తాడిచర్ల గని.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇంధనం!

by Ravi |   (  Updated:2026-07-16 00:45:57  IST  )

సింగరేణికి తాడిచర్ల బొగ్గుగని కేటాయింపు తెలంగాణ ఇంధన భద్రత, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి ఎందుకు కీలకం? ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రాధాన్యం..

తాడిచర్ల గని.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇంధనం!
X

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ అభివృద్ధి విషయంలో తీసుకునే నిర్ణయాలను రాజకీయ కళ్లజోడుతో కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. సింగరేణికి తాడిచర్ల బొగ్గు గనిని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయించడం అలాంటి నిర్ణయాల్లో ఒకటి. ఇది కేవలం ఒక బొగ్గుగని కేటాయింపు కాదు.. తెలంగాణ ఇంధన భద్రతకు, సింగరేణి భవిష్యత్తుకు, వేలాది కార్మిక కుటుంబాల జీవనోపాధికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయం.

పాత గనులు మూతబడే స్థితిలో..

సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో సుమారు 7.5 శాతం ఉత్పత్తిని సింగరేణి ఒక్కటే అందిస్తోంది. 2023-24లో సింగరేణి 70.02 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. 2024-25లో కూడా సుమారు 69.01 మిలియన్ టన్నుల ఉత్పత్తిని కొనసాగించింది. గత ఏడాది సింగరేణి యాజమాన్యం భవిష్య త్తులో పాత గనులు మూతపడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాకుల అవసరాన్ని ప్రస్తావించింది. ఇలాంటి సమయంలో తాడిచర్ల గని కేటాయింపు సాధారణ నిర్ణయం కాదు. ఇది సింగరేణి ఉత్పత్తి కొనసాగింపుకు, తెలంగాణ విద్యుత్ రంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి బలమైన భరోసా. తెలంగాణలోని అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగరేణి బొగ్గుపైనే ఆధారపడి ఉన్నాయి. కొత్త విద్యుత్ యూనిట్ల బొగ్గు అవసరాలను కూడా తాడిచర్ల బ్లాక్ వంటి వనరులతో తీర్చే ప్రణాళిక రూపొందించబడింది.

రాజకీయ విభేదాలకు అతీతంగా..

రాజకీయంగానూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో రాజకీయ భేదాలకు అతీతంగా వ్యవహరిస్తోందని ఇది సూచిస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలనే దృక్పథం సహకార సమాఖ్య వ్యవస్థకు బలాన్నిస్తుంది. కొందరు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపరుస్తోందని విమర్శి స్తుంటారు. కానీ వాస్తవ గణాంకాలు వేరే ఉన్నాయి.. దేశ బొగ్గు ఉత్పత్తి 2023-24లో 997.83 మిలియన్ టన్నుల నుంచి 2024-25లో 1047.5 మిలియన్ టన్నులకు పెరిగింది. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలనే వ్యూహాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అదే సమయంలో సింగరేణి వంటి ప్రజారంగ సంస్థలకు కూడా కొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఈ నిర్ణయం ఉపాధి పరంగానూ కీలకం. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 40 వేల మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితో పాటు వేలాది కాంట్రాక్ట్ కార్మికులు, రవాణా, యంత్రాల నిర్వహణ, చిన్న పరిశ్రమలు, సేవారంగం సింగరేణిపై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త గనులు లేకుంటే భవిష్యత్తులో ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉండేది.

సింగరేణి సద్వినియోగం చేసుకుంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ‘వికసిత భారత్ – 2047’ లక్ష్యానికి ఇంధన భద్రత కీలక ఆధారం. పరి శ్రమలు, రైల్వేలు, తయారీ రంగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ – ఇవన్నీ విశ్వసనీయ విద్యుత్ సరఫరాపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే బొగ్గు ఉత్పత్తిని పెంచడం ఇప్పటికీ జాతీయ వ్యూహంలో ప్రధాన అంశంగా కొనసాగుతోంది. తాడిచర్ల గని కేటాయింపు తెలంగాణకు రాజకీయ లాభనష్టాల అంశం కాదు.. ఇది అభివృద్ధి, ఉపాధి, ఇంధన భద్రత, పారిశ్రామిక స్థిరత్వానికి సంబంధించిన నిర్ణయం. ఈ అవకాశాన్ని సింగరేణి ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, పార దర్శక పరిపాలనతో సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ పారిశ్రామిక రంగానికి మరో బంగారు అధ్యాయం ప్రారంభమైనట్లే. తాడిచర్ల గని కేటాయింపును అదే విస్తృత దృక్పథంతో చూడాల్సిన సమయం ఆసన్నమైంది.

- పూసాల మోహన్ చారి,

98667 09607

Next Story