స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకై ఉద్యమిద్దాం

by Disha edit |
స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకై ఉద్యమిద్దాం
X

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణతో తమ బతుకులు రోడ్డున పడుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు మధనపడుతున్నా ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి జగన్‌, ఆయన మంత్రివర్గ సహచరులు రాజధాని తరలించడంపై దృష్టి పెట్టారు. రాజధాని అంశంతో జీవనాధారమైన విశాఖ స్టీల్‌ కర్మాగారం అంశాన్ని పక్కనబెడుతూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌, వామపక్ష నేతలు కలిసికట్టుగా ప్రధాని మోడీ వద్దకు వెళ్తే సమస్య చిటికెలో పరిష్కారం అవుతుందని ఉత్తరాంధ్ర చర్చావేదిక మరో ప్రతిపాదన కూడా చేసింది. కానీ ఈ పార్టీలు స్వప్రయోజనాలను విడిచిపెట్టి ప్రజల కోసం కలిసికట్టుగా ముందుకొస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని తేటతెల్లమైంది. ప్రజాగర్జన సభలో ఉద్యమానికి మద్దతుగా ఉంటామని చెప్పిన అధికార వైఎస్సార్‌సీపీ తన బాధ్యతను మరిచింది. తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. విశాఖస్టీల్‌ పరిశ్రమను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా, అన్నీ రాజకీయపక్షాలు, కార్మికసంఘాలు, ప్రజా సంఘాలు కలిసికట్టుగా జేఏసీగా ఏర్పడి మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తే తప్ప ప్రయివేటీకరణను ఆపడం సాధ్యంకాదు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదంతో 1966లో నిర్వహించిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మళ్లీ అదే నినాదంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. విశాఖపట్నం అనగానే గుర్తుకొచ్చేవాటిలో ఒకటి ప్రకృతి రమణీయమైన సముద్రం కాగా మరొకటి ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు 32 మంది ప్రాణత్యాగం చేశారు. స్టీల్‌ప్లాంటు ఏర్పాటే లక్ష్యంగా పదహారు వేల మందికిపైగా నిర్వాసితులు 22వేల ఎకరాలు తమ భూములను స్వలాభం చూసుకోకుండా కారుచౌకగా ప్రభుత్వానికి అప్పగించారు. ఇంతమంది త్యాగాల ఫలితంగా 1990లో ప్రారంభమైన ఉక్కు పరిశ్రమ 2021 నాటికి వార్షిక టర్నోవర్‌ 20 వేల కోట్లకు చేరి 945 కోట్లు నికరలాభం సాధించింది. ఈ ఘనత మొత్తంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులకు, అధికారులకే దక్కుతుంది.

కారుచౌకగా అప్పజెప్పేందుకు

దేశంలో కార్పొరేట్‌ వ్యవస్థ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత కాలంలో పారిశ్రామికవేత్తల కండ్లు పచ్చగా సాగుతున్న విశాఖ ఉక్కుపై పడ్డాయి. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పెద్దలు కూడా పరోక్షంగా దీనికి సహకరించడం అత్యంత దురదృష్టకరం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం చేయాలని కేంద్రప్రభుత్వం ఫైనాన్షియల్‌ సబ్‌కమిటి 27.01.2021న ప్రకటన చేసినప్పటి నుండి స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు ఉత్తరాంధ్ర చర్చావేదిక తరపున ఈ చర్యను వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తూ సంబంధిత మంత్రిత్వశాఖలకు, ప్రజాప్రతినిధులకు ఈ చర్యను అడ్డుకోవాలని వినతులు ఇస్తూ కోరుతూ వస్తున్నారు.. అయినా మొద్దుబారిన కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా స్టీల్‌ప్లాంట్‌ను కారుచౌకగా ప్రైవేట్‌వ్యక్తులకు అప్పజెప్పడానికే సిద్ధమౌతోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడుతుంది. స్టీల్‌ప్లాంట్‌కు స్వంత గనులు లేకపోవడం వల్ల సంవత్సరానికి 2 వేల కోట్ల రూపాయల భారం అదనంగా పడుతోంది. 2021-22 వార్షిక టర్నోవర్‌ రూ.20 వేల కోట్ల వరకున్నా కేంద్ర ప్రభుత్వం అమ్మకం పెట్టేందుకు బరితెగించింది. ఒడిస్సా మినరల్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీకి విశాఖ ప్లాంట్‌ గనుల కోసం 2,400 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించినా ప్రయివేటీకరణ కుట్రలో భాగంగా మైనింగ్‌ తవ్వకాలకి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. పైగా ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా కంపెనీపై ఆర్థిక భారం మోపుతోంది.

జాతీయ స్థాయిలో మద్ధతు కూడగట్టి..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత రెండేళ్లుగా కార్మికసంఘాలు, వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు వారివారి స్వప్రయోజనాలతో పూర్తిగా సహకరించడం లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. సభలు, సమావేశాల్లో చెప్పేది ఒకటి తీరా ఆచరణలో మరోరకంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగర్జననే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ప్రజాగర్జన సభలో ఉద్యమానికి మద్దతుగా ఉంటామని చెప్పిన అధికార వైఎస్సార్‌సీపీ తన బాధ్యతను మరిచింది. వైఎస్సార్‌సీపీ తాజా పార్లమెంటరీ సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశాన్నే ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచడానికి ఇదే సరైన సమయం. 2024లో రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకోవచ్చు. మరోవైపు ప్రస్తుతం కీలక బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇవే చివరి బడ్జెట్‌ సమావేశాలు. మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ బడ్జెట్‌ సమావేశాలను ఒక సదవకాశంగా మల్చుకొని రాష్ట్రంపై కేంద్ర వివక్షను ఎండగట్టడంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేయాలి. అన్ని రాజకీయపార్టీలు మద్దతును జాతీయస్థాయిలో కూడగట్టాలి.

