- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాబంధు ప్రగడ కోటయ్య..
చేనేత కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన ప్రగడ కోటయ్య జీవితం, సహకార చేనేత ఉద్యమానికి ఆయన వేసిన పునాదులు, శాసనసభ్యుడిగా చేసిన సేవలు, చేనేత రంగ అభివృద్ధికి అందించిన విశేష కృషి..

చేనేత కార్మికుల సంక్షేమాన్నే జీవిత ధ్యేయంగా ఎంచుకుని, సహకార చేనేత ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన మహో న్నత ప్రజానాయకుడు ప్రగడ కోటయ్య. ఉద్యమకారుడిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన అందించిన సే వలు చేనేత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 26ను అధికారికంగా "ప్రగడ కోటయ్య జయంతి"గా ప్రకటించింది.
చేనేత సహకార సంఘాల ఏర్పాటు కోసం..
గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన ప్రగడ కోటయ్య కొంతకాలం ఉపాధ్యాయుడిగా, చీరాల ఈపురుపాలెంలో ఐఎల్ టిడి కంపెనీలో గుమాస్తాగా పనిచేశారు. ఆ తర్వాత రైతు నాయ కుడు ఎన్.జి. రంగా సలహాతో మద్రాస్ టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూ ట్‌లో సూపర్వైజర్‌గా చేరి, 1935లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్‌చార్జిగా పనిచేస్తూ సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు విశేష కృషి చేశారు.. ప్రజాజీవితానికే అంకితమైన ఆయన 1995 నవం బర్ 26న అనారోగ్యంతో కన్నుమూశారు. 70వ జన్మదినోత్సవ సందర్భంగా అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డి ఆయనకు 'ప్రజాబంధు' బిరుదుతో సత్కరించారు.. మరణానంతరం వెంకటగిరిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాం డ్లూమ్ టెక్నాలజీకి ఆయన పేరు పెట్టగా, చీరాల సెంటర్, హైదరాబాద్ అప్కో భవన్‌లలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు. జీవి తాంతం చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు.
చేనేత ఉద్యమ సారధి...
1937 జూన్‌లో నిడుబ్రోలులో జరిగిన గుంటూరు జిల్లా చేనేత మహాసభ నిర్వహణలో ప్రగడ కోటయ్యది కీలక పాత్ర. అనంతరం గుంటూరులో జరిగిన చెన్న రాష్ట్ర చేనేత మహాసభకు అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి సి.రాజగోపాలచారి ముఖ్య అతిథిగా హాజరై చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. 1939లో మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో చేనేత నాయకులు డైరెక్టర్లుగా ఎన్నికయ్యేలా కోటయ్య వ్యూహాత్మకంగా కృషి చేశారు. 1941 లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన థామస్ ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీని గుంటూరుకు ఆహ్వానించి, చేనేత రంగ సమస్యలపై 100 పేజీల మెమోరాండాన్ని సమర్పించారు..1942లో దామెర్ల రమాకాంతరావు అధ్యక్షుడిగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా చెన్న రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతం చేశారు. నూలు కొరత నివారణ, ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించి చేనేత కార్మికుల హక్కుల కోసం నిరం తరం పోరాడారు.
మద్రాస్‌లో సత్యాగ్రహం!
1947 ఆగస్టులో ప్రగడ కోటయ్య ఆధ్వర్యంలో నిడుబ్రోలులో "చేనేత" వారపత్రిక ప్రారంభమైంది. ఈ పత్రికను 1952 వరకు నిర్వహించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిపి వేయాల్సి వచ్చింది. చేనేత పారిశ్రామికులకు తగినంత నూలు సరఫరా చేయాలని, నూలు ధరలను అదుపులో ఉంచాలని, నూలు ఎగుమతులను నిలిపివేయాలని కోటయ్య నాయకత్వంలో ఉద్యమాలు సాగాయి. 1950 వరకు పరిస్థితుల్లో మార్పు రాక పోవడంతో చేనేత కాంగ్రెస్ అన్ని జిల్లాల్లో ఆకలి యాత్రలు, సత్యాగ్రహాలు నిర్వహించింది. ఫలితం లేకపోవడంతో 1950 ఏప్రిల్ 16 నుంచి జూన్ 30 వరకు మద్రాసులో 75 రోజుల పాటు భారీ సత్యాగ్రహం చేపట్టారు.. దాదాపు పదివేల మంది చేనేత కార్మికులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హరేకృష్ణ మెహతాతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం హామీలు ఇవ్వడంతో సత్యాగ్రహాన్ని విరమించారు.
ఈయన సలహాతోనే కీలక నిర్ణయాలు..
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు చట్టసభల్లో సభ్యుడిగా పనిచేసిన ప్రగడ కోటయ్యకు చేనేతే జీవన ధ్యేయం. శాసనసభ, శాసనమండలి, రాజ్యసభల్లో వస్త్రరంగ సమస్యలపై ఆయన చేసిన ప్రసంగాలను సభ్యులు ఆసక్తిగా ఆలకించేవారు. చేనేతకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆయన సలహా ఎంతో ప్రాధా న్యం పొందేది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా సాధారణ పౌరుడిలాగే నిరాడంబర జీవితం గడిపారు. చివరి వరకు నిజాయితీ, నిబద్ధత, కార్యదీక్షతో ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోకుండా ప్రజాసేవకే అంకితమయ్యారు. ప్రగడ కోటయ్య జీవితం నేటి నాయకులకు, భావితరాలకు ఆదర్శప్రాయం.
- తడక యాదగిరి
ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డు మాజీ సభ్యులు
93480 09227






