చుండూరు గుండెల మానని గాయం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-05 20:30:08  IST  )

చుండూరు హత్యాకాండ మీద వచ్చిన అన్యాయమైన తీర్పు పట్ల ఉద్యమ శక్తులు, ఉద్యమ సంఘాలు, ముఖ్యంగా హత్యాకాండ బాధితులు దళిత సంఘాలు న్యాయవ్యవస్థల పట్ల తీవ్రమైన అసంతృప్తికి ఆగ్రహానికి లోనయ్యారు.

చుండూరు గుండెల మానని గాయం
X

చుండూరు హత్యాకాండ మీద వచ్చిన అన్యాయమైన తీర్పు పట్ల ఉద్యమ శక్తులు, ఉద్యమ సంఘాలు, ముఖ్యంగా హత్యాకాండ బాధితులు దళిత సంఘాలు న్యాయవ్యవస్థల పట్ల తీవ్రమైన అసంతృప్తికి ఆగ్రహానికి లోనయ్యారు. తీర్పుపట్ల ఆగ్రహం, ఆవేశంతో కూడిన నిరసనలు తెలియజేసారు. సరియైన సాక్ష్యాలు లేవని కేసు కొట్టేయడం జరిగింది. కారంచేడులో కమ్మ భూస్వాములు, మాదిగల మీద మారణకాండ జరిపిన (1985) ఆరు సంవత్సరాలకు చుండూరు హత్యాకాండ జరిగింది. గుంటూరు జిల్లా చుండూర్ గ్రామంలో రెడ్లు మాలపల్లి మీద బడి చేసిన మారణ కాండ (1991).

ఈ మారణ కాండలో ఎనిమిది మందిని దొరికినోల్లను దొరికినట్లు నరికి గోనెబస్తాల్లో వేసి తుంగభద్ర కాలువల్లో పడేస్తే, కొమ్మెర అనిల్ కుమార్ అనే యువకుడు బాధిత క్యాంప్ లో పోలీసు కాల్పుల్లో చనిపోతే, మరోసారి దాడికి వస్తున్న రెడ్డి హంతకులను అడ్డుకున్నందుకు అంగలకుదురు రాజమోహన్ చంపబడినాడు. చుండూరు హంతకులు ఎవరన్నది వూరు, వాడ దేశమంతా కోడై కూసింది. కానీ న్యాయస్థానాలకే కళ్ళు చెవులు లేనట్లు తీర్పులు ఇచ్చింది. చుండూరు హంతకులు నిర్దోషులైతే యీ నెత్తుటి నేరమెవరిది? అనే ప్రశ్న అసహాయంగా మేలుకొనే వున్నది. చుండూరు నడిబొడ్డు మీద రెడ్ల యిండ్ల ముందట మృత వీరులను దాచుకున్న నేల మట్టి దిబ్బగా యింకా సజీవంగానే వుంది.


పోలీసులూ చెయ్యి వేశారు

ఈ హత్యాకాండ మీద డిల్లీకెళ్ళి ధర్నా చేసేటప్పుడు ఆక్సిడెంట్‌లో గూడూరు లేయమ్మ అనే ఒక మహిళ చని పోయింది. మొత్తం చుండూరు మృతులు పదకొండుమంది. జాలాది ముత్తయ్య, జాలాది ఇమ్మాన్యుల్, జాలాది ఇసాకు, సంకూరు సమ్ సోను, దేవరపల్లి జయరాజు, మండ్రు రమేష్, మండ్రు పరిశుద్దరావ్, మల్లెల సుబ్బారావ్, కొమ్మెర అనిల్ కుమార్, అంగలకుదురు రాజమోహన్, గూడూరు లేయమ్మ. దీంట్లో అంగలకుదురు రాజమోహన్ డిగ్రీ చదివే మాదిగ విద్యార్థి. రెండో సారి దాడి చేయడాని కొచ్చే గుంపును అడ్డగించినందుకు చంపేసిండ్రు. కొమ్మెర అనిల్ కుమార్‌ని బాదితుల క్యాంపులో పోలీసులు క్యాంపును భయభ్రాంతులు చేసి చెల్లాచెదురు చేయడానికి కాల్చి చంపారు. చుండూర్లో మృతులు పది మంది మాలలు, ఒక మాదిగ.


పోలీసు వ్యవస్థలో బాంచన్ గిరి

ప్రకాశం జిల్లా కారంచేడులో తాగే చెరువు నీళ్ళను మురికి చేస్తున్న కమ్మవాల్ల దాష్టికాలపై మాదిగలు ఎదురు తిరిగినారని కమ్మ భూస్వాములు మాదిగలపై హత్యాకాండకు పాల్పడినారు. ఇక్కడ బాధితుల ప్రతిఘటన జరిగింది. గుంటూరు జిల్లా చుండూరులో రెడ్డి అమ్మాయిలను మాల అబ్బాయిలు కదిలిస్తున్నారని, సినిమాల్లో కాలు తగిలిస్తున్నారనే కారణాలతో మాలపల్లి మీద దాడి చేసి చంపేసి తుంగభద్ర నదిలో పడేసినారు. రెడ్లు మాలపల్లి మీద దాడి చేయబోతున్నారని తెల్సిన పోలీసులే ఎలాంటి చర్యలు తీసుకోకుండా 'పారిపోండి మిమ్మల్ని చంపడానికి రెడ్లు వస్తున్నారని చెప్పడం ఎంతటి విషాదం. అంటే పోలీసులు కూడా రెడ్డిమూక ముందు అసహాయులుగా వుండి పోయినయంటే కులాధిపత్యాలకు పోలీస్ వ్యవస్థ కూడా బాంచగిరి చేయడం ఎంత దారుణం. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చుండూరు హత్యాకాండ జరిగింది. పోలీసు వ్యవస్థ మిన్నకున్నది. కేవలం సమాచారం యిచ్చి దులుపుకున్నది. మూక నుంచి మామూలు జనాన్ని రక్షించడం పోలీసుల కర్తవ్యం. కానీ చుండూర్‌లో వూరికి దూరంగా అంటరాని దుర్మార్గాలకు బలవుతున్న మాలల్ని రెడ్డి గుంపు చంపడానికి వస్తుంటే అడ్డుకొని స్టేషన్లో పెడితే- – చుండూరు హత్య కాండ, మారణ హోమం జరక్క పొయేది.

