Afganistan: మొండి తాలిబన్లు

by Disha edit |
Afganistan: మొండి తాలిబన్లు
X

వారు ఏమి ఆశించి ఇలాంటి కట్టుబాట్లు పెడుతున్నారో వారికే తెలియాలి. అప్ఘానిస్తాన్ దేశాన్ని కట్టడి చేయడంలో అగ్రరాజ్యాలు స్పందించాలి. ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని అంతర్జాతీయ సూత్రం ఉన్నా ఆ దేశంలో సామాజిక న్యాయం కోసం చొరవ తీసుకోవాలి. ఇక తాలిబన్లు ఇప్పటికైనా కళ్లు తెరిచి వారిపై ఉన్న ఆంక్షలను తొలగించాలి. లేకపోతే ఆ దేశం మహిళా వ్యతిరేక దేశంగా ముద్రపడిపోతుంది. అప్పుడు అభివృద్ధి ఏమాత్రం ఉండదు. మహిళ లేకుండా ఎవరి పుట్టుక ఉండదు. అలాంటి మహిళలపై ఆంక్షలు తొలగించే విషయంలో ఆలోచించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా తాలిబన్లు వారి మొండి వైఖరి విడనాడి వారికి స్వేచ్ఛ కల్పిస్తారని ఆశిద్దాం.

ఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతోనే అక్కడి మహిళలకు హక్కులు హరించుకుపోయాయి. మహిళలను చదువుకు దూరం చేయడం, ఉద్యోగాలలో వారు పని చేయకుండా హుకుం జారీ చేయడం శోచనీయం. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉన్నప్పుడు కుటుంబ పోషణార్థం మహిళలు ఉద్యోగాలు చేస్తే తప్పేంటి? ఒకవేళ అలా బలవంతంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలనుకుంటే కనీసం నెల నెల పెన్షన్ సౌకర్యమయినా ఎందుకు కల్పించడం లేదు? ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై అతి క్రూర విధానాలను అనుసరిస్తున్న తాలిబన్ల చర్యలను అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

దేశ రక్షణ కొరకు అంటూ

దేశానికి మహిళా శక్తి ఎంతో అవసరమని, అందుకే ఆ దేశంలో మహిళలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కెనడా, డెన్మార్క్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, నార్వే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, అమెరికా, బ్రిటన్ దేశాలు కోరాయి. ముస్లిం దేశాలలో కూడా మహిళలు చదువులు చదివి ఉద్యోగాలు చేసి ఏకంగా ప్రధానులు అయిన వారు ఉన్నారు. దేశానికి మహిళ బలం గొప్పది. నేడు దేశానికి వారి చోదక శక్తి ఎంతో అవసరం. అందుకే మహిళలపై ఆంక్షలు విధించడం ఎట్టి పరిస్థితులలోనూ సహేతుకంగా లేదని చాలా దేశాలు తాలిబన్ల చర్యలను తప్పుబడుతున్నాయి. అయితే, ఇన్నిదేశాలు అభ్యర్థించినా తాలిబన్లు మాత్రం తమ నిర్ణయాలు దేశ రక్షణ కొరకే అని సమర్థించుకుంటున్నారు.మహిళలు ఇంటి పట్టునే ఉండాలని మూర్ఖంగా వాదిస్తున్నారు. వారి ఆంక్షలతో చాలా మంది మహిళలు వారి గృహాల నుండి బయటకు రాలేని పరిస్థితి.

నేడు అఫ్ఘానిస్తాన్‌(afganistan) మహిళలు ప్రపంచంలో ఏ దేశంలోని లేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారి చదువు అర్ధంతరంగా మాన్పించడంతో తమ అభివృద్ధికి దేశ పాలకులు సహకరించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మానవ మనుగడ సాగించాలంటే మహిళలు కచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే. దేశంలో వెనుకబడిన వారికి, అణగారినవర్గాల వారికి మహిళల సహకారం లేకపోతే వారి మనుగడ కష్టమని ఇది క్రమంగా దేశ భవిష్యత్ దుర్భరం అవుతుందని తాలిబన్లు గ్రహించాలి.

సామాజిక న్యాయం కోసం

మహిళలు చదువుకోవాలన్న, ఉద్యోగాలు చేయాలన్నా అది వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంతేకానీ, వారిని శాసించకూడదు. మహిళలపై ఇలాంటి ఆంక్షలు విధిస్తున్న దేశాలపై ఇతర దేశాలన్ని కలిసి ముప్పేట దాడి చేయాలి. వారితో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. వారికి ఏ సహకారం అందించకూడదు. అలాంటి దేశాలకు అన్ని దేశాలు వ్యతిరేకంగా స్పందించాలి. అప్పుడు కానీ ఆ దేశాలు కళ్లు తెరవవు. వారు ఏమి ఆశించి ఇలాంటి కట్టుబాట్లు పెడుతున్నారో వారికే తెలియాలి. అప్ఘానిస్తాన్ దేశాన్ని కట్టడి చేయడంలో అగ్రరాజ్యాలు స్పందించాలి.

ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని అంతర్జాతీయ సూత్రం ఉన్నా ఆ దేశంలో సామాజిక న్యాయం కోసం చొరవ తీసుకోవాలి. ఇక తాలిబన్లు ఇప్పటికైనా కళ్లు తెరిచి వారిపై ఉన్న ఆంక్షలను తొలగించాలి. లేకపోతే ఆ దేశం మహిళా వ్యతిరేక దేశంగా ముద్రపడిపోతుంది. అప్పుడు అభివృద్ధి ఏమాత్రం ఉండదు. మహిళ లేకుండా ఎవరి పుట్టుక ఉండదు. అలాంటి మహిళలపై ఆంక్షలు తొలగించే విషయంలో ఆలోచించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా తాలిబన్లు(talibans) వారి మొండి వైఖరి విడనాడి వారికి స్వేచ్ఛ కల్పిస్తారని ఆశిద్దాం.

కనుమ ఎల్లారెడ్డి

93915 23027

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story