సంరక్షణ సమితి స్థాపించి కొనసాగించారు. అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వ హించి చైతన్యం తీసుకొచ్చారు. తన రచనల్లో జాగృతి పద్యకావ్యం, చదువు పాటలు, అమ్మ భాష శతకం, తెలంగాణ గెలుపు, సబల పుస్తకాలు ఇప్పటికే ప్రచారం పొందాయి. మొగ్గలు, తెలుగు వెలుగు శతకం పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ కథకు ప్రాచుర్యం లేదు..
తెలంగాణ రచయితలు మాండలికాన్ని విస్మరించలేదు. కానీ దానికి తగిన గుర్తింపు లేకపోవడం వల్ల తెలంగాణలో తొలి నుంచి కథలు, నవలలకు పెద్దగా ప్రాచుర్యం పొందలేదని, విప్లవ గీతాల మాండలికం చూసి 1980 తర్వాతనే ఇక్కడ మాండలిక భాషా కథలు వస్తున్నాయని మలయశ్రీ చెప్పారు.. తెలంగాణ మాండలిక భాషలో పల్లెసీమ గేయకావ్యాన్ని 1976లో రాశానని, 1982లో రాసిన తిరుగుబాటు మాండలిక నవలకు విశాలాంధ్ర బహుమతి వచ్చిందని తెలిపారు. 1935 నాటి గోల్కొండ సంచిక మొత్తం కవుల సంచికగానే తయారవడం చూస్తే తెలంగాణలో కథలకు, నవలలకు చాలా తక్కువ ప్రాతినిథ్యం ఇచ్చారని స్పష్టమవుతుందన్నారు. రాసిన కొన్ని కథా, నవలా రచనలు కూడా వెలుగు చూడలేదు. నాడే కాదు ఈనాడు కూడా తెలంగాణ ప్రాంతాన ఇక్కడి వారి పత్రికలు, ప్రచురణ సంస్థలు లేకపోవడం ఇక్కడి రచయితలకు పెద్ద నష్టం, కష్టమనీ.. పత్రికలు, రచయితలు పెరిగి ఇంత ప్రోత్సాహం అందుతున్నది మూడవ తరం తెలంగాణ కథా రచయితలకేనని మలయశ్రీ స్పష్టం చేశారు.
చెరగని పాద ముద్రలు..
ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా (1971, 2002) రెండుసార్లు పురస్కారాలు అందుకున్నారు. మూడుసార్లు హైదరాబాద్‌లో రవీంద్రభారతి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పద్య తెలంగాణంలో పాల్గొని ప్రశంసలు పొందాడు. ఆయన రచనలలో ముఖ్యమైన గ్రంథాలు. శాంతిపధము 1975, మానవగీతి 1986, సత్యసూక్తం (నాస్తికత్వం ఎందుకు?) 1997, కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర, ఐరేణి కుండలు - కథా సంపుటి మొత్తం కలిపి 100 పైగా గ్రంథాలు రచించారు. మలయశ్రీ మరణం హేతువాద సమాజానికి తీరని లోటు.. ముఖ్యంగా కరీంనగర్ సాహిత్య లోకంలో ఆయన అడుగుజాడలు చెరగని పాద ముద్రలు..
-జూకంటి జగన్నాథం
94410 78095






