హెడ్గేవార్‌ స్వప్నం నుండి శతాబ్దోత్సవం వరకు..

by Ravi |

1925లో విజయదశమి పర్వదినాన డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్‌), కేవలం ఒక సామాజిక

హెడ్గేవార్‌ స్వప్నం నుండి శతాబ్దోత్సవం వరకు..
X

1925లో విజయదశమి పర్వదినాన డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్‌), కేవలం ఒక సామాజిక సంస్థగా మాత్రమే కాకుండా, భారతీయ నాగరికతాత్మక ఆత్మ పునరుద్ధరణకు సంకల్పించిన ఒక శక్తివంతమైన ఉద్యమంగా శతాబ్ద కాలంలో రూపాంతరం చెందింది. స్వీయశిక్షణ, దేశభక్తి, నైతిక విలువల పెంపకం అనే సైద్ధాంతిక భావజాలమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థ, నేడు దేశమంతా విస్తరించి, భారతదేశం అందించిన వేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, దేశానికి ఊపిరి పోసిన ఒక సాంస్కృతిక ఉద్యమంగా నిలిచింది.

దేశవ్యాప్తంగా 83 వేల శాఖలు

ఈ దేశంలో విభిన్న మతాలు, కులాలు, జాతులు ఉన్నప్పటికీ, ‘మనమంతా భారతీయులం’ అనే భావనను పెంపొందించి, దేశ సమగ్ర వికాసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ పాటుపడిరది. ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 83,000 పైగా రోజువారీ శాఖలను కలిగి ఉండి, ప్రజలను జాతీయత, ఏకతా భావాల వైపు నడిపిస్తూ, దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ, భారతదేశపు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. స్వాతంత్య్రం కన్నా, స్వాతంత్య్రానంతరం దేశం యొక్క భద్రత, సంస్కృతి పరిరక్షణే ముఖ్యం అని దృఢంగా నిశ్చయించిన హెడ్గేవారు, అప్పట్లో కుల విభేదాలు, ప్రాంతీయ అసమానతల వలన చీల్చబడిన హిందూ సమాజంలోని సామాజిక రుగ్మతలను తొలగించి, శక్తివంతమైన, సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించాలని కృషి చేశారు.

ఒకరి కోసం ఒకరం అంటూ

ఆయన దృష్టిలో సంస్థ ప్రారంభ లక్ష్యం రాజకీయ అధికారం కాదు. బీ హిందూ సమాజాన్ని ‘ఒకరి కోసం ఒకరం’ అనే భావనతో కూడిన సంఘటితమైన, క్రమశిక్షణతో కూడిన పౌరుల సమూహంగా తీర్చిదిద్దడం. దినచర్య ప్రాతిపదికన జరిగే శాఖ సమావేశం ద్వారా, కేవలం శారీరక వ్యాయామం, ఆటల ద్వారానే కాకుండా, ఆధ్యాత్మిక, నైతిక శిక్షణ, దేశభక్తి బోధనల ద్వారా యువతలో క్రమశిక్షణను, దేశసేవా భావాన్ని నెలకొల్పడం జరిగింది. సంఘం స్వాతంత్య్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదనే విమర్శ ఉన్నప్పటికీ, స్వదేశీ (దేశీయత), స్వధర్మ (తన సంస్కృతి/ధర్మం) అనే భావనలను ప్రజల్లో బలంగా పాదుకొల్పడం ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవన పోరాటానికి ఒక గాఢమైన పునాదిని ఇచ్చింది.

సంక్షోభాల మధ్య నిలువెత్తు పోరాటాలు..

ఆర్‌ఎస్‌ఎస్‌ తన ప్రయాణంలో 1947 నుంచి 1977 వరకు అనేక క్లిష్టమైన సంక్షోభాలను ఎదుర్కొంది. 1948లో మహాత్మా గాంధీ హత్య అనంతరం జరిగిన విద్వేషపూరిత ప్రచారం కారణంగా సంఘంపై నిషేధం విధించారు. ఈ క్లిష్ట సమయంలో అప్పటి సర్‌ సంఘచాలక్‌ మాధవ సదాశివ గోల్వాల్కర్‌ (‘గురూజీ’) నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలు శాంతియుతంగా, క్రమశిక్షణతో సత్యాగ్రహం నిర్వహించి, సంస్థ క్రమశిక్షణ, లక్ష్యశుద్ధిని నిరూపించుకున్నారు. ఆ తర్వాత, 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో పౌర స్వేచ్ఛను అణచివేతను వ్యతిరేకిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థల పునరుద్ధరణ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వేలాది మంది కార్యకర్తలు అరెస్టయ్యారు, జైళ్లలో నిర్బంధించబడ్డారు. ఈ పోరాటం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కేవలం సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, వ్యక్తిగత స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న సమూహమని దేశంలో నిరూపించుకుంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సంఘం పోషించిన పాత్ర అనేక రాజకీయ నాయకులకు, సాధారణ ప్రజలకు సంఘం పట్ల గౌరవం పెరగడానికి కారణమైంది.

