అక్షరాలతో అంధకారాన్ని జయించిన యోధుడు.. రెజినాల్డ్ డ్వేన్ బెట్స్

by Ravi |   (  Updated:2026-07-13 01:15:18  IST  )

మనలో చాలామంది పుస్తకాలను వినోదం కోసమో, సమయాన్ని గడపడం కోసమో మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఈ భౌతిక ప్రపంచంలోని వెలుగుల్లో జీవించే మనకు తెలియని మరో నిజం ఉంది.

అక్షరాలతో అంధకారాన్ని జయించిన యోధుడు.. రెజినాల్డ్ డ్వేన్ బెట్స్
X

మనలో చాలామంది పుస్తకాలను వినోదం కోసమో, సమయాన్ని గడపడం కోసమో మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఈ భౌతిక ప్రపంచంలోని వెలుగుల్లో జీవించే మనకు తెలియని మరో నిజం ఉంది. చీకటి గదుల్లో, నిరాశ అంధకారంలో చిక్కుకుపోయిన కొందరికి పుస్తకాలు వినోదాన్ని మాత్రమే ఇవ్వవు - అవి వారికి నూతన జీవన మార్గాన్ని చూపుతాయి, బతకాలనే బలమైన కోరికను నింపుతాయి. అలాంటి అద్భుతమైన పరివర్తనకు ప్రత్యక్ష సాక్ష్యమే రెజినాల్డ్ డ్వేన్ బెట్స్.

ఆయన కేవలం ఒక కవి, న్యాయవాది మాత్రమే కాదు.. ఒకప్పుడు జైలు గోడల మధ్య మగ్గిన యువకుడు, నేడు అమెరికా అంతటా వందలాది జైలు గ్రంథాలయాలను నిర్మించిన మార్గదర్శి.

యవ్వనకాలమంతా ఖైదీ..

నేడు డ్వేన్ బెట్స్ అమెరికాలో అత్యంత ప్రముఖ కవుల్లో ఒకరు. ప్రపంచ ఖ్యాతి గడించిన యేల్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 'మ్యాక్ ఆర్థర్ జీనియస్ గ్రాంట్' వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆయనను వరించాయి. ఈ మెరిసే విజయాలు చూస్తే ఎవరికైనా ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టి నిష్కంటకంగా ఎదిగిన వ్యక్తి అనిపించవచ్చు. కానీ వాస్తవం అందుకు పూర్తిగా భిన్నమైంది. పదహారేళ్ల కౌమారదశలో డ్వేన్ బెట్స్ ఓ కారు దోపిడీ కేసులో చిక్కుకుని జైలుకెళ్లారు. తన యవ్వన కాలాన్ని చల్లటి ఇనుప సెల్లో, నాలుగు గోడల మధ్య గడిపారు. ఆ నిరాశాజనకమైన పరిస్థితుల్లోనే ఆయనకు పుస్తకాలు స్నేహితులయ్యాయి. ఆ అక్షరాలే ఆయనను ఒక కొత్త లోకంలోకి నడిపించాయి. భవిష్యత్తును ఊహించుకునే శక్తిని, ఆలోచనలో పరిణతిని బోధించాయి. భౌతికంగా బందీ అయినా, మానసికంగా ఆయన స్వేచ్ఛను పొందారు.

నిజమైన మార్పు శిక్ష ద్వారా రాదు..

జైలు అనేది కేవలం భౌతిక పరిమితుల ప్రదేశం మాత్రమే కాదు.. అది మనిషి మనస్తత్వాన్ని కుంగదీసే కఠిన వాతావరణం. అక్కడ ప్రతి అడుగుపై నిఘా, నిరంతర ఆందోళన. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఖైదీలకు ఒక మంచి పుస్తకం అమృతంలా మారుతుంది. బెట్స్ తన 'ఫ్రీడం రీడ్స్' కార్యక్రమం గురించి మాట్లాడుతూ తనను జైలు ఇనుప గ్రిల్లులను దాటి ఆలోచించేలా చేసింది పుస్తకం. ముఖ్యంగా, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ రచయిత జాన్ ఎడ్గర్ వైడ్మన్ రచించిన 'Brothers and Keepers' అనే గ్రంథం ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. "జైలు గోడల మధ్య మగ్గుతున్న ఖైదీల కథలకు కూడా సమాజంలో విలువ ఉందని" ఆ పుస్తకం ఆయనకు బోధించింది. బెట్స్ దృఢ విశ్వాసం ఇదే. "సమాజం ఒక నేరస్థుడిని శిక్షించడం ద్వారా కాకుండా, అతనిలో ఆలోచనా శక్తిని రేకెత్తించడం ద్వారానే నిజమైన మార్పు సాధ్యమని.

500కు పైగా అత్యుత్తమ జైలు గ్రంథాలయాలు..

