- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు.. జాతీయ పత్రికా దినోత్సవం సందేశం
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి, ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవడానికి, సామాజిక అంశాలను

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి, ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవడానికి, సామాజిక అంశాలను తెలుసుకోవడానికి మీడియా ఒక కీలక వేదిక. అయితే స్వేచ్ఛ అంటే పూర్తిగా నియంత్రణ లేని స్వతంత్రత కాదు. అది బాధ్యతతో కూడిన స్వేచ్ఛ. జర్నలిస్టులు అందించే ప్రతి సమాచారం ప్రజలకు ఖచ్చితమైన, నిష్పక్షపాత వాస్తవాలను చేరవేయాలనే ఉద్దేశంతో ఉండాలి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మాత్రమే కాదు. సమాజంలోని సమస్యలను వెలుగులోకి తేవడం, పరిష్కారాలపై చర్చను ప్రేరేపించడం కూడా. భారత చరిత్రలో అనేక నేతలు మీడియా ప్రాముఖ్యతను గుర్తించారు. వీరి దృష్టిలో పత్రికలు అధికారాన్ని ఎదుర్కోవడం కాదు, ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించే మార్గదర్శక శక్తి. అయితే ఆధునిక కాలంలో పత్రికా స్వేచ్ఛ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార ప్రకటనల ఆధారపడిన నిర్వహణ వంటి అంశాలు మీడియా స్వతంత్రతపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వార్తల స్థానంలో అభిప్రాయాలు ప్రాధాన్యం పొందడం పాఠకులలో సందేహాలను పెంచు తోంది. వార్తల నాణ్యత తగ్గడం, సోషల్ మీడియాలో నకిలీ సమాచారం, అపోహలు వేగంగా వ్యాపించడం ప్రజాస్వామ్య చర్చలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీల్లో భారత్ ర్యాంకు తగ్గడం ఈ రంగంలో ఉన్న సమస్యలను సూచిస్తోంది. జర్నలిస్టులపై నమోదయ్యే కేసులు, బెదిరింపులు, కొన్నిసార్లు దాడులు కూడా స్వేచ్ఛ పట్ల ఆందోళనలు వెలిబుచ్చుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాపాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని బలపరచడం. మీడియా నిష్పక్షపాతంగా పనిచేయడం, ప్రభుత్వాలు విమర్శలను ఆమోదించగలగడం, ప్రజలు నిజమైన సమాచారాన్ని కోరుకోవడం.. ఇవన్నీ కలిసి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తా యి. జర్నలిస్టులు సత్యం పక్షాన నిలబడినప్పుడు, పత్రికలు బాధ్యతతో వ్యవహరించినప్పుడు, పాఠకులు వాస్తవాలను తెలుసుకోవాలనే ఆసక్తిని చూపినప్పుడు.. దేశ ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుంది. జాతీయ పత్రికా దినోత్సవం.. ఈ విలువల్ని గుర్తు చేస్తూ, మీడియా స్వేచ్ఛకు సమాజం మొత్తం బాధ్యత వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
-యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645






