కాలం అంచున కన్నీటి బతుకులు

by Disha edit |
కాలం అంచున కన్నీటి బతుకులు
X

నాకు 15 వేల జీతం వస్తుంది. తమ్ముడు పొద్దున వెళ్లి రాత్రి వరకు కష్టపడితే నెలకు 15 వేలు వస్తాయి. ఆ పైసలు మన ఖర్చులకు చాలడం లేదు. నెలాఖరులో అప్పులు చేయాల్సి వస్తుంది. డాడీ తాగుడు మానడు. మాన్పిస్తే ఆయన నిలబడలేడు. నెలకు 8 వేల కిరాయి కడుతూ, మందులు, సరకులు ఎలా? అందుకే నాకు పెళ్లొద్దు' అంది శ్రుతి. మొత్తానికి ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం రాజయ్య ఆటో తీసుకొని ఫీల్డ్ మీదకు వెళ్లాడు.

జ్వేల్ సమీపంలోని పల్లెటూరుకు చెందిన రాజయ్య కుటుంబం 30 ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చింది. మచ్చబొల్లారంలోని ఇంటిలో కిరాయకు ఉంటున్నది. రాజయ్య భార్య పేరు సంధ్య. వీళ్లకు ఇద్దరు సంతానం. బాబు, పాప. రాజయ్య కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. కాలం కలిసిరావడంతో నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు. అడ్వాన్సు చెల్లించి రెండు కార్లు కొన్నాడు. వాటిని కిరాయకు ఇస్తూ బతుకు బండిని బాగా లాగించేవాడు. పిల్లలను కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశాడు. సంసారం సాఫీగా సాగింది.

ఓ కారు ప్యాసింజర్‌ను తీసుకొని తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. కారు నుజ్జునుజ్జయింది. డ్రైవర్ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు స్టేషన్లు, కేసులు, కోర్టులు, తిరిగి తిరిగి వేసారి ఉన్న కారు కూడా అమ్మేశాడు. భార్య నగలు తాకట్టు పెట్టాడు. పెద్దమ్మాయి శ్రుతి పదో తరగతి పూర్తయింది. కొడుకు సందీప్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఫీజు కట్టే స్థోమత లేక గవర్నమెంట్ స్కూలుకు మార్పించాడు.. అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. ఫైనాన్స్‌లో అప్పు చేసి ఆటో కొన్నాడు. ఆ ఆటోయే బతుకుదెరువుగా మారింది.

*

బతికి చెడ్డ కుటుంబం. ప్రతి పైసాకు కష్టం తట్టుకోలేకపోయాడు రాజయ్య. తాగుడుకు బానిసయ్యాడు. ఆటో నడపడం ద్వారా 400 వస్తే 300 తాగుడుకే ఖర్చు చేసేవాడు. కిరాయి ఎల్లడం కష్టం కావడంతో సందీప్ ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువు ఆపేసి గ్యాస్ డెలివరీ బాయ్‌గా చేరాడు. శ్రుతి మాత్రం డిగ్రీ పూర్తి చేసింది. తాగుడుకు బానిసైన తండ్రిని మందలించలేక, తమ్ముడు చేస్తున్న పనితో వచ్చే ఆదాయం సరిపోక పడుతున్న ఇబ్బందిని గ్రహించిన ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది.

జీతం నెలకు రూ. 15 వేలు. తమ్ముడికి నెలకు 15 వేలు. తండ్రి సంపాదించినా, సంపాదించకపోయినా బతుకు బండి ఢోకా లేకుండా సాగుతున్నది. ఆటో ఫైనాన్స్‌లో తీసుకున్న రాజయ్య ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఇంటి మీదకు వస్తున్నారు. వాళ్లకు ఏదో సర్ది చెప్పి పంపుతోంది సంధ్య. విషయం తెలుసుకున్న రాజయ్య తాగుడు డోసును మరింత పెంచాడు. ఇంట్లోకి రూపాయి ఇవ్వడం లేదు. నాన్నంటే భయం, గౌరవంతో ఉన్న పిల్లలిద్దరూ స్వరం పెంచారు. తాగుడు మానేయాలని బెదిరించారు. బతిమాలారు. కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డారు. ఆ సమయంలో కన్నీరు పెట్టుకున్న రాజయ్య మరుసటి రోజు మాత్రం ఎప్పటిలాగే తాగి ఇంటికొచ్చాడు. ఎవరూ మాట్లాడలేదు.

*

శ్రుతికి 24 ఏండ్లు దాటాయి. పెండ్లి చేయాలి, ఎలా? చేతిలో చిల్లి గవ్వలేదు. టెన్షన్ పడుతోంది సంధ్య. తమ్ముండ్లను పిలిపించింది. విషయం చెప్పింది. వాళ్లు సాయం చేస్తామన్నారు. సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. రెండు మూడు సంబంధాలు వచ్చాయి. అందులో ఓ అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలకు 90 వేల వరకు జీతం. మలక్‌పేటలో సొంత ఇల్లు ఉంది. నెలకు 50 వేల వరకు కిరాయలు కూడా వస్తాయి. తల్లిదండ్రులిద్దరూ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగులు. కుందనపు బొమ్మలా ఉండే శ్రుతిని చూసి ఓకే చెప్పేశారు.కానీ 'నాకు నచ్చలేదు, వద్దు' అంది శ్రుతి.

