- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ నిర్మాణంలో నిశ్శబ్ద విప్లవం ఆర్ఎస్ఎస్
ఆర్ఎస్ఎస్ ఈ మూడక్షరాల పేరు వినని వారు ఉండరేమో..? ఈ సంస్థ నేడు దేశంలోనూ, విదేశాలలోనూ అందరికి ఒక ఆసక్తికర అంశంగా

ఆర్ఎస్ఎస్ ఈ మూడక్షరాల పేరు వినని వారు ఉండరేమో..? ఈ సంస్థ నేడు దేశంలోనూ, విదేశాలలోనూ అందరికి ఒక ఆసక్తికర అంశంగా, స్ఫూర్తి కేంద్రంగా, ఇటీవల యువత ఎక్కువగా ఆకర్షింపబడుతున్న సంస్థగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. నేడు పత్రికల్లో విజయాలుగా, వివాదాలుగా ఏదో రూపంలో ఈ సంస్థపై వార్తలు వస్తూనే ఉన్నాయి. మేధావులు, రాజకీయవేత్తలు సంఘ్ గురించి చర్చిస్తూనే ఉన్నారు.
గతంలో భారతీయ ముస్లిం సమాజం కోరిక మేరకు సంఘ్ అధినేత ఏకంగా ఢిల్లీలో ఓ మసీదు, ఓ మదర్సాని సందర్శించి జాతీయ వాద శక్తిని ప్రదర్శించటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆర్ఎస్ఎస్ మతో న్మాద సంస్థగా చిత్రీకరించే శక్తులకి సంఘ్ స్థాపన ఉద్దేశ్యం, సంఘ్ లక్ష్యం స్పష్టంగా తెలియదనే చెప్పవచ్చు. ఈ విజయదశమి నాటికి 100 ఏళ్లు పూర్తయి శతజయంతి ఉత్సవాలకు చేరువైన ఆర్ఎస్ఎస్ ప్రస్థానం సమాజోన్నతి కోరే ప్రతి సంస్థకు ఆదర్శం.
ఆర్ఎస్ఎస్ స్థాపన ఉద్దేశ్యం..
సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకులది తెలంగాణ ప్రాంతమే. చరిత్ర అధ్యయనంలో డాక్టర్ హెడ్గేవార్ తెలుసుకున్న విషయం ఏమిటంటే ‘భారత దేశ సమస్యలకు మన సమాజంలో ఉన్న అనైక్యత, ఆత్మవిస్మృతిల లోపమే ప్రధాన కారణం’. మనలోని లోపాలను నిర్మూలించి, మన సమాజంలో జీవన విలువలను నింపాలని చెప్పేవారు. సామాజిక స్పృహ, జాతీయ భావన, సంఘటిత దృష్టి, కఠోర పరిశ్రమ, నిస్వార్థం, తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండటం, ఈర్ష్య, ద్వేషం లేకుండటం వంటి గుణాల నిర్మాణం వలనే మన దేశం సుఖంగా, వైభవంగా జీవించ గలుగుతుంది అనేది వారి స్పష్టమైన అవగాహన. ఇలాంటి గుణాలు కల వ్యక్తుల నిర్మాణం కోసమే ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి నాడు నాగ్‌పూర్‌లోని మెహితే వాడలో ప్రారంభం అయింది. ఆర్ఎస్ఎస్ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, హిందూ సంస్కరణ అవసరం అని ఆయన భావించాడు.
జాతిని సంఘటితం చేసే కార్యం..
దేశ విభజన కుట్రను దేశభక్తి గల నాయకులు గమనించలేక పోతున్న తరుణంలో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ ఆత్మ విశ్వాసంతో, దూరదృష్టితో ఆర్ఎస్ఎస్ అనే దారిదీపంతో మన జాతి ఆత్మను మేల్కొలిపి, జాతిని సంఘటిత పరిచే శాశ్వత కార్యాన్ని ముందుంచారు. 1925లో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ జాతి ఐక్యతే లక్ష్యంగా నేటికీ ముందుకు సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ హిందూ సమాజ సంఘటన కార్యానికి శ్రీకారం చుట్టింది. ప్రతి రోజు ఒక గంట "శాఖ" కార్యం ద్వారా సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు దేశం నలుమూలల నుంచి కావాలని ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఈ రోజున దేశమంతా హిందుత్వ ఆలోచనలు సాకార రూపంలో మనకు కనబడుతున్నాయి. నేడు ఏళ్ల తరబడి ఉండిపోయిన కశ్మీర్ సమస్య, రామ జన్మభూమి మందిర నిర్మాణ సమస్య, తీవ్రవాద సమస్యలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు.. ఇలా ఎన్నింటికో పరిష్కారం చూపబడింది.
