జూనియర్ అడ్వకేట్స్‌కి స్టైపెండ్ ఇవ్వాలి!

by Ravi |   (  Updated:2025-07-23 01:00:36  IST  )

లీగల్ ఎడ్యుకేషన్‌పై రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇటీవల కాలంలో ఉత్సుకత చూపిస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్

జూనియర్ అడ్వకేట్స్‌కి స్టైపెండ్ ఇవ్వాలి!
X

లీగల్ ఎడ్యుకేషన్‌పై రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇటీవల కాలంలో ఉత్సుకత చూపిస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబిఏ, సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సైతం ఎల్ఎల్‌బి చేయడానికి ముందుకు వస్తున్నారు. లా సెట్ రాస్తున్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ఎల్ఎల్‌బిపై పెరుగుతున్న క్రేజీ ఇట్టే అర్థమవు తుంది. ప్రతి సంవత్సరం కనీసం ఆరు నుంచి ఏడు వేల మంది లా గ్రాడ్యుయేట్స్ యూనివర్సిటీల నుంచి కొత్తగా పట్టా పుచ్చుకుంటున్నారు.

వీరంతా తెలంగాణ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్‌మెంట్ చేసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే వృత్తిపై ఎంతో మక్కువతో ఎల్ఎల్‌బి పూర్తి చేసి ప్రాక్టీస్ ప్రారంభిస్తున్న జూనియర్ న్యాయవాదులకు అసలు సమస్యలు అప్పుడే మొదలవుతున్నాయి.. కేసుల ఫైలింగ్, ఆర్గ్యుమెంట్స్ తదితర లీగల్ ఇష్యూస్‌పై అవగాహన కోసం సీనియర్ అడ్వకేట్స్ దగ్గర అనివార్యంగా జాయిన్ అవుతున్న జూనియర్లు ఎలాంటి వేతనం లేకుండానే పని చేస్తున్నారు.

శాలరీ ఇవ్వని సీనియర్లు..

ఇబ్బడి ముబ్బడి కేసులతో ఫీజుల రూపేణా నెలకు లక్షల రూపాయలు సంపాదించే సీనియర్ అడ్వకేట్స్‌ సైతం ఏళ్ల తరబడి తమ దగ్గర పనిచేస్తున్న జూనియర్లకు రోజువారీ పెట్రోల్ ఖర్చుల మేరకైనా డబ్బులు ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో మాత్రం మెజారిటీ సీనియర్ అడ్వకేట్స్‌ జూనియర్లకు వేతనాలు ఇస్తున్నారు. వారి పని తీరుని బట్టి నెలకు ఇరవై వేల నుంచి లక్ష రూపాయలకు పైగా శాలరీ చెల్లిస్తున్నారు. కానీ, జిల్లా ఇతర కోర్టుల్లో మాత్రం జూనియర్లకు శాలరీ ఇచ్చే సీనియర్లను వేళ్ల మీద లెక్కించవచ్చు. దీంతో ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న జూనియర్ అడ్వకేట్స్ నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రోజువారీ ఖర్చుల కోసం, కుటుంబ పోషణ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు పదుల వయస్సు దాటినా పైసా సంపాదన లేకపోవడంతో చాలామంది జూనియర్ అడ్వకేట్స్ పెళ్లి చేసుకోవడానికి సైతం ఇష్టపడడం లేదు.. న్యాయవాద వృత్తితో ఆర్థికంగా నిలదొక్కుకోలేక, మరో వృత్తి, ఉద్యోగాన్ని చూసుకోలేక యువ న్యాయవాదులు దినమొక గండంగా బతుకీడుస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆదాయమూ లేని జూనియర్ అడ్వకేట్లకు నిర్ణీత మొత్తంలో నెలవారీగా స్టైపెండ్ ఇస్తున్నాయి. కేరళలో యంగ్ లాయర్స్ స్కీం పేరుతో నెలకు జూనియర్ అడ్వకేట్స్‌కి మూడు వేల రూపాయలు స్టైపెండ్ చెల్లిస్తున్నారు. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ జూనియర్ అడ్వకేట్లకు నెలకు ఐదు వేల రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు. పక్కనున్న ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం స్కీం అమల్లోకి తెచ్చి జూనియర్ అడ్వకేట్స్‌కి నెలకు రూ.3000 స్టైపెండ్ చెల్లించింది. చంద్రబాబు సర్కారు కొలువు దీరిన తర్వాత పథకం పేరు న్యాయ మిత్ర స్కీంగా మార్చి స్టైపెండ్ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. తమిళనాడు, పుదుచ్చేరి మెట్రో సిటీల్లో నెలకు ఇరవై వేలు, ఇతర చోట్లా పదిహేను వేల రూపాయలు జూనియర్ అడ్వ కేట్స్‌కి శాలరీ చెల్లించాలని సీనియర్స్‌ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్తర్వుల అమలుతో అక్కడి జూనియర్స్‌కి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయాయి. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు సైతం త్వరలో జూనియర్ న్యాయవాదులకు స్టైపెండ్ సహా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి.

సీఎం చొరవ చూపాలి..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూనియర్ న్యాయ వాదులకు స్టైపెండ్ చెల్లించే విషయాన్ని సానుభూతితో పరి శీలించాలి. నెలకు పదివేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు స్టైపెండ్ ఇవ్వాలి. దీని వలన రాష్ట్రంపై పెద్దగా ఆర్ధిక భారం కూడా పడదు. నెలకు పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయిస్తే సరిపోతుంది. 3.05 లక్షల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న రాష్ట్రానికి ఏటా సుమారు 150 కోట్ల రూపాయలు కేటాయించడం పెద్ద ఇబ్బందేమీ కాదు. అదీ కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వారికి నెలకు రూ.5000 స్టైపెండ్ చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడా హామీని నిలబెట్టుకోవాల్సి ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సత్వరం సానుకూలంగా స్పందించాలి. జూనియర్ అడ్వకేట్స్‌కి చేయూత నివ్వాలి. వారికి స్టైపెండ్ మంజూరు చేసి ఆదుకోవాలి.

మానేటి ప్రతాపరెడ్డి

అడ్వకేట్,

98484 81028

Next Story