'ఎందుకు? బాబు బాగానే ఉన్నాడు కదా? పైగా స్థితిమంతుల కుటుంబం' అని ఒప్పించే ప్రయత్నం చేశారు ఇంట్లోవారు. అయినా ససేమిరా అంది. ఏం చేయాలో అర్థం కాక బిడ్డను తీసుకొని డాబా మీదకు వెళ్లింది సంధ్య. 'చెప్పు బిడ్డా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ప్రేమించావా? ' అని బుజ్జగిస్తూ అడిగింది సంధ్య. లేదని ముఖం కిందకు వేసింది శ్రుతి. 'నా బంగారు తల్లి కదూ చెప్పవే. నీ ఇష్టాన్ని మేం కాదనం' అంటూ దగ్గరికి తీసుకుంది. అంతే భల్లున ఏడ్చేసింది శ్రుతి. 'నా మట్టుకు నేను పెళ్లి చేసుకొని వెళ్లిపోతే మీరెలా బతుకుతారు?' ఆ మాటలు సంధ్యను కదిలించాయి. 'ఊకోవే నా తల్లి కదూ' అంటూ సంధ్య సైతం ఏడ్చేసింది.

*

'నాకు 15 వేల జీతం వస్తుంది. తమ్ముడు పొద్దున వెళ్లి రాత్రి వరకు కష్టపడితే నెలకు 15 వేలు వస్తాయి. ఆ పైసలు మన ఖర్చులకు చాలడం లేదు. నెలాఖరులో అప్పులు చేయాల్సి వస్తుంది. డాడీ తాగుడు మానడు. మాన్పిస్తే ఆయన నిలబడలేడు. నెలకు 8 వేల కిరాయి కడుతూ, మందులు, సరకులు ఎలా? అందుకే నాకు పెళ్లొద్దు' అంది శ్రుతి. మొత్తానికి ఆరోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం రాజయ్య ఆటో తీసుకొని ఫీల్డ్ మీదకు వెళ్లాడు. ఆ రోజు రంజాన్ కావడంతో శ్రుతి ఆఫీసుకు సెలవు. సందీప్ గ్యాస్ డెలివరీ కోసం వెళ్లిపోయాడు.

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చాడు రాజయ్య. అప్పటికే మద్యం తాగి ఉన్నాడు. ఇంట్లోకి రాగానే బిడ్డ కాళ్లపై పడి ఏడ్చాడు. ' పెండ్లి చేసుకోవే నా బంగారం, మా అమ్మ కదూ, నా మాట వింటుంది' అంటూ బుజ్జగించాడు. 'నువ్ పెండ్లి వద్దంటే నేను సచ్చిపోత' అంటూ వలవలా ఏడ్చాడు రాజయ్య. శ్రుతికి కన్నీళ్లు ఆగలేదు. తండ్రిని ఏం అనాలో అర్థం కాలేదు. చకచకా బెడ్ రూంలోకి వెళ్లిపోయింది. సెల్ఫ్‌లో ఉన్న శానిటైజర్ బాటిల్ తీసుకొని గటగటా తాగేసింది. ఎవరూ గమనించలేదు. ఐదు నిమిషాల తర్వాత వాంతులు చేసుకున్నది. వంటింటిలో ఉన్న సంధ్య పరిగెత్తుకుంటూ వచ్చింది. 'ఏమైంది బిడ్డా' అంటూ ఏడుపందుకుంది.

*

శ్రుతికి మాట రావడం లేదు. గుడ్లు తేలేస్తున్నది. సంధ్య గబగబా రూంలోకి వెళ్లి చూసింది. శానిటైజర్ బాటిల్ పడేసి ఉంది. ఏడుస్తూ 'అర్జంటుగా రా బిడ్డా.. అక్క అక్క' అంటూ సందీప్‌కు ఫోన్ చేసింది. డ్యూటీ మధ్యలోనే వదిలేసి ఇంటికొచ్చాడు సందీప్. ఇద్దరు కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు మెడికో లీగల్ కేసు అన్నారు. ముందైతే 20 వేలు కట్టండి అన్నారు. సంధ్య మెడలో పుస్తెల తాడు తీసి వాళ్ల చేతిలో పెట్టింది. 'ముందైతే వైద్యం చేయండయ్యా, గంటలో డబ్బులు ఇస్తాం' అన్నది.డబ్బులే కావాలని భీష్మించారు దవాఖానవాళ్లు. కాళ్లావేళ్లా పడి బతిమాలితే అంగీకరించారు.

'48 గంటలు గడిస్తేనే గండం గట్టెక్కినట్టు' అంటూ జాయిన్ చేసుకున్నారు. మరుసటి రోజు మాటొచ్చేసింది. సంధ్య డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. 'సార్ నా బిడ్డ బతుకుతుంది కదా, పానాలకు ఏం అపాయం లేదు కదా?' అంటూ దీనంగా అడిగింది. 'రేపటి వరకు ఏం చెప్పలేం' అన్నారు. రాత్రంతా జాగారం చేశారు. బిడ్డను బతికించమని మదికి వచ్చిన దేవుడికల్లా మొక్కారు. తెల్లారగానే ఐసీయూలోకి పరుగులు తీసింది సంధ్య. శ్రుతికి మెలకువ వచ్చింది. 'అమ్మా.. కడుపు నొప్పిగా ఉందే.. కొన్ని నీళ్లు కావాలి' అడిగింది శ్రుతి. 80 వేల రూపాయలు ఫీజు కట్టించుకొని డిశ్చార్జ్ చేశారు. మండుతున్న ధరలు ఓ వైపు, ఆగమవుతున్న బతుకులు మరోవైపు. ఇదీ మధ్యతరగతి మహాభారతం!!

ఎంఎస్ఎన్ చారి

7995047580

Next Story