- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మా ఒక చెడు మాత్ర
నిజానికి ఒకప్పుడు సినిమాను సమాజానికి అద్దంలా భావించిన రోజులు ఉన్నాయి.. కాలక్రమేణా సినిమా రూపం మారింది. నేటి డిజిటల్ యుగంలో సినిమాలకంటే వెబ్ సిరీస్‌లు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, అవి ప్రజల దృష్టిలోకి చర్చల్లోకి అరుదుగా వచ్చే సామాజిక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఈ ధోరణిలో మలయాళ వెబ్ సిరీస్ ‘ఫార్మా’ ఒక ముఖ్యమైన ప్రయత్నం. ఈ సిరీస్‌లో చికిత్స కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చే ఔషధ ప్రపంచాన్ని, మానవ ఆరోగ్యం గణాంకాలకే పరిమితమయ్యే దుస్థితిని బలంగా చిత్రించారు..

నిజానికి ఒకప్పుడు సినిమాను సమాజానికి అద్దంలా భావించిన రోజులు ఉన్నాయి.. కాలక్రమేణా సినిమా రూపం మారింది. నేటి డిజిటల్ యుగంలో సినిమాలకంటే వెబ్ సిరీస్‌లు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, అవి ప్రజల దృష్టిలోకి చర్చల్లోకి అరుదుగా వచ్చే సామాజిక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఈ ధోరణిలో మలయాళ వెబ్ సిరీస్ ‘ఫార్మా’ ఒక ముఖ్యమైన ప్రయత్నం. ఈ సిరీస్‌లో చికిత్స కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చే ఔషధ ప్రపంచాన్ని, మానవ ఆరోగ్యం గణాంకాలకే పరిమితమయ్యే దుస్థితిని బలంగా చిత్రించారు..
ఆసుపత్రి ఒకప్పుడు దేవాలయం. ఇప్పుడు కార్పొరేట్ కార్యాలయం.. స్టెతస్కోప్‌లో వినిపించాల్సిన గుండె చప్పుడు ఫైల్స్‌లో మునిగిపోయింది. ప్రిస్క్రిప్షన్‌లో ఉండాల్సిన శ్రద్ధ కమిషన్ శాతాల్లో కలిసిపోయింది. ఫార్మాలో ఈ చేదు మాత్రను మనం మింగుతున్నామా? లేదా మనల్నే మింగేస్తుందా? అన్న ప్రశ్నతో మొదలవుతుంది ఈ సిరీస్.. మధ్యప్రదేశ్‌లో నకిలీ దగ్గు సిరప్ సేవించి 14 మంది పిల్లలు మృతి చెందిన తాజా ఘటన, ఈ సిరీస్‌లో చూపిన అంశాలు వాస్తవ జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయో గుర్తు చేస్తాయి.
లాభమనే ఊబిలో చిక్కుకుని..
సినిమాల్లో విలన్ పాత్ర కాలక్రమేణా మారింది. మొదట్లో పెత్తందారు, గ్రామ పెద్దలు, ఆ తర్వాత తుపాకీతో, సూట్ వేసుకుని, ఫైళ్లతో ఉన్న రాజకీయ నాయకులు/వ్యాపార వేత్తలు అయిపోయారు.. చివరికి లాభాల వ్యవస్థ, ఫార్మా రంగం వంటి అంశాలు విలన్ రూపాన్ని మార్చాయి. 'ఫార్మా' సిరీస్‌లో, ఈ నూతన విలన్ల కథను చూపిస్తారు. లాభాల వ్యవస్థే ఇవ్వాళ విలన్. లాభమనే ఊబిలో చిక్కుకుని ప్రజల ప్రాణాల్ని లెక్క చేయని ఫార్మా రంగంపై రూపొందిన సిరీస్ ‘ఫార్మా’ నేటి డిజిటల్ యుగంలో సినిమాలకంటే వెబ్ సిరీస్‌లు వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, అవి ప్రజల దృష్టిలోకి చర్చల్లోకి అరుదుగా వచ్చే సామాజిక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఈ ధోరణిలో మలయాళ వెబ్ సిరీస్ ‘ఫార్మా’ ఒక ముఖ్యమైన ప్రయత్నం. ఇది ఒక వ్యక్తి కథ కాదు. ఇది ఒక వ్యవస్థ జీవచరిత్ర.
ప్రేక్షకులను ఆలోచింపజేసే కథ..
