మానవీయ పాటల కవి.. మిట్టపల్లి సురేందర్‌

by Ravi |   (  Updated:2026-07-13 00:45:13  IST  )

తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తిని తన పాటల్లో ప్రతిబింబించిన సహజకవి, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్‌కు ప్రతిష్ఠాత్మక ‘మా భూమి’ పురస్కారం దక్కింది.

మానవీయ పాటల కవి.. మిట్టపల్లి సురేందర్‌
X

తెలంగాణ గడ్డ సంబురపడే సహజకవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని ప్రతిభింబించే ఆయన పాటలకు అత్యంత ప్రధానమైన మా భూమి పురస్కారానికి ఎంపికయ్యారు. నేడు దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పురస్కారం అందుకోనున్నారు.రాతిబొమ్మల్లోన కొలువైన శివుడామిట్టపల్లి సురేందర్ పాటల్లో ఉత్సాహం ఉంటుంది.. ప్రశ్నించడం ఉంటుంది.. పోరాట తిరుగుబాటు ఉంటుంది.. కృతజ్ఞత ఉంటుంది.. అన్నింటికీ మించి సత్యమే ఆయన పాటల్లో కన్పిస్తుంది.. అంతటి విలువైన అక్షరాలను పాటగా మలుస్తాడు. ఈయన, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు జానపద, సినీ గీత రచయిత. తెలంగాణ కోసం అమరులైన యువకుల బలిదానాల మీద అతను రాసిన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాట ఎంతో ప్రజాదరణ పొందింది. దర్శకులు ఆర్. నారాయణమూర్తి ఆ పాటను తన పోరు తెలంగాణ (2011) చిత్రం కోసం వాడుకున్నారు. అదే పాటకుగానూ 2011లో సురేందర్ నంది పురస్కారం అందుకున్నాడు. సురేందర్ ఇప్పటివరకు దాదాపు 300ల పాటలు రాశారు. అందులో 20 పాటలు తొమ్మిది సినిమాలకు రాసినవి ఉన్నాయి.

దగా పడిన ఆవేదనను పాటగట్టి..

ఆయన రాసిన గేయాలన్నీ బడుగు జీవుల మనసు గాయాలను మాన్పేవే ఆయన పాటలు.. సురేందర్ ప్రైవేట్ సాంగ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా పాటలు రాశాడు. ధైర్యం, రాజన్న, సత్యాగ్రహి వంటి చిత్రాల్లో సినీ గీతాలు రాసి సినీ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నాడు. మిట్టపల్లి సురేందర్ తెలంగాణ గడ్డ ఆవేదనలను సునిశితంగా పరిశీలించాడు. తెలంగాణ ప్రాంతం సంబురపడేలా, ప్రకృతి పంఛభూతాలు, అడవి తల్లి గొప్పతనాన్ని తన గళంతో వివరిస్తారు. తెలంగాణ గడ్డ అణువణువు దగా పడిన ఆవేదనను కళ్లకు అద్దినట్టు తన పాటలతో చాటి చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఆయన పాటలు ఎంతో ఉత్సాహనిచ్చి... తెలంగాణ పోరాట శక్తులకు మరింత బలమయ్యాయి.

సహజ పదాల అల్లికలతో..

ఇవే కాకుండా సామాజిక కోణంలో ఆయన రాసిన అనేక పాటలు ఎందరినో కదలించాయి. అమ్మ ప్రేమను తెలిపే పాటలు.. నేల తల్లి గోసను, ఉద్యమ శక్తుల గొప్పతనాన్ని ఆయన పదాల అల్లికలతో ప్రపంచానికి చాటారు. ఒక్కడే ఒక్కడూ అన్న మందకృష్ణుడు .. దళిత జాతి సూర్యుడు అంటూ సామాజిక గీతం ఓ సంబురమైతే ... జార్జి రెడ్డి సినిమాలో వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్ ..అంటూ యువతలో ఓ ఉత్సాహం నింపారు. సినీ ప్రపంచంలో అడుగుపెట్టినా.. ఆయన పాటలు మాత్రం ఎంతో అర్థవంతంగా ఉంటాయి. లవ్ స్టోరీ సినిమాలో నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరే నే చిత్తుర వైతిరయ్యో అంటూ గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమను చూపారు. అలాగే రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి నీ మీద మానసాయేనే అంటూ తెలంగాణ యాస భాషలోని సహజ పదాల అల్లికలతో గుండెలకు హత్తుకునే స్వచ్ఛమైన పాటలకు కేరాఫ్ మిట్టపల్లి సురేందర్.. ఆలోచన, అర్ధవంతం, సందేశాన్ని ఇచ్చే సమాజ శ్రేయస్సును కోరుకునే ఆయన పాటలు తెలంగాణ సమాజాన్ని తట్టిలేపుతాయి..

సమాజాన్ని క్షుణ్ణంగా చదివి...

తెలంగాణ నేల తల్లి గోసలను చిన్నతనం నుంచే చూసిన మిట్టపల్లి చదువుకున్నది తక్కువే అయినా సమాజాన్ని క్షుణ్ణంగా చదివారు. తెలంగాణ ఉద్యమంలో.. సామాజిక చైతన్యంలో సినీ రంగంలో ఆయన పాటలన్నీ మధురమే..మానవీయ కోణమే.. మానవీయ పాటల సునామీ మిట్టపల్లి సురేందర్‌కు మా భూమి అవార్డు దక్కడం ఎంతో గొప్ప విషయం..

-సంపత్ గడ్డం

78933 03516

Next Story