కారంచేడు.. చుండూరు.. ఎక్కడ తేడా..!

చుండూరు దుర్ఘటన (6-8-1991) నాటికి రాష్ట్రంలో (AP) కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వుంది. కారంచేడు దుర్ఘటన (17-7-1985) టైమ్‌లో రాష్ట్రంలో (AP) టీడీపీ గవర్నమెంట్, కేంద్రంలో కాంగ్రెస్ వుంది. ఒక రాజకీయ ఉద్యమ ప్రముఖుడన్నట్లు తెలుగు దేశం పార్టీలో చెప్పుకోదగ్గ మాల లీడర్లు లేరు. కేంద్రంలో వున్న కాంగ్రెస్ గవర్నమెంటు, రాష్ట్రం లోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని యిరకాటంలో పెట్టడానికి, అస్థిరం చేయడానికి కాంగ్రెస్‌లో వున్న మాల నాయకత్వం కారంచేడుని విజయ వంతంగా నడిపించడానికి దోహదపడినది. దీనికి వామపక్ష సంఘాలు కూడా బలాన్ని, బలగాన్ని యిచ్చినయి. కాని చుండూరుకు వచ్చేసరికి యిటు కేంద్రంలో, అటు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే వుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో బలమైన గ్రూపు రెడ్లు. మాలలు కూడా ప్రముఖంగానే వున్నరు కాంగ్రెస్‌లో. రెడ్లను ఢీకొనే బలం ఎస్సీ మాలలకు లేదు. తెలుగు దేశాన్ని అస్థిరం చేసినట్లుగా కాంగ్రెస్‌ని చేయలేక పోయాయి కాంగ్రెస్‌లో వున్న మాల నాయకత్వాలు.

చుండూరులో మండే గాయాలు

కారంచేడులో కమ్మలు ప్రతిఘటనా పోరాటానికి అడుగు వేయలేదు. కానీ చుండూరు సంఘటన కొచ్చేసరికి రెడ్లు ప్రతి ఘటనా పోరాటానికి నాంది పలికారు. ఏసీ కాలేజీ మీద ఒకటి కాదు రెండు సార్లు దాడి చేశారు. కారంచేడు కొచ్చినంత మద్దతు సంఘభావం అన్ని కులాల నుంచి, మతాల నుంచి చుండూరుకి చేరలేక పోయింది. కారంచేడు మృతవీరుల నెత్తుటి జెండా ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చింది 1989లో. దళిత మహాసభ ఆవిర్భావానికి, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే ఆత్మబలమిచ్చింది. జిల్లా కోర్టులో గెలిచి హైకోర్టులో ఓడినా సుప్రీం కోర్టులో గెలిచింది. చుండూరు కేసును సుప్రీంకోర్ట్ సాక్ష్యం లేదని కొట్టి వేసిన తీర్పు చుండూరు గుండెలో మండే గాయాలు యింకా పచ్చిగా సెలవేస్తానే వున్నయి.

హంతకులు నిర్దోషులైతే...

చుండూరు హంతకులు ఎవరన్నది వూరు,వాడ, దేశమంతా కోడై కూసింది. కానీ న్యాయస్థానాలకే కళ్ళు చెవులు లేనట్లు తీర్పులు ఇచ్చింది. చుండూరు హంతకులు నిర్దోషులైతే యీ నెత్తుటి నేరమెవరిది? అనే ప్రశ్న అసహాయంగా మేలుకొనే వున్నది. చుండూరు నడిబొడ్డు మీద రెడ్ల యిండ్ల ముందట మృత వీరులను దాచుకున్ననేల మట్టి దిబ్బగా యింకా సజీవంగానే వుంది.

హత్యాకాండ జరిగి ముప్పయి నాలుగేండ్లు(34సం. లు) గడిచినా అక్కడ ఒక స్పూర్తి చిహ్నంగానీ, స్థూపాలు గాని ఏర్పాటు కాలేదు. కోర్టులో స్థూపాలు నిర్మించరాదు అనే పిటిషన్ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెగని పంచాయతీగా చేయడం కులాధిపత్య రాజకీయ దుర్మార్గం. యిప్పటికైనా చుండూరు నెత్తుటి ప్రశ్నగా వున్న మృత వీరులను ఖననం చేసిన పెద్ద మట్టిదిబ్బను మృతవీరుల స్మారకార్థం ఒక మాన్యుమెంట్ నిర్మించాల్సిన బాధ్యత మిగిలి వుంది.

చుండూరు హత్యాకాండ జరిగి నేటికి 34 ఏళ్లు

-జూపాక సుభద్ర

94410 91305

Next Story