- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాంతీయ సమతుల్యతే వృద్ధికి మూలం
డీలిమిటేషన్ వలన దక్షిణ భారతదేశానికి రాజకీయ అస్థిత్వ సంక్షోభం వస్తుందని ఉభయ పార్లమెంట్ సభల్లో ఇటీవలే

డీలిమిటేషన్ వలన దక్షిణ భారతదేశానికి రాజకీయ అస్థిత్వ సంక్షోభం వస్తుందని ఉభయ పార్లమెంట్ సభల్లో ఇటీవలే వాద వివాదాలు జరిగాయి. ముఖ్యంగా బీజేపీకీ, డీఎంకేకి హిందీ భాషను దక్షిణాది మీద రుద్దే విషయంలో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అనేక రాజ్యాంగ సూత్రాలను పాటించడం వలన ముఖ్యంగా కుటుంబ నియంత్రణ నిక్కచ్చిగా పాటించడం వలన దక్షిణ భారత జనాభా ఉత్తర భారత జనాభా కంటే బాగా తగ్గారనేది కూడా మనకు తెలుస్తున్న వాస్తవం. ఏదేమైనా దక్షిణ భారతం అస్తిత్వానికి రాజకీయ ప్రాతినిధ్యం చాలా ముఖ్యం.
నిజానికి భౌగోళిక, ప్రాకృతిక, జనజీవన సంపదలో దక్షిణ భారతం శక్తివంతంగా ఉంది. ఉత్తర భారతంలో పోల్చినప్పుడు, దక్షిణ భారతం అహింసాత్మకంగా ఉంది, శాంతి యుతంగా వుంది. విద్యా వ్యవస్థలో బలంగా వుంది. అక్షరాస్యతలో ముందు వుంది. స్త్రీ విద్యలో ముందు వుంది. తరతరాలుగా సాంకేతిక సాంస్కృతిక, తాత్త్విక, అభ్యుదయ వాద, ప్రగతివాద, ప్రజాస్వామ్యవాద, సామాజిక విప్లవవాద ప్రభావాలతో దక్షిణాది నిండి వుంది. దక్షిణాది చరిత్ర మనం చూస్తే రక్తపాత రహిత కుల నిర్మూలన వాద చైతన్యంతో సంస్కరణ వాద ప్రభాసమానమై విలసిల్లుతుంది. దక్షిణాది భాషలు కూడా మ్యూజికల్ నేచర్‌తో లయబద్ధమై కరుణపేయమై విలసిల్లుతూ వున్నాయి. అతి ప్రాచీనమైనటువంటి తెగలు అయిన సవరులు లాంటి, గోండులు లాంటి, కొండ రెడ్లలాంటి, గదబ లాంటి, తులిలాంటి, జాతులు కూడా దక్షిణ భారతంలో విలసిల్లుతున్నాయని ఎడ్‌గార్ త్రస్థన్ నిరూపించారు.
దక్షిణాది అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ...
ఇంతటి చరిత్ర ఉన్న దక్షిణ భారత భాష దేశీయ అస్థిత్వాన్ని దెబ్బతీయాలనే తీవ్రమైన ప్రయత్నాన్ని కేంద్రం చేస్తున్నట్టుగా ఇప్పటి దక్షిణాది మేధావులు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణంలో వున్న విశ్వవిద్యాలయాలపై కేంద్రం పెత్తనం బలంగా వుంది. యూజీసీ గుప్పెట్లో దక్షిణ భారత విశ్వవిద్యాలయాలు నలిగిపోతున్నాయి. వీరికి ఏ విధమైన వెసులుబాటు లేదు. దక్షిణాది భాషలను, దక్షిణాది వారి పురాతత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వెసులుబాటును యూజీసీ కలిగించటం లేదు. దక్షిణ భారత విశ్వవిద్యా లయాల మీద తీవ్రమైన మతాధిపత్యం, భాషాధిపత్యం కొనసాగుతున్నాయి. చివరకు ఉపకులపతుల నియామకంలో కూడా కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుంటుంది.
గవర్నర్ల గుప్పిట్లో వీసీలు..
వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతికి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు మార్గదర్శకాలు-2025’ పేరిట విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల ఒక ముసాయిదాను విడుదల చేసింది. అందులోని అంశాలు బాగా వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల అధిపతులైన ఉపకులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది. నూతన ముసాయిదా ప్రకారం ఆ అధికారం ఛాన్సలర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మార్పును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమిళనాడు, కేరళ వంటివి నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్ట సభల్లో తీర్మానం కూడా చేశాయి. వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడాన్ని అవి వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలతో ఉన్నత విద్యపై తమ పట్టును పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలహీనమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి జాబితాలోని విద్యపై కేంద్రం పట్టు సాధించాలని చూస్తుండటం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఒకేసారి రెండు డిగ్రీలు, ఆన్‌లైన్ పాఠాలు అంటూ యూజీసీ మోతెక్కిస్తోంది. వాటి పర్యవసానాలను లోతుగా ఆలోచించినట్లు కనిపించదు.
రాష్ట్రాలను పోషిస్తున్నామంటూ..
డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆనాడే హైదరాబాద్‌ను 2వ రాజధానిగా చేసుకోమని చెప్పారు. దీని వలన వాయు కాలుష్యం లేకపోగా భారతదేశానికి నలువైపుల నుండి యుద్ధ ప్రమాదం తప్పుతుందని ఆయన ఆనాడే చెప్పారు. ముఖ్యంగా దక్షిణ భారతంలోని హైదరాబాద్ ఇటు దక్షిణాది వారికి అటు ఉత్తరాది వారికి, అటు పశ్చిమాది వారికి సెంటర్‌గా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల వ్యక్తిత్వం కూడా 2వ రాజధాని ఏర్పడినప్పుడే బలపడుతుందని అంబేడ్కర్ నొక్కి ఒక్కాణించారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది వారు కట్టే పన్నుల వాటాలో 70 శాతానికి పైగా కేంద్రమే మిగిల్చుకుంటుంది. మళ్లీ రాష్ట్రాలకు కొంత ఇచ్చి కేంద్రమే రాష్ట్రాలను పోషిస్తున్నాము అనే ప్రచారం చేసుకుంటుంది.
రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం
దక్షిణ భారతం అస్తిత్వానికి రాజకీయ ప్రాతినిధ్యం చాలా ముఖ్యం. రాజకీయ ప్రాతినిధ్యం ఉంటేనే హక్కులు సామాజికమైనవి, సాంస్కృతికమైనవి, ఆర్థికమైనవి, విద్యాపరమైన హక్కులు సాధించబడతాయి. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించబడుతుంది. భారతదేశం అనేక భిన్నత్వాల నుండి బౌద్ధ తాత్వికత వలన ఏకత్వాన్ని సాధించింది. అంబేడ్కర్ రాజ్యాంగ సూత్రాల వలన సమైక్యతను ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని సాధిస్తూ వెళుతుంది. అందుకే సంఖ్యను బట్టి కాక భారతదేశం మొత్తం సమైక్యంగా ఉండాలనే భావంతోనే కేంద్ర ప్రభుత్వం ఆధిపత్య భావాలతో కాక, పరిపాలనా సమతుల్యం సాధించే దిశగా ప్రయత్నించాలని అప్పుడే రాజ్యాంగ మూలసూత్రం ప్రతిఫలిస్తుంది ఆశిద్దాం. డా. బి.ఆర్.అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో సమాఖ్య తత్వం పునర్వికసిస్తుందని ఆశిద్దాం.. అంతిమంగా రాజ్యాంగానిదే విజయం.
- డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695