వైద్యుడు ఒంటరిగా విలన్ కాడు.. ఫార్మా కంపెనీ ఒంటరిగా రాక్షసం కాదు.. నియంత్రణ సంస్థలు నిర్దోషులు కావు.. కానీ ఎప్పడూ రోగి మాత్రం బలిపశువు.. ఇక్కడ హీరోలు లేరు.. విజేతలు లేరు. ఉన్నది మౌనంగా పనిచేసే యంత్రం. మందులు, చాలాసార్లు జీవితం మరణం ఈ రెంటి మధ్య సన్నని రేఖను నిర్ణయిస్తాయి. నైతికత కంటే లాభాలకే పెద్దపీట వేయబడే సున్నితమైన అంశాన్ని పరి స్థితిని ఆధారంగా చేసుకుని ‘ఫార్మా’ ఒక కీలక ప్రశ్నను మన ముందుకు తెస్తుంది. ఔషధ వ్యాపారం నిజంగా నైతికమా? లేక కుమ్మక్కు, అధికార రాజకీయాలే దానికి మూలమా? ఈ సిరీస్ నేరుగా ఎవ్వరినీ నిందించదు, కానీ సంఘటనలు, పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆలోచించేందుకు, ప్రశ్నించేందుకు ప్రేరేపిస్తుంది. ఇది ఆసుపత్రుల కథ కాదు. ఇది కార్పొరేట్ గదుల్లో మోగని గుండె చప్పుళ్ల కథ. ఎయిర్ కండిషన్ గదుల్లో పడే సంతకాలు రోగి గదిలోని నిశ్శబ్దాన్ని ఎలా పెంచుతాయో ఈ సిరీస్ నెమ్మదిగా మన ముందుంచుతుంది. ఇక్కడ ఎవరూ విలన్లు కాదు.. అందరూ బిజీగా ఉన్న మనుషులే.. లాభాల గ్రాఫ్ చూస్తూ మనిషి శ్వాసను ‘డేటా’గా మార్చేసే వారు. అదే అసలు భయం. అది క్రూరత్వం కాదు సాధారణీకరణ.
ఆరోగ్యం మార్కెట్‌లోనే ఉండాలా?
ఈ సిరీస్‌లో మాటలు చాలా తక్కువ. ఫైళ్లు ఎక్కువ మాట్లాడతాయి. ఫారాలు, రిపోర్టులు, పేషంట్ నంబర్లు వీటన్నింటి మధ్య ఒక రోగి పేరు మెల్లగా మాయమవుతుంది. డాక్టర్లు ఇక్కడ దేవుళ్లు కాదు. వాళ్లూ వ్యవస్థలో ఇరుక్కున్న మనుషులే.. నైతికత ఒక వైపు, ఉద్యోగ భద్రత మరో వైపు.. ఆ రెండిటి మధ్య నిలబడి వాళ్లు కూడా నెమ్మదిగా అలసి పోతారు. ఈ అలసటే ఈ సిరీస్‌లో అత్యంత నిజమైన దృశ్యం. ఫార్మా కూర్చొని చూస్తుంది. ఎదురుచూస్తుంది. ఆ ఎదురుచూపుల్లోనే సమాజం ఎంత అసహాయంగా ఉందో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఈ సిరీస్ నడకలో వేగం నెమ్మదిగా ఉంటుంది. నా ఉద్దేశ్యంలో అది ఒక లోపం కాదు. మన జీవితం కూడా ఆసుపత్రుల్లో వేగంగా జరగదు కదా. ముగింపులో ఫార్మా ఏ పరిష్కారం చూపదు. ఇది ఒక చట్టాన్ని రాయదు. ఉద్యమాన్ని ప్రకటించదు. కానీ ఒక ప్రశ్నను మన ముందు పెడుతుంది. ఆరోగ్యం ఎప్పుడూ మార్కెట్‌లోనే ఉండాలా? మందు ధర నిర్ణయించేటప్పుడు మనిషి శ్వాసకి విలువ ఉందా?
ఫార్మా రంగాన్ని నగ్నంగా నిలబెట్టే సిరీస్..
చివరికి ఈ సిరీస్ మనకు ఒకటే చెబుతుంది. కొన్ని చేదు మందులు శరీరానికి కాదు సమాజానికి అవసరం. ఈ సిరీస్ చూడడానికి అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. కానీ తప్పకుండా మింగాల్సిన అనుభవం. కథనం అనేక పొరల్లో సాగుతుంది. అగ్రశ్రేణి ఔషధ సంస్థల అధికారి వర్గం, వైద్యులు, మెడికల్ ప్రతినిధులు, ఈ వ్యవస్థలో నలిగిపోతున్న సామాన్య ప్రజలు, అధికార కారిడార్లలో కూర్చున్న వ్యక్తులు వీళ్లందరినీ ఒకే కథలో కలుపుతుంది. ఈ ఫార్మా అనేది భారతీయ ఔషధ పరిశ్రమలోని చీకటి కోణాలను ఆవిష్కరించే సామాజిక కార్పొరేట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రాణం కంటే లాభం మాత్రమే ముఖ్యమయిన ఫార్మా వ్యవస్థలో పేరుకుని వైద్యాన్ని, ఆరోగ్యాన్ని నియంత్రిస్తున్న స్థితిని ఈ సిరీస్ చూపిస్తుంది. ఇక ఫార్మా వ్యవస్థను నియంత్రించే అధికార యంత్రాంగం, పర్సేటేజీలను ప్రచారం చేసే రిప్రజెంటేటివ్ వ్యవస్థ.. ఒకటేమిటి మొత్తం ఫార్మా రంగాన్ని నగ్నంగా మన ముందు నిలబెడుతుందీ సిరీస్..
వెబ్‌సీరిస్ : ఫార్మా
రచన, దర్శకత్వం: పి.ఆర్.అరుణ్.,
నటీ నటులు: నివిన్ పాళీ, రజిత్ కపూర్ తదితరులు
లభ్యం- హాట్‌స్టార్
-వారాల ఆనంద్
94405 01281






