- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్ట్ రూమ్ డ్రామాకు పరాకాష్ట
జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సిస్టమ్’ కోర్ట్‌రూమ్ డ్రామాపై సమగ్ర విశ్లేషణ. మహిళల ఐక్యత, పితృస్వామ్యం, న్యాయం మధ్య సంఘర్షణను చూపించిన ఈ లీగల్ థ్రిల్లర్ ఎలా ఉందో తెలుసుకోండి.

సినిమా కోర్ట్‌రూమ్ డ్రామా సినిమాల్లో చట్టం, న్యాయం అనే మాటలు అత్యంత శక్తివంతంగా కనిపిస్తాయి. న్యాయస్థానం అనే నాలుగు గోడల మధ్య జరిగే వాదనలు, సాక్ష్యాలు, ప్రశ్నలు కేవలం చట్టపరమైన అంశాలు మాత్రమే కాదు. అవి సమాజపు విలువలు, అధికార వర్గాలు, వాటి రూపాలు, మానవ హక్కులు, లింగ వివక్ష, కుల అస మానతలను అన్నీ దృశ్యాదృశ్య రాజకీయ ప్రక్రియలుగా మారుతాయి.
తెలుగు, హిందీ చిత్రసీమలలో ఈ కోర్ట్ రూమ్ డ్రామాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కోర్ట్‌రూమ్ డ్రామా అంటే న్యాయస్థానాన్ని కథా కేంద్రంగా చేసుకుని నిర్మితమయ్యే సినిమా. ఇక తెలుగు చిత్రసీమలో కోర్ట్‌రూమ్ డ్రామాలు భావోద్వేగానికి, హీరోయిజానికి దగ్గరగా ఉంటాయి. ఇక్కడ న్యాయవాది పాత్ర చాలా సందర్భాల్లో “ప్రజానాయకుడు”గా రూపుదిద్దుకుంటుంది. హిందీ చిత్రాలలో కోర్ట్‌రూమ్ ‘వాదనల స్థలం’గా కనిపిస్తే, తెలుగు చిత్రాలలో అది “న్యాయం కోసం హీరో చేసే యుద్ధరంగం”గా కనిపిస్తుంది. హిందీ సినిమాలు ఎక్కువగా రాజ్యాంగ విలువలు, సామాజిక వాస్తవికతను ముందుకు తెస్తే, తెలుగు సినిమాలు భావోద్వేగం, నైతిక విజయం, సామూహిక న్యాయం వైపు మొగ్గు చూపుతాయి.
స్త్రీల మధ్య ఐక్యతను చక్కగా చూపించారు..
ఇక ఇటీవలి ‘సిస్టమ్’లో స్త్రీల మధ్య ఐక్యతను కేవలం ఒక అలంకారాత్మక భావనగా చూపించకుండా, దానికి జీవం పోసిన చిత్రం. సోనాక్షి సిన్హా, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లీగల్ థ్రిల్లర్‌లో వారి తొలి పరిచయం చాలా సాధారణమైనదే. ఒకరినొకరు కేవలం చూసుకునే చిన్న క్షణం. మహిళల విశ్రాంతి గదిలో అద్దం ముందు నిలబడి మేకప్ సరిచేసుకుంటూ ఉంటారు వారు. న్యాయవాది నల్ల గౌన్‌లో సోనాక్షి, సాధారణ సల్వార్ కమీజ్‌లో జ్యోతిక. మాటలేమీ లేకుండానే, సోనాక్షి ధరించిన బారిస్టర్ బ్యాండ్లు మడతలు పడిపోయాయని జ్యోతిక చూపిస్తుంది. సోనాక్షి వాటిని సరిచేసుకుంటుంది. జ్యోతిక ఒక స్నేహపూర్వక చిరునవ్వు నవ్వి వెళ్లిపోతుంది.
జ్యోతిక మరో విశ్వరూపం!
సోనాక్షి కొత్తగా న్యాయవాదిగా ప్రవేశించిన యువతి అని, నల్ల కోటు ధరించకపోయినా జ్యోతికకు న్యాయవ్యవస్థపై ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇది కేవలం ఇద్దరు ప్రొఫె షనల్‌ల కలయిక కాదు. ఒకరికి ఒకరు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు మహిళల అనుబంధానికి ఆరంభం. సెషన్స్ కోర్టు నేపథ్యంలో సాగే సిస్టమ్‌లో నేహా రాజవంశ్ (సోనాక్షి) కథను చెబుతుంది. ఆమె తండ్రి రవి రాజవంశ్ (అశుతోష్ గోవారికర్) ప్రముఖ న్యాయవాది. నేహా పబ్లిక్ ప్రాసిక్యుటర్‌గా తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ, త్వరగా తమ కుటుంబ లా ఫర్మ్ చేరాలని ఆశపడుతుంది. అయితే తండ్రి ఒక షరతు పెడతాడు. వరుసగా పది కేసులు గెలిస్తేనే ఆమెకు అవకాశం. ఆ లక్ష్యాన్ని చేరేందుకు, కోర్టు స్టెనోగ్రాఫర్ సారిక (జ్యోతిక) సహాయం తీసుకుంటుంది. ఎన్నో వాదనలు విని వినివున్న సారిక న్యాయవ్యవస్థలోని మర్మాలను నేర్చుకుంది.
