సభలు సంబరాలు సరే, సమస్యల పరిష్కారం ఏదీ‌?

by velandi.Saikiran |

గత అక్టోబర్ నుండి మావోయిస్టుల సరెండర్లు వెల్లువెత్తాయి. వారు ఆయుధాలతో బయటకు వస్తున్నారు. ఆయుధాలు వదిలి వస్తున్నారు.

సభలు సంబరాలు సరే, సమస్యల పరిష్కారం ఏదీ‌?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: గత అక్టోబర్ నుండి మావోయిస్టుల సరెండర్లు వెల్లువెత్తాయి. వారు ఆయుధాలతో బయటకు వస్తున్నారు. ఆయుధాలు వదిలి వస్తున్నారు. వారు పునర్జీవనం కోసం పునరావాసం అంటూ వస్తున్నారు. వారు, వారి కోసం ప్రభుత్వాలు ఏ పదాలు వాడుతున్నా, వారందరినీ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి రెండు చేతులెత్తి దండం పెడుతూ ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానిస్తున్న మాట నిజం. ఇది ఆయన సొంత వ్యవహారం ఏమీకాదు, అది ప్రభుత్వ విధానం.

వారు నిర్ణయించుకున్న గడువు లోపు దేశాన్ని మావోయిస్టు రహిత భారతంగా మార్చాలన్నదే వారి లక్ష్యం. కాబట్టి వారు ఆ దిశలో అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి గడువు ముగింపు ముంగిట్లో మనమున్నాం. కానీ, ఎర్ర తివాచీలతో పాటు సమస్యల అంబరాన్ని పరిచారన్న విషయం కూడ తెలుసుకోవల్సిన నిజం. ఇంత కాలం వీటి గురించి పట్టించుకోని సమాజం, ఇప్పుడు వాటిని కూడ తన సమస్యల జాబితాలోకి చేర్చుకోక తప్పని స్తితి ఇది. ఎందుకంటే, వారూ విశాల ప్రజల మధ్య పని చేస్తామంటున్నారు కాబట్టి.

కాగితాలపైనే పథకాలుంటే...

మార్చ్ 31 నాడు విదేశీ, దేశ మీడియా ముందు మన దేశ హోం మినిష్టర్ మావోయిస్టుల సమస్యపై మాట్లాడనున్నారనే వార్తలు వస్తున్నాయి. అది సహజమే. లక్ష్య సిద్ధి కోసం తాము నిర్ణయించిన గడువు లోగా సాధించిన ఫలితాలు ప్రజల ముందుంచడం వారి విధి. ఆ రోజు ఏం ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే. అయితే, ఏలిక వారి దృష్టిలో ఎర్ర తివాచీలపై నడిచి వచ్చే వారి వెన్నంటి వచ్చే సమస్యల పరిష్కార మార్గాలు కూడా వుండే వుంటాయి. లొంగిపోయిన వారికి ప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు డబ్బులు తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలలో అనేక కిరికిరిలతో ముడిపడి వున్న మాట చేదు నిజం. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల వరకు వారిని పరీక్షించి మాత్రమే ఆ డబ్బు వారికి ఇస్తుందట! ఈలోపు వారు ప్రభుత్వాలకు గిట్టని ఏ పనులూ ఏమాత్రం చేస్తున్నారనిపించినా, ఆ డబ్బు వారి చేతికందదు అనే మాటలు వింటూ లొంగిపోయినవారు ఇవేం సమస్యలంటూ వాపోతున్నారు. అయితే, సమస్య ఏంటంటే, వారి పథకాలలో అనేకం కాగితాలపై నుండి భూమ్మీదికి చేరి అమలుకు నోచుకోవడం లేదన్నదే కఠిన వాస్తవం. దీనికి ఎవరిని తప్పు పట్టడం...! పాలకులనా, అధికారులనా.....! ఇది లొంగుబాటుదారులకు ఏమో కానీ, సాధారణ ప్రజలు మాత్రం అధికారుల వైపే వేలెత్తి చూపుతున్నారు. లొంగిపోయిన వారిపై అనేక అపోహలతో వున్న జనాలు వారి సమస్యలు వింటుంటే విస్తుపోతున్నారు.

ఉండటానికి ఇల్లు కూడా దొరకడం లే...