సాధారణంగా జైళ్లలోని గ్రంథాలయాలు దుమ్ము పట్టిన పాత పుస్తకాలతో, పరిమిత సమయం మాత్రమే తెరిచే వ్యవస్థలుగా ఉంటాయి. కానీ బెట్స్ ఆలోచన పూర్తిగా భిన్నమైంది. 2019లో 'ఫ్రీడం రీడ్స్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ఖైదీల నివాస విభాగాల్లోనే ఆకర్షణీయమైన 'ఫ్రీడం లైబ్రరీ'లను ఏర్పాటు చేశారు. "పుస్తకాలు నేరుగా వారి దినచర్యలో భాగమైతేనే, వారు తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు". ఇదీ ఆయన వ్యూహం. ఈ గ్రంథాలయాల్లో ప్రపంచ క్లాసిక్ సాహిత్యం, కవిత్వం, ప్రేరణాత్మక ఆత్మకథలతో పాటు, మాజీ ఖైదీలు రచించిన పుస్తకాలను కూడా ఉంచుతారు. ఈ సంస్థ ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 500కు పైగా అత్యుత్తమ జైలు గ్రంథాలయాలను నెలకొల్పి ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఫ్రీడం లైబ్రరీలు కేవలం పుస్తకాల కేంద్రాలుగా కాకుండా, ఖైదీల మధ్య ఆరోగ్యకరమైన మానవ సంబంధాలను నిర్మించే వేదికలుగా మారుతున్నాయి. ఫ్రీడం రీడ్స్ సంస్థ "సాహిత్యాన్ని మానవత్వాన్ని పునరుద్ధరించే సాధనం"గా అభివర్ణిస్తుంది.

ఖైదీలే పుస్తక న్యాయ నిర్ణేతలు..

2023లో ఫ్రీడం రీడ్స్ సంస్థ మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ఇన్సైడ్ లిటరరీ ప్రైజ్' (Inside Literary Prize) అనే పురస్కారాన్ని ప్రారంభించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, "ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేసే న్యాయనిర్ణేతలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే!" ఎంపిక చేసిన పుస్తకాలను ఖైదీలకు అందజేసి, వారు చదివి చర్చించుకుని ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. దీనివల్ల సమాజానికి దూరంగా ఉన్న ఖైదీల అభిప్రాయాలకు సాహిత్య ప్రపంచంలో గౌరవం ఉందని, వారి స్వరానికి విలువ ఉందని నిరూపించారు. ఇది వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 2005లో జైలు నుండి విడుదలైన బెట్స్, పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకున్నారు. కమ్యూనిటీ కాలేజీలో చేరి, అద్భుతమైన కవితా సంపుటాలను ప్రచురించి, ఎన్నో కష్టాల మధ్య చివరకు యేల్ లా స్కూల్ నుండి పట్టా పొందారు. నేడు ఆయన రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమవుతున్నాయి.

నాటి ఖైదీ నేటి మార్గదర్శి!

ఇంతటి ఉన్నతికి చేరుకున్నా, "తన విజయాలకు జైలు గదిలో చదివిన పుస్తకాలే మూలకారణమని" ఆయన వినయంగా చెబుతారు. ప్రపంచవ్యాప్త పరిశోధనలు నిరూపిస్తున్నాయి.. జైళ్లలో విద్య, పుస్తకాలు కల్పించడం వలన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. కానీ గణాంకాల కంటే ముఖ్యమైంది మానవీయ కోణం. "పుస్తకాలు ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని మాత్రమే ఇవ్వవు. అవి తన గతాన్ని అర్థం చేసుకునే విచక్షణను, నిజమైన పశ్చాత్తాపపడే ధైర్యాన్ని, సమాజంలో కొత్త మనిషిగా జీవించాలనే ఆశను అందిస్తాయి." ఒకప్పుడు నేరస్థుడిగా బ్రాండ్ చేయబడిన ఆయన, నేడు ఖైదీలకు విముక్తి మార్గాన్ని చూపే మార్గదర్శిగా విరాజిల్లుతున్నారు.

ఖైదీలకు వెలుగు దీపాలు పుస్తకాలు..

బెట్స్, 'ఫ్రీడం రీడ్స్' సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచంలోని ప్రతి న్యాయవ్యవస్థకు ఒక అద్భుతమైన నమూనా. "ఇది శిక్షను సంస్కరణగా మార్చే సాహిత్య శక్తికి, కరుణకు, మానవత్వానికి పట్టం కట్టిన ఘనత." ఒక చిన్న పుస్తకం ఎంతటి గొప్ప పరివర్తనను తీసుకురాగలదో డ్వేన్ బెట్స్ కథ మనకు చాటి చెబుతుంది. చీకటి గదుల్లో మగ్గుతున్న ఎందరికో ఈ గ్రంథాలయాలు వెలుగు దీపాలుగా మారాయి. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాకూడదు. ప్రపంచంలోని ప్రతి జైలులోనూ ఇలాంటి వెలుగు కిరణాలు ప్రసరించాలి. ఎందుకంటే, ప్రతి మనిషిలోనూ మార్పు సాధ్యమే – ఆ మార్పుకు తలుపు తెరిచేది మాత్రం ఒక్క పుస్తకమే.

-డా. రవి కుమార్ చేగొని,

తెలంగాణ గ్రంథాలయ సంఘం

98669 28327

Next Story