ప్రపంచ సభలో గర్జించిన భారత వాణి

by Disha edit |
ప్రపంచ సభలో గర్జించిన భారత వాణి
X

వందల సంవత్సరాల బానిసత్వం, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న అమాయక ప్రజలు, ప్రాణం పోయినా సరే మానం కాపాడుకోవాలని ఆలోచించే సగటు మనుషులు.. ఇది ఆనాటి భారతదేశ పరిస్థితి.

1893వ సంవత్సరం సెప్టెంబర్‌లో విశ్వమత మహాసభలు జరుగుతున్న సందర్భం అది. దేశ విదేశాలకు చెందిన పలు మతాల వారు తమతమ మతాల వైభవం గురించి ప్రపంచ మానవాళి ముందు వివరించి వారి మతాల గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్న తరుణమది. తామెన్నటికైనా స్వేచ్ఛ వాయువులను పీల్చే అవకాశం ఉందా? అని సమాధానం లేని ప్రశ్నలు వేసుకుంటున్న సామాన్య జనులతో కూడిన భారతావని. భారతీయ ప్రాచీన వైభవాన్ని, మన సారస్వత పరంపరను ప్రపంచం గుర్తించే విధంగా వివరించారు..వివేకానంద

కలకత్తాలో జన్మించి రామకృష్ణ పరమహంస సన్నిధిలో శిష్యరికం చేసిన ఒక 30 ఏళ్ల సన్యాసి ఆ పనిని తనే తన నెత్తి మీద వేసుకొని విశ్వ మత మహాసభలకు వెళ్లి సనాతన హిందూ ధర్మం యొక్క వైభవం గురించి మాట్లాడాడు.. అమెరికాలోని చికాగో నగరంలో కనీసం పలకరించేవాడు కూడా లేని పరిస్థితుల్లో తన ఉజ్వల జ్ఞానం, సమున్నత వినయం ద్వారా ఆ మత మహాసభల్లో మాట్లాడే అవకాశాన్ని పొందారు.

ఆ సభలలో ఆయన పలికిన ‘అమెరికా దేశపు నా సోదర సోదరీమణులారా’ అనే ఒక చిన్న మాట ఆ సభలోని 5,000 మంది ప్రేక్షకులను కదిలించింది. బానిసత్వ దేశం నుంచి వచ్చిన ఒక బానిస ఇతను అని మొదట చూసిన జనం ఇతనిలోని జ్ఞాన వైభవాన్ని చూచి భారతదేశం నుంచి వచ్చిన గొప్ప జ్ఞాని ఇతను అని చూసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లు విదేశాల్లో పర్యటనలు చేస్తూ సనాతన హిందూ ధర్మ వైభవాన్ని ప్రపంచ దేశాలు గౌరవించి అర్థం చేసుకునే పరిస్థితిని తీసుకువచ్చారాయన.

విదేశీ పర్యటనలను ముగించుకుని వచ్చిన తర్వాత అనేకమంది విదేశీయులు అతనికి శిష్యులుగా చేరడానికి తమ జీవిత సర్వస్వాలను అతనికి అర్పించడానికి ముందుకు వచ్చారు. అతనికి ఉత్తరాలు వ్రాశారు. అలాంటివారికి వివేకానందుడు ప్రత్యుత్తరం వ్రాస్తూ ఈ దేశ వైభవాన్ని కీర్తించాడు. అలా మార్గరేట్ నోబెల్ అనే ఒక శిష్యురాలు భారతదేశానికి వచ్చి భారతీయ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని వివేకానందుడికి ఉత్తరం ద్వారా తెలియజేసినప్పుడు ఆమెకు ప్రత్యుత్తరం రాస్తూ ఈ దేశం యొక్క వైభవాన్ని చక్కటి కవిత ద్వారా వివరించాడు. ఇది అందుకున్న వారిలో ప్రపంచమంతా సిస్టర్ నివేదితగా పిలుచుకునే మార్గరెట్ నోబెల్ ఉన్నారు.. ఆమె ఈ దేశానికి వచ్చి, ఈ దేశంలో ప్రజలకు సేవ చేయడానికి బాలికలకు మొట్టమొదటి పాఠశాలలను ప్రారంభం చేసి వారి సేవలో తన జీవితాన్ని ధారపోసింది. ఇతర దేశాల ప్రజలపై, సంస్థలపై, దేశాలపై ఇంత ప్రభావం చూపిన ఈ వివేకవాణి ఈనాడు మనదేశ ప్రజల మీద, పాలకుల మీద, యువత మీద అవసరమైనంత ప్రభావాన్ని చూపకపోవడం బాధాకరమైన విషయం. ఈ దేశంలోని ప్రతి వ్యక్తి వివేకానందుడి కొన్ని మాటలనైనా సరిగ్గా అర్థం చేసుకొని వారి జీవితంలో ముందుకు సాగినప్పుడు ఉజ్వలమైన భవిష్యత్తు భారతానికి అడుగులు వేసినట్లు అవుతుంది.

(నేడు వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం)

- శ్రీ భారతి ఉల్లెంగ ముత్యం

రీసెర్చ్ స్కాలర్

95023 09151

Advertisement
Next Story

Most Viewed