విస్తరణ, సేవా ప్రస్థానం

ఎమర్జెన్సీ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ తన విస్తరణ వేగాన్ని అసాధారణంగా పెంచింది. లక్షలాది మంది యువకులు సంఘ శిబిరాల ద్వారా ప్రేరణ పొంది, దేశ నిర్మాణ కార్యక్రమాల్లో భాగమయ్యారు. గ్రామీణ ప్రాంతాలకు, మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం ‘శాఖ’ను తీసుకెళ్లాలనే లక్ష్యంతో గృహసంపర్క కార్యక్రమాలను విస్తరించింది. ఈ కాలంలోనే సంఘం కేవలం క్రమశిక్షణకు మాత్రమే కాకుండా, సామాజిక సేవకు ఒక శక్తివంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ‘‘హిందుత్వం’’ అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదని, భారతీయ నాగరికతాత్మక జీవన విధానమని, ఈ భూమిపై పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క సంస్కృతి అస్మిత అని సంఘం నిర్ధారించింది. ఈ విస్తృత దృక్పథంతోనే, విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) విద్యార్థులలో దేశభక్తిని, వివేకాన్ని నాటితే, సేవా భారతి ప్రకృతి విపత్తుల సమయంలో, అణగారిన వర్గాల మధ్య నిశ్శబ్దంగా అద్భుతమైన సేవలను అందించింది. వనవాసి కళ్యాణ్‌ ఆశ్రమ్‌ గిరిజన సోదరుల జీవితాలలో విద్యా, ఆరోగ్యం, సాంస్కృతిక పరిరక్షణ తీసుకురావడానికి పాటుపడిరది. విద్యా భారతి ద్వారా దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు స్థాపించబడి, సంస్కారవంతమైన, దేశభక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దే కేంద్రాలుగా నిలిచాయి.

విమర్శలను దాటిన సేవ

ఈ నిశ్శబ్ద, నిరంతర సేవా కార్యక్రమాల ద్వారా, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలకు అతీతంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ కాలంలోనే సంఘం యొక్క రాజకీయ ప్రభావం కూడా పెరిగింది. హిందుత్వ సిద్ధాంతాలకు రాజకీయ ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎదుగుదలలో, దాని క్యాడర్‌ నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర పోషించింది. అయితే, ఈ బలమైన రాజకీయ ప్రభావం సంఘానికి విమర్శలను కూడా తెచ్చిపెట్టింది. లౌకికవాద వ్యతిరేకత, మైనారిటీల పట్ల పాక్షికత, కేవలం హిందూ రాష్ట్ర స్థాపనకే పరిమితం అనే ఆరోపణలు తరచుగా వచ్చాయి. అయినప్పటికీ సంఘం ఎప్పుడూ తన సమాధానాన్ని తన సేవా కార్యక్రమాలు, సమరసతా కార్యక్రమాల ద్వారానే ఇచ్చే ప్రయత్నం చేసింది.

శతాబ్దోత్సవ లక్ష్యం.. పంచపరివర్తన

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్దోత్సవ దశలో అడుగుపెట్టిన ఈ కీలక సమయంలో, ప్రస్తుత సర్‌ సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ నాయకత్వంలో, సంస్థ తన దృష్టిని సంప్రదాయ హిందుత్వ భావనలతో పాటుగా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపైకి మళ్లించింది. దీనినే సంఘం ‘‘పంచపరివర్తన’’ అనే ఐదు ప్రధాన రంగాలలో దృష్టి సారించింది:

సామాజిక సమరసత - అంతర్భాగీకరణ

సామాజిక సమరసత అనేది ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత ముఖ్యమైన సున్నితమైన అంశం. సంఘం కేవలం హిందూ సమాజం యొక్క ఐక్యతపైనే కాకుండా, భారతదేశంలోని అన్ని మతాలు, వర్గాల మధ్య సామరస్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటరానితనం అనేది హిందూ ధర్మానికి ఒక మాయని మచ్చగా భావించి, దానిని పూర్తిగా రూపుమాపే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దళితులు, ఆదివాసీలతో సహపంక్తి భోజనాలు, అన్ని వర్గాల వారికి శాఖలలో సమాన ప్రాతిపదిక కల్పించడం వంటి క్రియారూపాలు ఈ సమరసతకు నిదర్శనం.