అలా చేస్తే ప్రజలు క్షమించరు

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణపై గొంతెత్తారు. దీనికి మద్దతు ప్రకటించారు. పార్లమెంట్‌లో సానుకూలంగా అన్ని పార్టీలను కలుపుకొని ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు పార్లమెంట్‌ సాక్షిగా ఉద్యమించాలి. ఈ పని రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు చేయని పక్షంలో వారు తమ కర్తవ్య నిర్వహణలో పూర్తిగా విఫలమయినట్టే. దీనికి రాష్ట్ర ప్రజలు వీరిని ఎన్నటికి క్షమించరు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణతో తమ బతుకులు రోడ్డున పడుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు మధనపడుతున్నా ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి జగన్‌, ఆయన మంత్రివర్గ సహచరులు రాజధాని తరలించడంపై దృష్టి పెట్టారు. రాజధాని అంశంతో జీవనాధారమైన విశాఖ స్టీల్‌ కర్మాగారం అంశాన్ని పక్కనబెడుతూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. విశాఖ నగరానికి మణిహారమైన స్టీల్‌ ప్లాంట్‌ కనుమరుగవుతుంటే కళ్లప్పగిస్తూ చూస్తున్నారు. ఒకవేళ వీరు దృఢసంకల్పంతో విశాఖను రాజధాని చేద్దామనుకున్నా ప్రధాన ఆదాయ వనరులైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లేకుండా ఆర్థికంగా ఎలా నెట్టుకొస్తామనే ఆలోచన కూడా చేయడం లేదు. విశాఖ నగరం అభివృద్ధిలో కీలకమైనవి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు. అందులో సింహభాగం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌దే. దాదాపు 30 వేల మంది ప్రత్యక్షంగా, మరో లక్షమంది పరోక్షంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి ప్రధాన కర్మాగారాన్ని ప్రభుత్వం చేతులు దులుపుకుంటూ దక్షిణ కొరియాకు చెందిన 'పోస్కో' స్టీల్‌ కంపెనీకి, మన దేశంలోని అదానీ కంపెనీకి కట్టబెట్టే చర్యలను సమిష్టిగా అడ్డుకోవాలి.

వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తారా..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశం తెరమీదకు రావడం ఇది మొదటిసారి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు కలిసికట్టుగా అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావును కలిసి విన్నవించగా ఆయన పెద్దమనస్సుతో విశాఖస్టీల్‌ ప్లాంటుకు చెందిన ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణాలలో సగం అంటే నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలను కేంద్ర ప్రభుత్వ ఈక్విటీ గా మార్చారు. అంతేకాక మరో రెండు వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. బీజేపీ పాలనలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 1600 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి విశాఖస్టీల్‌ ప్లాంట్‌ను ఆదుకున్నారు. డా. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ముందు చూపుతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు బాటలు వేశారు. అందులో భాగంగా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నుల నుండి 73 లక్షల టన్నులకు పెంచి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడిన ఘనత డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుంది.

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని నిత్యం ప్రకటించే రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలోని పెద్దలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేసి, కారుచౌకగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్‌ సంస్థలకు దారాదత్తం చేస్తున్నా, దాన్ని అడ్డుకోవడం లేదంటే... డా.వై.ఎస్‌.ఆర్‌ ఆశయాలు కొనసాగిస్తున్నట్లా లేక ఆయన ఆశయాలకు తిలోదకాలు ఇచ్చినట్లా? వాజ్‌పేయిను ఆదర్శంగా చెప్పుకునే మోడీ ప్రభుత్వం, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలనను అందిస్తున్నామని ఢంకా బంజాయించే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించడానికి వారి బాటలోనే నడుస్తారో లేదా తప్పుడు నిర్ణయాలతో ప్రజలను వంచించి చరిత్ర హీనులుగా మారుతారో వారి చేతుల్లోనే ఉంది.

ఉక్కు సంకల్పంతో ముందుకు రావాలి

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అన్నీ రాజకీయపక్షాలు తమ జెండాలను, ఎజెండాలను పక్కనపెట్టి ఒక వేదిక మీదకు వచ్చి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ప్రక్రియను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకునే దాకా అలుపెరగని పోరాటం చేయాలి. దీనితో పాటు మరిన్ని న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేయాలి. అందులో ప్రధానమైనవి నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించి భూములను పంచాలి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత ఇనుప గనులు కేటాయించాలి, పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు తక్షణం 6 వేల కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించాలి, క్యాపిటల్‌ రీస్ట్రక్చర్‌ చేస్తూ ఐదు సంవత్సరాలు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి. వీటితోపాటు అనేక విభాగాల్లో ఉన్న సుమారు ఐదు వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఈ డిమాండ్ల సాధనకు స్వంత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల హక్కు అయిన విశాఖస్టీల్‌ ప్లాంటును కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరు 'ఉక్కు సంకల్పం' తో ముందుకు సాగాలి.

-కొణతాల రామకృష్ణ,

మాజీ ఎంపీ, కన్వీనర్‌, ఉత్తరాంధ్ర చర్చావేదిక

[email protected]

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story