- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ మహానీయులు లేకపోతే.. మనం ఇలా ఉండేవాళ్లమా?
మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులు మనకు చదువు నేర్పకపోయి ఉండి ఉంటే ప్రస్తుతం మనం ఎక్కడ ఉండేవాళ్లం?

మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులు మనకు చదువు నేర్పకపోయి ఉండి ఉంటే ప్రస్తుతం మనం ఎక్కడ ఉండేవాళ్లం? నేటికీ గోచీలు కట్టుకుని కూలీలుగా జీవించే వాళ్లం.. ఉన్నత విద్యావంతులుగా మారేవాళ్లమా? ప్రజాప్రతినిధులుగా ఎదిగేవాళ్లమా? బ్రాహ్మణాధిపత్య అసమానతలు తీవ్రంగా ఉన్న రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు ఫూలే.. తన జాతులను అక్షరాస్యులుగా మార్చి సమానత్వాన్ని సాధించాలని ప్రయత్నించారు. అదేమంత పెద్ద పని కాదని ఇప్పుడు మనకు అనిపించవచ్చు. కానీ.. ఆ రోజుల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు మాత్రమే చదువు నేర్చుకోవాలనే ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆధిపత్య వర్గాల దాడులను ఎదుర్కుంటూ ఫూలే దంపతులు మనకు చదువు నేర్పించారు.
ఏడాదికోసారైనా స్మరించుకుంటున్నామా?
మనలో చాలామంది నేను చాలా కష్టపడి చదివి పైకొచ్చాను.. నన్ను మా అమ్మానాన్నలు చాలా కష్టాలు పడి చదివించారని చెప్పుకుంటారు. కానీ... ఆ ఎదుగుదలకు అవకాశం కల్పించిన మహనీయులని మర్చిపోతుంటారు. ఎప్పుడో గౌతమ బుద్ధుడు, సామ్రాట్ అశోకుడి కాలంలో ఈ దేశ మూలవాసులు జ్ఞానం నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మణులు మను ధర్మ శాస్త్రాన్ని అమలులోకి తీసుకురావడంతో బలహీన వర్గాలు.. భూమి, సంపద సహా సర్వ హక్కులకు దూరమయ్యారు.. ఆధిపత్య వర్గాలకు సేవకులుగా మిగిలిపోయారు. ఆంగ్లేయులు ఈ దేశాన్ని ఆక్రమించి పాలన మొదలు పెట్టి మనుధర్మ శాస్త్రంలోని ఆంక్షలను ఒక్కటొక్కటిగా రద్దు చేయడంతో ఈ వర్గాలకు విద్య నేర్చుకునే అవకాశం వచ్చింది. బ్రిటీష్ పాలకులు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫూలేను ఆయన తండ్రి చదివిస్తే.. ఫూలే దంపతులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు మాత్రమే చదువు నేర్చుకోవాలనే ఆంక్షలు కొనసాగుతున్న రోజుల్లో బలహీన వర్గాలకు చదువు నేర్పారు. ఈ దంపతులు కింది జాతులకు విద్య, చైతన్యం నేర్పుతుంటే మనువాద బ్రాహ్మణులు దాడులు చేయించారు.. కుటుంబం నుండి దూరం చేయించారు. అయినప్పటికీ భయపడకుండా బతికినంత కాలం మన ఉన్నతి కోసం కృషి చేస్తూ తమ జీవితాలను త్యాగం చేశారు. మరి మనం కనీసం ఏడాదికోసారైనా వాళ్ళను స్మరించుకుంటన్నామా?
ఒక్క రోజును కేటాయించలేమా?
మనలో ఎంత మందికి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామ స్వామి, ఛత్రపతి శివాజీ, సాహూ మహారాజ్, ఝల్కారీబాయి, సామ్రాట్ అశోక్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి మహానీయుల చరిత్ర తెలుసు? ఎంతమంది వారి చరిత్రను చదివారు? ఈ మహానీయులంతా బీసీల, దళితుల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన వారే.. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించకపోయి ఉంటే ఇంత స్వేచ్ఛగా బ్రతికే వారిమా? మనకు ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే మనల్ని రాజకీయాల్లోకి రానిచ్చేవారా? కనీసం సంక్షేమ పథకాలనైనా అమలు చేసేవారా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల కోసం ఒక్కరోజును ఎందుకు కేటాయించడం లేదు? ఆ మహానీయుల త్యాగాలను ఎందుకు గుర్తు చేసుకోవడం లేదు? బలహీనుల జాతి కోసం పోరాడిన వారి విధానాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని మన జాతులకు చెబుకోవడానికి మన మహానీయుల జయంతి.. వర్ధంతులను ఘనంగా జరుపుకోవాలి. ఇలా జరుపుకోవడం వల్ల బలహీన వర్గలంతా ఏకమవుతాయి.. అలా ఏకమైతేనే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాం. మన భవిష్యత్తు తరాల బాగు కోసం రండి చేయి చేయి కలుపుదాం.
- జంగిటి వెంకటేష్,
90528 89696






