- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలదోపిడిపై పోరాటం తప్పదు..!
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కృష్ణా నదిలో జరుగుతున్న జలదోపిడీని వెంటనే అరికట్టి, వలస జిల్లాగా పేరున్న

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కృష్ణా నదిలో జరుగుతున్న జలదోపిడీని వెంటనే అరికట్టి, వలస జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లాను రిజర్వాయర్ల జిల్లాగా మార్చేందుకు ప్రజలు మరో పోరాటం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జలదోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాలు వచ్చాయి. అయితే తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పక్కనున్న తెలుగు రాష్ట్రం జల దోపిడీ కొనసాగిస్తూనే వుంది. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా బచావత్ ముందు బలంగా వాదనలు వినిపించాలి.
గతంలో పాలించిన పాలకులందరూ తెలంగాణపై మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లాపై శీతకన్ను వేశారు. తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు ఆనాటి ఆంధ్ర రాజకీయ పరిస్థితుల్లో కిమ్మనకుండా ఉండిపోయారు. తాగునీరు, సాగునీటి కోసం విజ్జులు, మేధావులు జలసాధన సమితిలు పెట్టి ఎడారిగా మారుతున్న పాలమూరు జిల్లాలో అనేక పాదయాత్రలు, పోరాటాలు చేశారు. అయినా జిల్లాకు రావాల్సిన నీటి వాటితో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని చెప్పక తప్పదు.
జల దోపిడీ అరికట్టలేని ప్రభుత్వాలు..
ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణాలు జరిగితే తెలంగాణ వారే మంగళ హారతులు పట్టి స్వాగతం పలికిన సంఘటనలు చూసాం. అంటే ఆంధ్రవాళ్లు ఎలా వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రితో దోస్తాన్ చేసి చెప్పిన మాటలు ప్రజలందరికీ తెలిసిందే. గత ప్రభుత్వాల తప్పిదం వల్లే నీటి విషయంలో తెలంగాణ నిత్యం దోపిడీకి గురవుతుందన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రతిరోజు కొన్ని టీఎంసీల నీళ్లు ఆంధ్ర వాళ్ళు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆనాటి నుండి జల దోపిడీని ప్రభుత్వాలు అరికట్టడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి.
పాలమూరుకి జల యుద్ధమే గతి
ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం నుండి నేటి బనకచర్ల వరకు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. వాటికి ఏ అనుమతులు వున్నాయో ప్రజలందరికి తెలిసిందే? ఏపీలో బనకచెర్ల నిర్మించి రాష్ట్రానికి జలహారతి ఇస్తానంటూ, శక్తి ఉంటే అడ్డుకోండి అంటూ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడుతున్నారు. బనకచర్ల జల దోపిడికి మరో కారణమని చెప్పకోవచ్చు. దీనిని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణతోపాటు తెలంగాణ జిల్లాల్లోని మరీ ముఖ్యంగా అన్ని రకాలుగా పూర్తిగా నష్టపోతున్న పాలమూరు జిల్లా ప్రజలు ఇక జల యుద్ధం చేయక తప్పదు. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని దేవ నగర్ దగ్గర కర్ణాటకకు వీడ్కోలు చెప్పి తెలంగాణలో నారాయణపేట జిల్లా, కృష్ణ మండలం, తంగడి దగ్గర కాలు మోపుతుంది. నది పొడవు దాదాపు 430 కి.మీ.
పాలమూరు ప్రాజెక్టు పనితీరు
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని కరువు ప్రాంతం పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టి సస్యశ్యామలం చేస్తారనుకుంటే అది కంటితుడుపు చర్యగానే మారింది. ఎన్నో పోరాటాల ఫలితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2013లో జీవో వస్తే 2023 నాటికి పూర్తి చేయలేక పోయింది. కేవలం ఒక పంపును రన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించామనిపించుకున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, పాలమూరుపై వివక్ష చూపి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని గోదావరి నీళ్లతో తడుపుతామని లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మాణం చేశారు. కానీ పాలమూరు, రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులను మాత్రం గాలికి వదిలేశారు.
చెరువులు నింపి కాలం గడిపితే..
ఇది ఒక వైపు అయితే మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో కేవలం మూడున్నర టీఎంసీల కెపాసిటీ గల మూడు రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. దాదాపు 25 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించుకోలేని కారణంగా కేవలం చెరువులు నింపి కాలం గడుపుతున్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా రిజర్వాయర్ల నిర్మాణం నత్తనడకన జరుగుతుంది తప్ప ఒక ఎకరాకు కూడా ఇప్పటి వరకు నీళ్లు దక్కలేదు. గత ప్రభుత్వ హయాంలోనే శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న సమయంలోనే రాయలసీమకు 3,500 క్యూసెక్కుల నీళ్లు తీసుకపోతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించారు.
చివరి పొలాలకు నీరందకున్నా..
ప్రాజెక్టుల ద్వారా భూములు కోల్పోయిన నిర్వాసితులతో పాటు చివరి పొలాలకు నీరందకముందే అధికార ధర్పంతో కొందరు ప్రజాప్రతినిధులు వాళ్ల వాళ్ల నియోజకవర్గాలకు నీళ్లను తరలించుకుపోయారు. ఇందులో భాగంగానే మరోవైపు ఏదుల రిజర్వాయర్ నుండి డిండికి పెద్ద కాలువల ద్వారా నీళ్లు తరలించడానికి చర్యలు చేపడుతున్నారు? నాగర్ కర్నూల్ జిల్లాలోని రైతాంగం తమ సాగు యోగ్యమైన భూములను ప్రాజెక్టుల కోసం ఇచ్చి నిర్వాసితులుగా మారి ఉన్న భూమిలో రెండు పంటలు పండించుకోవడానికి నీరందక అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. 1956 నుండి ఇప్పటివరకు పాలమూరు జిల్లాకు ఎటు చూసినా నీళ్ల విషయంలో నష్టం జరిగింది. ఆంధ్ర నాయకులు లాబీయింగ్ చేసి బచావత్ దగ్గర ఎక్కువ నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అందులో తెలంగాణకు ఆ వాటా దక్కలేదు.
ఈ పక్షపాతం దేనికి?
ఏపీకి వందల టీఎంసీల నీళ్లు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణకు ఉన్న నీళ్లను వాడుకోవడానికి నిలువ చేసుకోవడానికి రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలం అని చెప్పాలి. 2015లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రకు 512 టీఎంసీలు కేటాయింపులపై ముఖ్యమంత్రులు సంతకాలు చేసుకున్న విషయం విధితమే. తెలంగాణలో ఇప్పటివరకు, 190 టీఎంసీలకు మించి నీళ్లు వాడుకున్న దాఖలాలు లేవు. ఇది ఒకవైపు అయితే కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ కర్ణాటక, మహారాష్ట్ర జోలికి పోకుండా కేవలం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని నదులను ప్రాజెక్టులను వాళ్ల అధీనంలోకి తీసుకోవడం పక్షపాత వైఖరికి నిదర్శనం. విభజన చట్టంలోని నీళ్ల విషయంలో పోరాటం చేయడంతో పాటు కృష్ణా నదిలో తీసుకుంటున్న నీళ్లను పోసుకోవడానికి రిజర్వాయర్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలి. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా బచావత్ ముందు బలంగా వాదనలు వినిపించాలి. తెలంగాణకు రావలసిన నీటి వాటాను కేటాయించుకొని తెలంగాణ తోపాటు తెలంగాణ జిల్లాలలో పూర్తిస్థాయిలో నీళ్లు పారి రైతుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పాలకులు ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-ముచ్చర్ల దినకర్
94407 04535






