ఖురాన్.. ఒక మార్గదర్శి

by Disha edit |
ఖురాన్.. ఒక  మార్గదర్శి
X

క్రీస్తు శకం 650 లో అరేబియా ప్రాంతం. ఎటు చూసినా కారు చీకటి, గాఢాంధకారం అలముకున్న హృదయాలు.. ఏరులై పారుతున్న మద్యం, వడ్డీ వ్యాపారం, మహిళలపై ఎడతెగని దారుణాలు..దోపిడీలు, దౌర్జన్యాలు, అనాగరికత..ఈ పరిస్థితులు మారేదెలా.. మృగంగా మారిన మనిషిని తిరిగి మార్చేదెలా.. గుండెలో ప్రేమ నింపేదెలా మానవాళికి తరుణోపాయాన్ని చూపేదెలా అనుకున్న సమయంలో పరమ పవిత్రమైన ఖురాన్ ఈ మాటలతోనే ప్రారంభమైంది. పవిత్ర రంజాన్ మాసంలో ఓ రాత్రి ఖురాన్ అవతరించింది.

ఖురాన్‌లోని ప్రతీ వాక్యమూ మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. మానవాళికి ఖురాన్‌ లాంటి మహత్తర గ్రంథాన్ని అందించిన అల్లాహ్ ఉద్దేశం ఏమిటంటే ఈ గ్రంథాన్ని కేవలం వల్లెవేయడం కాదు. మన దైనందిన జీవితంలో ఆచరించాలి. ఈ గ్రంథరాజాన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్లు ఎన్నటికీ దారితప్పలేరని ప్రవక్త (స) ఉద్బోధ. దైవగ్రంథంలోని బోధనలు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు. ఎన్నో రుగ్మతలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఖురాన్‌ స్వయంగా పేర్కొంటోంది.

శ్రేష్టమైన రాత్రి అవతరించి..

ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. మానవులందరికీ మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. (దివ్యఖురాన్‌ 2185) మేము దీని (ఖురాన్‌)ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది. ఆ రాత్రి దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి. (దివ్యఖుర్‌ఆన్‌ 971-5)

'లైలతుల్ ఖద్ర్ అనే మాటలో లైల్ అంటే రాత్రి అని అర్థం. ఖద్ర్ అంటే అదృష్టం, భాగ్యం. సృష్టిలోని సర్వరాశుల విధిరాత ఈ రాత్రే లిఖిస్తారని నమ్మకం. అందుకే దీనిని లైలతుల్ ఖద్ర్ అని వ్యవహరిస్తారు. ఖద్ర్ అంటే శ్రేష్ఠమైన అని మరో అర్థం ఉంది. అందుకే దీనిని శ్రేష్టమైన రాత్రిగా కూడా అభివర్ణించారు. ఈ రాత్రి దైవదూతలతో భూలోకమంతా కిక్కిరిసిపోతుందట. ఇలా పవిత్ర రంజాన్ మాసంలో ఓ రాత్రి ఖురాన్ అవతరించింది.

మాటిమాటికీ పఠించే గ్రంథం

ఖురాన్‌ గ్రంథానికి రంజాన్‌ మాసానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఖురాన్‌ వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. రంజాన్‌ నెలను ముస్లింలు ఇంత పవిత్రంగా భావించడానికి కారణం ఖురాన్‌ అవతరణే. అసలు ఖురాన్‌ అంటే మాటిమాటికీ చదివే గ్రంథం. ప్రపంచవ్యాప్తంగా వీటిని కంఠతా చేసినవారున్నారు. వారినే హాఫిజ్‌‌లు అంటారు. ఖురాన్‌ లోని 114 అధ్యాయాలలో ఆరువేలకు పైచిలుకు వాక్యాలున్నాయి. ఖురాన్‌ హాఫిజ్‌‌లు తప్పుల్లేకుండా నమాజులో చదువుతారు. ఏడాదిలో ఒక్కసారైనా ఖురాన్‌ వినాలన్న నిబంధనతో రంజాన్‌ నెలలో ముప్పై రోజులపాటు ఖురాన్‌‌ను ఒక్కసారి సంపూర్ణంగా వింటారు. ఖురాన్‌లోని ప్రతీ వాక్యమూ మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ గ్రంథాన్ని కేవలం వల్లెవేయడం కాదు. మన దైనందిన జీవితంలో ఆచరించాలి. ఈ గ్రంథరాజాన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్లు ఎన్నటికీ దారితప్పలేరని ప్రవక్త (స) ఉద్బోధ.

అన్ని పీడనల పరిష్కారిణి

దైవగ్రంథంలోని బోధనలు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు. ఎన్నో రుగ్మతలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఖురాన్‌ పేర్కొంటోంది. ఖురాన్‌ చదివే వారిపై ప్రశాంతత ఆవరిస్తుంది. ‘‘దివ్యగ్రంథంలోని ఒక్క అక్షరాన్ని పఠిస్తే, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ప్రతి పుణ్యానికి పదింతల ప్రతిఫలం ఉంది. ‘‘మీకన్నా ముందు గడిచిన జాతుల పట్ల ఏం జరిగింది ఇంకా మీ తరువాత వచ్చే జాతుల పట్ల ఏం జరుగనుందో, ఇంకా మీ వ్యవహారాల పర్యవసానం ఏమై ఉంటుందో కూడా ఖురాన్‌ వివరిస్తుంది. ఖురాన్‌‌లో ఎన్నో గాథలున్నాయి. చిన్న చిన్న మలుపులతో, గొప్ప గొప్ప సందేశాలతో ఎన్నో కథలున్నాయి. అవన్నీ మనిషికి గుణపాఠాలు నేర్పుతాయి. మంచిని బోధిస్తాయి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది. మనో వ్యాకులత, ఒత్తిడి, ఆందోళన, మార్గం కానరానప్పుడు ఖురాన్‌ చదివితే తప్పక మార్గం దొరుకుతుంది. ప్రశాంతత కలుగుతుంది.

ఖురాన్‌ వాక్యాల్లో మానవ మాతృడిపై అనిర్వచనీయమైన అల్లాహ్ ప్రేమ కనపడుతుంది. చేయిపట్టి ఆ పరమాత్ముడు దారిచూపిస్తున్నాడా అనిపిస్తుంటుంది. ఈ గ్రంథరాజం ఒకేసారి అవతరించలేదు. ఎన్నో హితవులతో, హెచ్చరికలతో, శుభవార్తలతో, మరెన్నో గాథలతో అప్పటి అవసరాలకు అనుగుణంగా అవతరించింది. ఇలా 23 ఏళ్లలో ఖురాన్‌ అవతరణ పూర్తయ్యింది. దివ్యఖురాన్‌ ఏ శైలిలోనయితే అవతరించిందో ఆ శైలిలోనే ఇప్పటికీ నిక్షిప్తమై ఉంది. వందల సంవత్సరాలక్రితం అవతరించిన ఈ గ్రంథంలో సృష్టి గురించి, విశ్వం గురించి, సముద్రపు లోతుపాతులను గురించి, అంతరిక్షం గురించి చర్చించిందంటే ఇది ముమ్మాటికీ దైవగ్రంథమే!

(నేడు ఖురాన్‌ అవతరించిన రోజు...)

షేక్ జాఫర్

98492 32261



Next Story

Most Viewed