ప్రభుత్వ ఉద్యోగులకు నియమాలు వద్దా?

by Ravi |   (  Updated:2026-05-20 00:45:43  IST  )

ప్రజాస్వామ్యంలో సుపరిపాలన సాధనకు ప్రభుత్వ ఉద్యోగుల నైతిక బాధ్యతలు అత్యంత కీలకం. కర్మయోగి దృక్పథం, నిష్పాక్షికత, సేవా భావం, సమభావం వంటి విలువలతో కూడిన మార్గదర్శకాలు ప్రజాసేవలో పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు దోహదం చేస్తాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు నియమాలు వద్దా?
X

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారిది ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఆశయాలు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలన్నా, సుపరిపాలన సాధ్య పడాలన్న ఉద్యోగ యంత్రాంగం యొక్క పాత్ర అత్యంత కీలకం. కేవలం నిబంధనల ప్రకారం విధులు నిర్వహించడమే కాకుండా, నైతిక విలువలతో కూడిన సేవా దృక్పతాన్ని కలిగి ఉన్నప్పుడే, ఆ పరిపాలనకు సార్థకత లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ దైనందిన విధుల్లో పాటించాల్సిన నైతిక నియమాలు, నైపుణ్యాలు మరియు రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను సూచించే కొన్ని అత్యుత్తమ మార్గదర్శకాలు ఇక్కడ చర్చించబడ్డాయి.

కార్యశీలత - కర్మయోగం

మీరు ఒక ప్రభుత్వ సేవకుడు. ఏ చర్య చేపట్టిన ప్రజలపై దాని ప్రభావాన్ని ఎప్పుడు విస్మరించకూడదు. పరిపాలనలోని మానవ కోణాలను మరిచిపోవద్దు. ఎల్లప్పుడు క్రియాశీలకంగా ఉండండి. నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. వివరాలను వాస్తవాలను సేకరించి వాటిపై పట్టు సాధించండి కానీ వాటికి బానిసలు కావద్దు. ప్రభుత్వ నిధుల లెక్కల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. నిబంధనలను పాటించండి. క్రమం తప్పకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయండి.ఆదేశాలు లేదా చర్యల యొక్క అనుసరణ అంటే ఫాలోఅప్ ప్రాముఖ్యతను గుర్తించండి. సరైన పని కోసం సరైన వ్యక్తిని ఎంచుకోండి.

ప్రభుత్వ ఉద్యోగులు.. ముఖ్య సూత్రాలు

ఆసక్తిలేనివని, ముఖ్యం కానివి గాని లేదా నిత్యం చేసే పనులను నిర్లక్ష్యం చేయవద్దు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలోని ప్రాముఖ్యతను గుర్తించండి. అన్ని పక్షాల వాదనలు ఓపికగా వినండి. కేవలం న్యాయం చేయడం మాత్ర మే కాదు న్యాయం జరిగిందని ప్రజలకు తెలిసేలా చేయాలి.

సమభావం-సమన్వయం

సరియైన పనికి సరియైన వ్యక్తిని ఎంపిక చేయండి. మీ కిందిస్థాయి సిబ్బంది యొక్క గౌరవాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కాపాడండి. బహిరంగంగా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి కానీ మందలించాల్సి వస్తే రహస్యంగా తక్కువగా చేయండి. గోప్యమైన నివేదికలలో నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా న్యాయబద్ధంగా ఉండండి. మీ సహోద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేయవద్దు. ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించండి. మీ పని మీరు చేయండి మరి మీ కింది సిబ్బందిని వారి పనిని చేసుకోనివ్వండి.

సేవా దృక్పథం- ప్రజానురంజనం

మీరు ప్రజల సేవకులు. మీ చర్యలు ఉత్తర్వులు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఎల్లప్పుడూ ఊహించుకోండి. పరిపాలన అనేది మనుషులతో ముడిపడి ఉన్న వ్యవహారం అని గుర్తించండి. ప్రజల గౌరవం కోసం ప్రయత్నించండి. ప్రజలు మీ విజయాల పట్ల ఆసక్తి చూపుతారు, మీ కష్టాల పట్ల కాదు. అజ్ఞాతంగా ఉండటం ఒక ముఖ్యమైన గుణం అని గుర్తించండి. ప్రజా గౌరవం అనేది ఒక అద్భుతమైన నైతిక ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రజాధరణ కంటే న్యాయం, విధినిర్వహణకే ప్రాథమిక ఇవ్వాలి. మీరు ప్రజా సేవకులు ఏ రాజకీయ పార్టీలకు కాదని గుర్తు ఎరగండి. మీ న్యాయం, చిత్తశుద్ధి రెండూ ప్రజల ముందు స్పష్టంగా కనిపించేలా ఉండాలి. నిజాయితీతో కూడిన భిన్నాభిప్రాయాలకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ప్రజా సేవకుడికి ఉండాల్సిన గొప్పగుణం.

నిష్పాక్షికథ-రాజ్యాంగ బాధ్యత

స్వార్థపూరిత సలహాలు ఎదురైనప్పటికీ మీ సరైన మార్గాన్ని మీరు కనుగొనండి. సలహాల కంటే వాస్తవాలే ముఖ్యమని గుర్తుంచుకోండి. రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఇచ్చే సరైన ఆదేశాలను, సూచనలను విధేయతతో అమలు చేయండి. అవసరమైనప్పుడు అన్ని పార్టీల నుండి సలహాలను, సూచనలను, సహకారాన్ని తీసుకోండి కానీ నిర్ణయాలు మాత్రం మీరే తీసుకోండి.

ఆత్మవిశ్వాసం.. నిరంతర పరిణామం

పనిలో నైపుణ్యమే యోగం. మీ ఉద్యోగానికి మీ ఆరోగ్యం చాలా అవసరమని గుర్తు ఎరగండి. ఆరోగ్యకరమైన, ఉత్సాహవంతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించు కోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉండండి. మీ ఉద్యోగాలు అత్యుత్తమ వ్యక్తులు ఎంచుకోదగ్గ అత్యంత విలువైనవని గుర్తుంచుకోండి. మీకు దక్కాల్సిన సరైన ప్రతిఫలాలు మిమ్మల్ని వదిలి వెళ్ళవని గుర్తెరగండి.

ఉద్యోగం.. గొప్ప సామాజిక బాధ్యత

ఉద్యోగం అనేది జీవనోపాధి మాత్రమే కాదు, అది ఒక గొప్ప సామాజిక బాధ్యత. అధికార వికేంద్రీకరణలో ప్రతి ఉద్యోగి ఒక కర్మయోగిలా మారినప్పుడే సమాజంలో ఆశించిన మార్పు వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అప్డేట్ చేసుకుంటూ, నిస్పాక్షి కథతో, మానవీయ కోణంతో, బాధ్యతలను నిర్వర్తించినప్పుడే ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం లభిస్తుంది. పైన పేర్కొన్న నైతిక నియమాలను ప్రతి ప్రభుత్వ సేవకుడు ఆచరణలో పెడితే, అది కేవలం వారి వ్యక్తిగత ప్రగతికే కాకుండా, అవినీతిరహిత, పారదర్శకమైన నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతుంది.

-మనోహర్ రావు చిలప్పగారి,

రిటైర్డ్ ప్రభుత్వాధికారి.

96406 75288

Next Story