నాటకీయత ఏమాత్రం లేని సినిమా!
ఒక అనుభవంలేని న్యాయవాది, ఒక తెలివైన స్టెనోగ్రాఫర్ కలిసి కేసులు ఛేదించడం వినడానికి సాధారణ ‘పల్ప్’ కథలా అనిపించొచ్చు. కానీ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి కథను ఎంతో ఓర్పుతో నిర్మించింది. ఓటీటీ ప్రేక్షకులను కట్టిపడేయాలనే ఆత్రుతతో అతి ఉత్కంఠను సృష్టించకుండా, కథకు కావాల్సిన సమయాన్ని ఇచ్చింది. కోర్టు సన్నివేశాలు నాటకీయతకంటే సాంకేతికతకు దగ్గరగా ఉంటాయి. కేసులను ‘టెక్నికల్’ దృష్టితో చూపించడం వల్ల సినిమా మరింత ఆసక్తికరంగా మారింది.
సెక్సీగా కాదు.. చెమట కంపు కొడుతున్నా..
సిస్టమ్ మహిళల అనుభవాలను ఓ ప్రచార నినాదంలా కాకుండా, నిత్యజీవిత సత్యంలా చూపిస్తుంది. సినిమా తన మహిళా పాత్రలను సంపూర్ణ వ్యక్తిత్వాలతో ఆవిష్క రిస్తుంది.“నువ్వు చాలా సెక్సీగా ఉన్నావ్” అని ప్రేమికుడు అన్నప్పుడు, “నేను చెమటతో దుర్వాసన వేస్తున్నాను” అని నేహా చెప్పడం ఆ పాత్ర సహజత్వాన్ని చూపిస్తుంది. పురుషుల్లాగే, ఈ మహిళా పాత్రలు కూడా వ్యూహాలు రచిస్తాయి, తప్పులు చేస్తాయి. సోనాక్షి నేహా, జ్యోతిక సారిక వేసిన పాత్రలు పరస్పరం ప్రేరణగా ఉంటాయి. ఒకరు డ్రైవర్ నడిపే కారులో తిరుగుతుంటే, మరొకరు ఎప్పుడూ అలసటతో, ఆలస్యంగా పరుగులు పెడుతూ ఉంటారు. ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపిస్తుంది. వారు కేసులను ఛేదించే తీరు ఒక దేశీయ మహిళా డిటెక్టివ్ జంటను గుర్తుచేస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా వేర్వేరు ప్రపంచాల నుంచి వచ్చినా, న్యాయం సాధించాలనే తపన వారిని కలుపుతుంది.
అందనంత దైవత్వంలా న్యాయం!
అయితే ఈ చిత్రంలో ‘న్యాయం’ ఒక అందనంత దైవత్వంలా కనిపిస్తుంది. పేదలకు న్యాయం చేయాలంటే కొన్ని సందర్భాల్లో వ్యవస్థను మోసం చేయడమూ సమర్థ నీయమే అన్న భావనను సినిమా ముందుకు తెస్తుంది. ఈ విధమైన స్పష్టమయిన అప్రమత్త తీర్పుతో పూర్తిగా ఏకీభవించడం కష్టం. ధనికులు, పేదల మధ్య పోరాటాన్ని సినిమా కొంత సరళీకృతంగా చూపించినా, కార్యాలయాల్లో మహిళలు ఎదుర్కొనే పితృస్వామ్య వాతావరణాన్ని మాత్రం ఎన్నో పొరలతో ఆవిష్కరించింది. కోర్టులో వాదిస్తున్నప్పుడు నేహాను ఆమె తండ్రి మధ్యలోనే ఆపేయడం గమనించదగ్గ విషయం. మొదట ప్రేమతో అనిపించే ‘ప్రిన్సెస్’ అన్న సంబోధన, వారి మధ్య విభేదాలు పెరిగేకొద్దీ తక్కువ చేసి మాట్లాడే స్వరంగా మారుతుంది. అశుతోష్ గోవారికర్ ఈ పాత్రలో కఠినమైన నిశ్చయంతో మెప్పిస్తాడు. ఒక కఠిన తండ్రిగానూ, చల్లని పితృస్వామ్య ప్రతీకగానూ. అయితే సిస్టమ్ తన క్లైమాక్స్ వద్ద కొంత బలహీనపడుతుంది. మిస్టరీని బాగా నిర్మించినప్పటికీ, చివరి పరిష్కారం మాత్రం ఒక పల్ప్ మలుపు వైపు జారిపోతుంది. త్వరిత వినోదం కోరుకునే వారికంటే, పాత్రల లోతు, సామాజిక వ్యాఖ్యానం ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కువగా నచ్చుతుంది.
సినిమా: సిస్టమ్
దర్శకురాలు: అశ్విని అయ్యర్ తివారి,
నటీనటులు: సోనాక్షి సిన్హా. జ్యోతిక, తదితరులు
ఒటీటీ: అమెజాన్ ప్రైమ్
- వారాల ఆనంద్
94405 01281