యేండ్ల తరబడి ప్రజా క్షేత్రంలో పైసకు ఆశ పడకుండా, నిస్వార్థంగా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటాలు చేసిన వారికి కనీసం వుండడానికి ఇల్లు దొరకడం లేదు. తెలంగాణలో ఇవ్వడానికి భూమి లేదంటూ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే, మూసీ నది నవ్వుతోంది. దావోస్‌లో జరిగిన ఒప్పందాలన్నీ ముఖాలు చాటేసుకుంటాయి. కొన్ని చోట్ల వారికి ఆధార్ కార్డులు దొరకడం గగనం అవుతోంది. యేండ్ల తరబడి రహస్య జీవితం గడిపిన వారి చట్టబద్ద వివరాలు ఎక్కడా రికార్డులలో లేనందున వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారమైన నిర్ణయాలు తీసుకొని ఆదేశాలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతో వుంది. ఇటీవలే, వేరు వేరు రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలపై పత్రికలలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

విధానాల సత్వర అమలు ఆవశ్యం

అందుకై వాటినన్నిటినీ కేంద్రం పరిశీలించి మేలైన విధానాలను ఒకే విధానంలోకి మార్చి తక్షణం అమలుచేయ పూనుకుంటే తప్ప వారి సమస్యల అంబరం పరిష్కారమవుతుంది. లేకుంటే అవి వారిని మరింత నిరాశ నిస్ప్రుహలకు లోను చేసి వారు ఎన్నుకున్న లొంగుబాటు మార్గంలో జీవనం ఎంత దుర్బరంగా వుందనే నిరసనలకు పోరాట మార్గం చూపుతోంది. ఆయుధాలు అప్పగించి వారు చేతిలోకి తీసుకున్న రాజ్యాంగం, చట్టబద్ద జీవితాన్ని తిరిగి వారు ప్రశ్నించుకునే పరిస్థితి తలెత్తకూడదంటే, వెంటనే కేంద్రం ఒక కమిషన్‌ను రూపొందించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. అందులో సమస్యల పూర్వాపరాలు తెలిసినవారు, లొంగిపోయిన వారి ప్రతినిధులు వుండడం తప్పనిసరి అవసరం.

కేటాయింపులు సరే. అమలు ఎప్పుడు?

దేశంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రకటించాయి. లొంగిపోయిన వారి పట్ల ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఎంతో ఉదారంగా వుందని కేంద్ర హోం మంత్రి కితాబులు ఇవ్వడం కూడ తెలిసిందే. ప్రభుత్వాలు కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ, వారి సమస్యలు సత్వరంగా పరిష్కారం కాకపోవడం, నిప్పుతో చెలగాటంలాగే వుంటుందేమోననీ ఆందోళనగా వుంది. లొంగిపోయిన వారికి సమాజంలో గౌరవంగా బతికే అవకాశాలను కల్పించడం ఎర్ర తివాచీలు పరుస్తున్న ప్రభుత్వాల విధి అవుతుంది. కేవలం లొంగిపోయిన మావోయిస్టులనే కాకుండా, ఆ పార్టీలో వుండి దాని విధానాలకు, తీర్మానాలకు లోబడి పనిచేసి దురదృష్టవశాత్తు అరెస్టు అయి వందలాది కేడర్లు అనేక కేసులలో దేశంలోని వివిధ జైళ్లలో మగ్గుతున్నారు. వారి విషయంలో కూడ ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులను జైలు పాలైన వారి కేసులలో సాక్షులుగా మార్చుకునే ప్రయత్నాలు కూడ జరుగుతున్నాయనే ఆందోళనకర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా చేస్తే, వారి మధ్య పరస్పర వైషమ్యాలు సృష్టించి ఆరని సెగలకు ఆజ్యం పోయడమే అవుతుంది.

రివార్డులకోసం రాలేదు.. రాళ్లు విసరకండి..

