సీనియర్స్ జూనియర్స్‌కు భయాన్ని కాదు.. భరోసానివ్వాలి!

by Ravi |   (  Updated:2025-09-02 00:45:50  IST  )

తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రాంగణాల్లో మళ్లీ ర్యాగింగ్ భూతం చాప కింద నీరులా విస్తరిస్తోంది, ఇటీవల నిజామాబాద్

సీనియర్స్ జూనియర్స్‌కు భయాన్ని కాదు.. భరోసానివ్వాలి!
X

తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రాంగణాల్లో మళ్లీ ర్యాగింగ్ భూతం చాప కింద నీరులా విస్తరిస్తోంది, ఇటీవల నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, పల్నాడు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటుచేసుకున్న సంఘటనలు, సీనియర్స్ జూనియర్స్‌పై వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. విద్యాలయం అనగానే స్నేహం, విజ్ఞానం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా ఉండాలి కానీ భయం, అవమానం, ఆత్మనూన్యత భావం, కన్నీళ్లు కాదు.

ర్యాగింగ్ చిన్న తప్పిదం కాదు!

కొంతమంది సీనియర్లు ర్యాగింగ్‌ను ఇప్పటికీ సరదాగా తీసుకుంటున్నారు. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్ల‌తో శాడిస్ట్ లాగా, జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. కానీ వాస్తవానికి అది మానసిక హింస, శారీరక దాడి, సామాజిక అవమానం, చాలా పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 200 మంది విద్యార్థులు ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదే సమయంలో వేలాది మంది విద్యార్థులు మానసిక ఒత్తిడితో చదువును మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. ఇంత పెద్ద నేరాన్ని సరదాగా తీసుకోవడం సమాజానికి అస్సలు మంచిది కాదు.

ర్యాగింగ్ వెనుక కారణాలు..

పాఠశాలల నుండి విలువలతో కూడిన విద్య అందకపోవడం, తల్లిదండ్రులు పిల్లలకు సామాజిక విలువలు నేర్పకపోవడం, సాటి వాళ్ళతో ఎలా మెలగాలో చెప్పకపోవడం, మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం వంటివి వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కళాశాలలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలున్నా వాటి అమలు సరిగా లేకపోవడం కళాశాల యాజమాన్యాలు చూసీ చూడనట్టు వదిలివేయడం, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం, అలాగే సమాజం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు .. ఇలా అన్ని వర్గాలు మౌనంగా ఉండటంతో ర్యాగింగ్‌ అనే రాక్షసం మళ్లీ మళ్లీ తలెత్తుతోంది.

చట్టం ఏమంటోంది?

సుప్రీంకోర్టు ఇప్పటికే ర్యాగింగ్‌ను నేరంగా ప్రకటించింది. యూజీసీ 2009 యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్ల ప్రకారం ర్యాగింగ్ చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ కేసు తప్పదు, కళాశాల నుంచి బహిష్కరణ తప్పదు, స్కాలర్‌షిప్ రద్దు చేయబడుతుంది. కానీ అసలు సమస్య అమలులోనే ఉంది. కొన్ని కళాశాలలలో ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలు పేరుకే ఉంటాయి కానీ అవి పని చేయవు. ర్యాగింగ్ ఫిర్యాదులు బయటపడితే కళాశాల పేరు చెడిపోతుందనే భయంతో వాటిని దాచేస్తారు.

పరిష్కారం ఎవరి చేతిలో?

కళాశాలల్లో జీరో టాలరెన్స్ పాలసీని కఠినంగా అమలు చేయాలి. సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరి. సీనియర్లు జూనియర్లకు భయాన్ని కలిగించడం కాదు ఒక అన్నలా, అక్కలా జూనియర్స్‌కి ధైర్యాన్ని ఇవ్వాలి. నిజమైన సీనియారిటీ మార్గదర్శకత్వంలో, భరోసాని కల్పించడంలో ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. జూనియర్లు సైతం వారిని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే మౌనంగా ఉండకుండా వెంటనే సంబంధిత అధికారులకు, తల్లిదండ్రులకు తెలియచేయడం, హెల్ప్‌ లైన్‌కి ఫిర్యాదు చేయాలి. తల్లిదండ్రులు, సమాజం పిల్లల్లో ధైర్యం నింపాలి. ర్యాగింగ్‌ను సహించరాదని స్పష్టంగా నేర్పాలి. ర్యాగింగ్ అనేది ఒక విద్యార్థి సమస్య కాదు. అది మొత్తం విద్యా వ్యవస్థను కుంగదీసే భూతం. దాన్ని అరికట్టకపోతే భవిష్యత్తు తరాలు మానసికంగా వికలాంగులవుతాయి. కళాశాలలో సీనియర్లు జూనియర్ల‌కు భయాన్ని కాదు, భరోసాని కల్పించాలి. మీరు ఒకప్పుడు జూనియర్స్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎన్నో కలలతో, భవిష్యత్తుపై ఆశతో కళాశాలలో కొత్తగా చేరే విద్యార్థులు ర్యాగింగ్ అనే రక్కసి బారిన పడకుండా తమ లక్ష్యాలను చేరే విధంగా వారిలో మానసిక ధైర్యాన్ని నింపడం అందరి బాధ్యత. సీనియర్ నుంచి జూనియర్ మంచిని నేర్చుకోవాలి, చెడుని కాదు. స్నేహంతో మెలగండి. ర్యాగింగ్‌ని తరిమికొట్టండి.

- జి. అజయ్ కుమార్

63009 27609

Next Story