- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదరిక నిర్మూలన అత్యవసరం.. ఎలా?
ఉభయ తెలుగు రాష్ట్రాలూ సంక్షేమ పథకాలకు తోడుగా, పారిశ్రామిక అభివృద్ధి కూడా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావడానికి, పేదరిక

ఉభయ తెలుగు రాష్ట్రాలూ సంక్షేమ పథకాలకు తోడుగా, పారిశ్రామిక అభివృద్ధి కూడా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావడానికి, పేదరిక నిర్మూలనకు ఆవశ్యకమని గుర్తించాయి. అందుకే అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే రెండు రాష్ట్రాలు పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించి గొప్ప ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెంది పేదరికం శాశ్వతంగా నిర్మూలించడం తమ లక్ష్యంగా ప్రకటించాయి.
18 నెలల్లో తమ ప్రభుత్వం ₹3.2 లక్షల కోట్ల తాజా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, 2035 నాటికి రాష్ట్రం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందనుందని తెలంగాణ ముఖ్యమంత్రి వక్కాణించారు. అటు వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాబోయే ఐదేళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రారంభించి, 2047 నాటికి 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధించడం తమ లక్ష్యంగా ప్రకటించారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. దేశ స్థూల ఉత్పత్తి పెరగడం వలన పేదరికం దానంతట అదే సమసి పోదు. ఇందుకు మన దేశమే ఒక ఉదాహరణ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మన స్థానం ప్రస్తుతం 4 కావడం ఎంత నిజమో, తలసరి ఆదాయం విషయంలో 194 దేశాలలో మన స్థానం 143గా ఉండడం అంతే నిజం.
మన డీఎన్ఏలో లేనిది అదే..
ఈ సందర్భంగా కొన్ని కఠోర వాస్తవాలు మనం గుర్తించాలి. స్వచ్ఛందంగా, చట్ట ప్రకారం వ్యవహరించడం మన డీఎన్‌ఏలో లేదు. రహదారిపైన ఎడమవైపు నడవడం మొదలుకొని, వివిధ పన్నుల చెల్లింపు వరకూ ఎగవేతకే మన ప్రాధాన్యం. అందుకు వివిధ మార్గాలు తెరిచే మేధా వులకు కొదవలేదు. పరిశ్రమల సామాజిక బాధ్యత పథకం కింద కోట్లు కేటాయించే సంస్థలు కూడా తమ వరకూ వచ్చేసరికి కార్మిక చట్టాలను అరకొరగానే అమలు చేస్తాయి. దేవాలయాలు నిర్మించడం, దేవస్థానాలకు విరివిగా భూ విరాళాలు అందించడం చేసే వదాన్యులు కూడా తమ సంస్థల విషయంలో అదే దారి పడతారు. ఆయా పరిశ్రమల, సంస్థల విస్తృత తనిఖీ అధికారం ఉన్నన్నాళ్లూ ఆ ఘనులు స్వలాభమే చూసుకున్నారు. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా, ఇన్స్పెక్టర్ రాజ్‌కి మంగళం పాడి కొన్నేళ్లైంది. దాంతో ఎగవేత పని మరింత సులువైంది. నా ఉద్దేశ్యం చట్టాలు నిర్దిష్టంగా అమలు పరిచే యాజమాన్యాలు, నిజాయితీగా వ్యవహరించే అధికారులు అసలు లేరని కాదు. అన్ని జీవన రంగాలలో లాగే ఈ విషయంలోనూ అరుదుగా మినహాయింపులు ఉండవచ్చు.
సాంకేతికత ఆ మార్గంలో సాగితే..
