- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు విద్యాసంస్థలు.. కార్పొరేట్ కలెక్షన్ సెంటర్లు..
తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ ఫీజులు, యూనిఫాం, పుస్తకాల పేరిట తల్లిదండ్రులను భారీగా దోచుకుంటున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. విద్య వ్యాపారంగా మారుతున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణ చట్టం అవసరంపై విశ్లేషణ.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఉన్నత భవిష్యత్తు అందించేందుకు తపన పడుతుంటారు. ఎంత కష్టమైనా ఖర్చయినా నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటారు.. కానీ వారి ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు.
అక్షరాలతో లక్షల వ్యాపారం..
రాష్ట్రంలో తల్లితండ్రులు తమ పిల్లలను చదివిపిద్దామని ప్రైవేట్ విద్యాసంస్థలకు పోతే అక్కడ చదువుకొనాలని ఉందని వారు వాపోతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అంటే కాన్వెంట్స్, కార్పొరేట్స్, కలెక్షన్ సెంటర్స్‌గా మారాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీ కేంద్రాలుగా, విద్యతో వ్యాపారం, అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్ద నుండి అయిదు వందల నుండి లక్షల రూపాయల దోచుకునే ముఠా సంస్థలుగా ప్రైవేట్ విద్యాసంస్థలు వేదిక అయ్యాయి. చదువు చారెడు బలుపలు దోచేడు అనే సామెత నేడు ప్రైవేట్ విద్యాసంస్థలను చూస్తే గుర్తుకు రావలసిందే.
అడ్మిషన్లను అప్పుడే నింపేశారు..
వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 1నుండి జూనియర్ కళాశాలలు ప్రారంభం, జూన్ 12నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు అడ్మిషన్లు నింపుకొని ఉన్నాయి. కేజీ నుండి బీటెక్ వరకు ఉన్న ఫీజులు చూస్తే భయపడాల్సిందే కానీ ఈ ఫీజుల గురించి మాత్రం అధికారులకు చెప్పినా వారికి విన పడవు. చూపిస్తే చర్యలు ఉండవు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులు, వారి తల్లితండ్రుల నుండి ఫీజుల దోపిడీకి సిద్దం అయ్యాయి. ఇప్పటికే అనేక కార్పొరేట్ విద్యాసంస్థలు నో అడ్మిషన్ అంటూ విద్యా వ్యాపారం సగం పూర్తి చేశాయి.
ఫీజులు చూస్తే వణకాల్సిందే!
పాఠశాలలల్లో అడ్మిషన్ పొందాలంటే అడ్మిషన్ ఫీజును చూసే భయపడాల్సిందే. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ప్రవేశ పరీక్ష రాసి అందులో పాస్ అయితేనే పాఠశాలలో అడ్మిషన్ ఆ తర్వాత అడ్మిషన్ ఫీజు. రాష్ట్రంలో చిన్న పాఠశాలలో అయిదు వందల నుండి మొదలుకొని కార్పొరేట్లలో ఇరవై వేల వరకు వసూళ్లు, ట్యూషన్ ఫీజు వేరు, హాస్టల్ ఫీజు వేరు ఈ ఫీజులు ప్రతి సంవత్సరం 20 నుండి 30% పెంచుతున్నారు. చిన్న చిన్న జిల్లా కేంద్రాల్లో నర్సరీకి 30వేలు ఉంటే హైదరాబాద్ మహా పట్టణంలో 1లక్షా 50 వేల ఫీజు తీసుకుంటున్నారు. జిల్లాల్లో కొన్ని పాఠశాలల్లో 9, 10వ తరగతులకు 80వేల నుండి 2లక్షల వరకు ఫీజులు ఉంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న కార్పొరేట్ పాఠశాలల్లో 3లక్షల నుండి 6 లక్షల వరకు ఫీజులు ఉన్నా సౌకర్యాల్లో మాత్రం సున్నానే.
యూనిఫాం పేరిట దోపిడీ..
ముఖ్యంగా ప్రైమరీ పాఠశాల విద్యార్థుల పుస్తకాలు ఒకటి నుండి అయిదవ తరగతి వరకు ప్రభుత్వ పుస్తకాలు కాకపోవడంతో యాజమాన్యాలు ఈ ప్రైమరీ పుస్తకాల పేరుతోనే ఎక్కువగా దోచుకుంటూ సిరీస్‌ల పేరుతో ఆ కంపెనీలతో కుమ్మకై ఈ పాఠశాలలో అమ్మే సీరిస్ బుక్‌లను పక్క పాఠశాలల్లో అమ్మకుండా యాజమాన్యాలు సిండికేట్ అవుతున్నారు. ప్రతి పుస్తకంపై పాఠశాల పేర్లు ఉండి, పాఠశాల ఆవరణలోనే అమ్ముతున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు.. కొనే పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ వస్తువులపై బిల్లులు కూడా ఇవ్వరు. కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో స్టడీ మెటీరియల్, యూనిఫార్మ్స్ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కళాశాల వారు యూనిఫామ్స్ పేరుతో పది నుంచి పదిహేను వేల వరకు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు అరికట్టి ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ నిబంధ నలు పాటించేలా రాష్ట్రంలో విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కామన్ విద్య విధానాన్ని తీసుకువచ్చి, ఫీజుల నియంత్రణ చట్టం, విద్యాహక్కు చట్టం కఠినంగా అమలు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
- కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
75695 48477