ఆర్ఎస్ఎస్ లక్ష్యం..
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలో అగ్రగామి దేశంగా చూడటమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. దీనినే ప్రతిరోజు "పరమ్ వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రమ్ (సంస్కృతంలో రాష్ట్ర అంటే జాతి) అంటూ స్వయంసేవకులు శాఖల్లో జరిగే ప్రార్థనలో గుర్తు చేసుకుంటారు. హిందూ రాష్ట్ర పరమ వైభవాన్ని సాధించటం సంఘ్ లక్ష్యం. ప్రతి మనిషి కూడు, గూడు, గుడ్డ, విద్య, ఆరోగ్యం, సంస్కారం కలిగి ఉండటం పరమ వైభవ స్థితి. ఈ క్రమంలో వ్యక్తిని వికసింపజేసే దిశలో సంఘం ఆలోచిస్తుంది. వ్యక్తులు స్వావలంబనతోనే పైవన్నీ సంపాదించుకోగలుగుతారు. అయితే వీటన్నింటికి ఆలంబన ‘ధర్మం’. ధర్మ అనుష్టాన వ్యక్తి నిర్మాణం, ధర్మాధారిత సమాజ నిర్మాణం సంఘ్ లక్ష్యం.
హిందుత్వమే సంఘ్..
హిందూ ఆలోచన విధానం విశాలమైనది. హిందుత్వం సమన్వయ మార్గం. హిందూత్వంలో విద్వేషం లేదు. హిందుత్వం మత వాచకం కాదు. హిందూ భావధార మతతత్వం కానే కాదు. హిందూత్వంలో అన్నింటిని కలుపుకునే శక్తీ ఉంది. హిందూత్వంలో సకల ప్రాణికోటికి ఆరాధించే సంస్కృతి ఉంది. సంపూర్ణ మానవాళి శ్రేయస్సు హిందుత్వతోనే సాధ్యం. ఆరాధనా పద్దతులు దేశంలో వేర్వేరు ఉండవచ్చు. జాతీయతకి వచ్చేసరికి దేశంలోని అందరి మూలం ఒక్కటే. అందరిలోని డీఎన్ఏ ఒక్కటే. సంఘ్ ప్రారంభంలో డాక్టర్ హెడ్గేవార్ ఉద్దేశ్యాలే నేటికి కొనసాగింపబడటం విశేషం. సంఘ్ ప్రతి పనికి దేశం - హిందుత్వమే గీటురాయి. అది గో సంరక్షణ అయినా, గ్రామ వికాసం అయినా, సామాజిక సమరసత అయినా, పర్యావరణ పరిరక్షణ అయినా, ధర్మ జాగరణ అయినా, కుటుంబ ప్రబోధమే అయినా... ఆధారం హిందుత్వమే.
సంఘ్ ప్రవాహం అప్రతిహతం
నేడు దేశంలో డెబ్బై వేలకు పైగా గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే లక్ష గ్రామాలకు చేరుకోవాలనేదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. సేవా భారతి పేరుతో స్వయం సేవకుల ద్వారా దేశవ్యాప్తంగా లక్ష యాభై వేలకు పైగా సేవా కార్యక్రమాలు జరుపబడుతున్నవి. హిందూ సమాజంలో మనమందరం ఒకే జాతివారం అనే భావన నిర్మాణం కావాలి. హిందుత్వం జీవన విధానంగా, ప్రపంచానికే ఒక సమన్వయ మార్గంగా మహాపురుషులు అందించారు. హిందుత్వాన్ని మత కోణంలో, రాజకీయ కోణంలో ఆలోచించినంత వరకు ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోలేం. ఆర్ఎస్ఎస్‌ను అర్ధం చేసుకోవాలంటే ఒక ఆరు నెలలు సంఘంలోకి వచ్చి పనిచేయ్యండని సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌జీ చెప్పారు. సామాజిక కోణంలో, తాత్విక దృష్టితో అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలకు హిందుత్వమే మార్గం చూపిస్తుంది.
(ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా)
-సాకి
99493 94688