ఇదంతా ఎందుకంటే, పేదరికం శాశ్వతంగా నిర్మూలించబడాలంటే, ఇతర చర్యలతో పాటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపార, వాణిజ్య సంస్థల అధిపతులు కార్మిక సంక్షేమ చట్టాలను తూ.చా తప్పకుండా అమలు పరచక తీరని విధంగా, అధికార వర్గం కూడా ముడుపులకు ఆశపడి చట్టాల ఉల్లంఘనకు సహకరించడం అసాధ్యమయ్యే రీతిగా సాంకేతికతను ఉపయోగించాలి. అందుకోసం ఒక రాజమార్గం తెరచుకుంటోంది. అదే కృత్రిమ మేధ వినియోగం. డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, వాట్సాప్ గవర్నెన్స్ క్రమంగా అన్ని ప్రజాసేవలు వాట్సాప్ ద్వారా రియల్ టైమ్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయట. నేరాల నిరోధానికి, భూకబ్జాల నిర్ధారణకి, ఉద్యోగుల హాజరు తనిఖీకి, మద్యం దుకాణాలపై పహరాకు, న్యాయ స్థానాలలో వాద్యాల విచారణకు, ఇలా ఎన్నిటికో ఆధునిక సాంకేతిక వినియోగమవుతోంది. ఇది విక్రముడిలా వ్యాపిస్తోంది. ఆధునిక సాంకేతికతతో అద్భుతాలు సాధించవచ్చని పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఇది అతిశయోక్తి కాదు. తలచుకుంటే ఈ పరిధిలోకి కార్మిక చట్టాల అమలు కూడా తీసుకు రావచ్చు.
సీసీటీవీల్లో ఏఐ యాప్
చాలా చిన్న తరహా పరిశ్రమలలోనూ, ప్రతి మధ్యతరగతి, భారీ పరిశ్రమలలోనూ, అన్ని మాల్స్ లోనూ, బ్రాండెడ్ ఉత్ప త్తులు విక్రయించే చిరు దుకాణాలలోనూ, విద్యాసంస్థలలో, వైద్యశాలలలో చాలావరకు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటిని కృతిమ మేథ ఆధారిత సాంకేతికతో అనుసంధానిస్తూ యాప్ రూపొందిస్తే ఒక్కో పరిశ్రమలో, సంస్థలో ఎంతమంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారో, వారు రోజులో ఎన్ని గం టలు పని చేస్తున్నారో, పనివేళల మధ్య ఎప్పుడు, ఎంత విరా మం ఇస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వారిలో ఎంత మంది పేర్లు హాజరు పట్టీలలో, వేతన దస్త్రాలలో ఉంటున్నా యో, వారికి ఎంత జీతం ముడుతున్నదో, ఆ దస్త్రాలలో పేర్లు లేని వారికి వేతనం ఏ రూపంలో, ఎంత చెల్లించబడుతుందో, అధిక పని గంటలకి ఓవర్ టైం చెల్లిస్తున్నారో, లేదో సమానమైన పనికి సమాన ప్రతిఫలం లభిస్తున్నదో, లేదో, కరతలామలకం అవుతుంది.
ఉచితాలకు వారూ అనర్హులే..
తోడుగా భద్రతా ప్రమాణాల అమలునూ, పని వాతావరణాన్ని కూడా సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వర్తింపు విషయంలోనూ ఈ సాంకేతికతను వినియోగించాలి. ఇందుకు ఖర్చుకు వెనుకాడక ఉద్యమిస్తే, ఫలితంగా కోట్లమంది జీవన ప్రమాణాలు పెరిగి, ఉచితాలకు అర్హులయ్యే పౌరుల సంఖ్య గణనీయంగా తగ్గి, ప్రభుత్వంపై పడుతున్న పెను ఆర్థిక భారం తేలికవుతుంది. నేరగాళ్లను ఉచితాలకు అనర్హులను చేయాలనుకున్నట్లే, కార్మిక సంక్షేమ చట్టాలను సక్రమంగా అమలు చేయని పరిశ్రమలు, సంస్థలకు రాయితీలు ఉపసంహరించే విషయం కూడా పరిశీలించాలి. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాల లాగే, ప్రపంచ ఆకలి సూచీలో మనదేశ స్థానం అట్టడుగు నుండి బయటపడటానికి కూడా మన ప్రభుత్వాలు నడుం కట్టాలి. తెలుగు రాష్ట్రాలను దేశంలోనే ముందు పీఠికన నిలపాలనుకునే సంకల్పం గట్టిదే. సమంజసమైనదే. కానీ ఆ మార్గంలో పొంచి ఉన్న ముళ్ల బాటలను తొలగించకపోతే, కార్మిక హక్కులను కాపాడకపోతే, ప్రపంచ ఆకలి సూచీలో మన స్కేల్ మెరుగుపడకపోతే... ఎలాంటి సంకల్పమైనా సరే.. వెనకడుగు వేయక తప్పదని గుర్తించుకోవాలి.
మల్లాప్రగడ రామారావు
99898 63398