తెలుగు సమాజంలో మావోయిస్టులు ప్రభుత్వాల నుండి రివార్డులు తీసుకోవచ్చా, లేదా అనే చర్చ అనేక సంవత్సరాలుగా నలుగుతునే వుంది. గతంలో లొంగిపోయిన వారు తీసుకున్న రివార్డు డబ్బును మావోయిస్టు పార్టీ, దాని ప్రజా సంస్థలు స్వాధీనం చేసుకున్న చెదురుమదురు ఘటనలు దండకారణ్యంలో ఎదురైన చేదు అనుభవాలున్నాయి. ఇది చాలా జఠిలమైన ప్రశ్నే. విప్లవోద్యమంలో పని చేసి అపరాధ భావంతో అనివార్యంగా లొంగిపోయినప్పటికీ, పాటించాల్సిన విలువలు ఒకవైపు, మరోవైపు వందలాది కేడర్లు ఏ ఆధారం, దరువూ లేకుండా భవిష్యత్తు జీవితం పట్ల బెంగతో వుండడం మరోవైపు మన ముందుంది. ఉద్యమంలో పని చేసిన నాడు వీరెవ్వరూ ఆ రివార్డుల డబ్బెంత మొత్తం అనేది ఏ ఒక్కనాడూ ఆలోచించలేదు. బయటికి రావడం కూడ ఆ డబ్బుల కోసం రాలేదన్నది సుస్పష్టం. వారి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల సుడిగుండం నుండి బయటపడడానికి వారు ఆయుధాలు వదిలారు. వారు, విశాల ప్రజల మధ్య కనీస జీవనం గడపడానికి ఆర్థిక, హర్థిక సహాయం అందడం మాత్రం అత్యవసరం. దానిని మాననీయ కోణంలోనే అర్థం చేసుకోవాలి. దానిని పెన్షన్ గానో, లేదా మరో రకంగానో వ్యాఖ్యానిస్తూ నూతిలో పడ్డవారి మీద నూరు రాళ్లు వేయకుండా ఆదరించడం సమాజ విధి.

అమరులను పోటీ నిలపకండి...

లొంగిపోయిన వేలాది ఆదివాసీ యువతీ, యువకుల జీవితాలను చూడండి. పిడికెడు నాయకుల జీవితాలు కాదు, నిన్నటి వరకు మన కోసం సాయుధంగా నిలిచి అత్యంత అంకితభావంతో పనిచేసినవారిని మానవీయ కోణంలో చూడండి. ఈ పరిస్థితులలో అమరులను పోటీగా నిలపడం భావ్యం కాదు. వీరూ, ఆ బాటలో ప్రాణ త్యాగానికి సిద్ధపడి పని చేసిన వారే, కానీ, పరిస్థితులు మారి రెండడుగులు వెనుకకు వేయక తప్పని స్థితిలో మన మధ్యకు వచ్చిన వారిని ముఖం వాచేటట్లు నిందిస్తూ దూరం చేసుకోవడమా, వారి తప్పులను అంగీకరిస్తూ వారికి సహకరించడమా.. విజ్ఞులు ఆలోచించుకోవాలి.

అన్ని రాష్ట్రాల్లో తాత్సారమే...

ప్రజా క్షేత్రంలో నిస్వార్థంగా పని చేయడానికి వెళ్లి అనేక సంవత్సరాలు పని చేసి నాయకత్వ తప్పులతో విధిలేక బయటికి వచ్చిన వారిని సమాజం ఆదరించాలి. నిజానికి వారికి వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఇల్లు, భూమి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, కేసుల మోత లేకుండా వుండడం, రివార్డు డబ్బులు తక్షణం చేతికి అందివ్వడం, రీకెనలైజేషన్ ఆపరేషన్ (తిరిగి పిల్లలు పుట్టడం) లాంటి అనేక కనీస అవసరాలు కల్పించడంపై కేంద్ర హోం మంత్రి ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోపు వాటిని అమలులోకి తేవాల్సిందిగా ముహుర్తం నిర్ణయించాల్సిన అవసరం సీరియస్ గా వుంది. ప్రతి రాష్ట్రంలో అనుకూల, తాత్సార పద్ధతులు అమలవుతున్నాయి. కాబట్టి, వీటిని ఒక కమిషన్ పరిధిలోకి తెచ్చి సత్వర పరిష్కారానికి కేంద్రం పూనుకోవాలి. దానికి అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలలో విడిగా వున్న సరెండర్, సోషల్ వెల్ఫేర్ విభాగాలు పూర్తిగా సహకరిస్తూ సమాజంలో మళ్లీ ప్రశ్నలు, నిరసనలు, పోరాటాలు తలెత్తకుండా చూడడం కేంద్రం విధి. ఆ దిశలో సామాజిక శక్తులు, ప్రగతిశీలురు తప్పనిసరి ముందడుగు వేయాలి.

- మల్లన్న

(ఇటీవలే జనజీవన సంస్కృతి లోకి వచ్చిన మావోయిస్టు (పేరు మార్చాం)

Next Story