సంస్కృతి పరిరక్షణ- కుటుంబ విలువల పునరుత్థానం

ఆధునికత పేరుతో యువత తమ మూలాలను మరచిపోతున్న ఈ తరుణంలో, ఆర్‌ఎస్‌ఎస్‌ సాంస్కృతిక పరిరక్షణకు, కుటుంబ విలువల పునరుత్థానానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. భారతీయ భాషలు, కళలు, శాస్త్రాలు, పండుగల గొప్పతనాన్ని యువతకు అర్థమయ్యేలా బోధిస్తూ, సంస్కారవంతమైన శిక్షణ ఇచ్చి నూతన సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది.

ఆర్థిక స్వావలంబన - స్థానికత

ప్రపంచీకరణ నేపథ్యంలో, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్థిక స్వావలంబన (ఆత్మనిర్భర్‌ భారత్‌) భావనకు క్రియాత్మక రూపం ఇవ్వాలని సంకల్పించింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక చిన్న తరహా పరిశ్రమలకు అండగా నిలబడటం ఈ ప్రయత్నంలో కీలకం.

పర్యావరణ పరిరక్షణ - ప్రకృతి మిత్ర జీవనశైలి

పర్యావరణ సంక్షోభాన్ని భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న ‘ప్రకృతిని దైవంగా పూజించే’ భావనతో ముడిపెట్టింది. వృక్షారోపణం, గో సంరక్షణ, జల సంరక్షణ వంటి కార్యక్రమాలను ‘‘ప్రకృతి పథం’’ అనే ఉద్యమంలో భాగంగా చేపట్టింది.

వ్యవస్థాపరమైన పునరుద్ధరణ

సంస్థాగతంగా, పరిపాలనలో నైతికత, పారదర్శకత, సామర్థ్యం పెరగాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటుంది. స్వయంసేవకులలో నిస్వార్థ సేవ, నిబద్ధతను నాటడం ద్వారా, వారు ఏ రంగంలో ఉన్నా దేశానికి, సమాజానికి విలువను జోడించేలా తీర్చిదిద్దడం సంఘం అంతిమ లక్ష్యం.

వర్తమాన సవాళ్లు.. భవిష్యత్‌ దిశ

శతాబ్దపు మైలురాయిని చేరుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌, రాజకీయ రంగంలో పెరుగుతున్న ప్రభావం కారణంగా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. మైనారిటీలలో ఉన్న భయాందోళనలను తొలగించడంలో, సాంస్కృతిక జాతీయతను స్పష్టం చేయడంలో సంఘం నిరంతరం శ్రమించాల్సి ఉంది. మరో ప్రధాన సవాలు - యువతలో మారుతున్న జీవనశైలి, సాంకేతికత ప్రభావం. ఆధునిక యువతను శాఖలకు ఆకర్షించడంలో, దైనందిన శిక్షణా కార్యక్రమాలకు కట్టుబడి ఉండేలా చేయడంలో సంఘం నూతన వ్యూహాలను రూపొందించుకోవాలి. లింగ సమానత్వం అనేది సంఘం ముందున్న మరో కీలకమైన అంశం. సంఘం కేవలం పురుషుల సంస్థగా ఉండగా, దాని సోదర సంస్థ అయిన రాష్ట్ర సేవికా సమితి మహిళా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయినప్పటికీ, ప్రధాన స్రవంతిలో లింగ సమానత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

హిందూ రాష్ట్ర.. రాజకీయ భావన కాదు

ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన ‘‘హిందూ రాష్ట్ర’’ భావనను కేవలం ఒక రాజకీయ భావనగా కాకుండా, భారతీయ నాగరికత, సంస్కృతి, నైతికత, విలువలపై ఆధారపడిన ఒక సుసంపన్నమైన, శక్తివంతమైన రాజ్య వ్యవస్థగా ప్రజల్లో నాటుతోంది. కన్న తల్లి కన్నా మిన్నగా దేశాన్ని ప్రేమించడమే కాదు, నిరంతరం దేశ క్షేమాన్ని కాంక్షించేది ఒక్క స్వయంసేవక్‌ మాత్రమే అని గర్వంగా చెప్పవచ్చు. డాక్టర్‌ హెడ్గేవార్‌ దార్శనికతకు కట్టుబడి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన స్వీయశిక్షణ, సేవా సంస్కృతి, దేశభక్తితో కూడిన తత్వదృష్టిని తరువాతి తరాలకు అందించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం సాగించిన ఈ శతాబ్దపు ప్రయాణం అనేది కేవలం ఒక సంస్థ చరిత్ర మాత్రమే కాదు, భారతదేశపు సామాజిక, సాంస్కృతిక పరిణామం శక్తిని, నిరంతర పునరుజ్జీవన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

(ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా)

-డా. రావులకృష్ణ

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, HCU

94929 09371

Next Story