- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధునిక ఒంటరితనపు నీడ.. అబ్సెషన్
ప్రేమ, మోజు, మూఢనమ్మకం, మానసిక భయాల నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' మూవీ ఎలా ఉంది? కథ, నటీనటుల ప్రదర్శన, దర్శకత్వం, క్లైమాక్స్‌పై పూర్తి సమీక్ష చదవండి.

ప్రపంచ వ్యాప్తంగా సామాన్యులతో పాటు అసామాన్యుల నోట వినిపిస్తున్న సినిమా పేరు హాలీవుడ్‌కు చెందిన ‘అబ్సెషన్’ (Obsession). ఈ పదానికి తెలుగులో ‘పిచ్చి’ లేదా ‘యావ’ అనే అర్థాలున్నాయి. ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్స్ లేని గొప్ప హారర్ చిత్రం. కేవలం ఏడు కోట్ల బడ్జెట్‌తో ఇంగ్లీషులో తీసిన ఈ సినిమా పదమూడు వందల కోట్లు సంపాదించిందని అంతర్జాతీయ మీడియా కథనం.
కథేమిటంటే..
బౌర్ (మైకేల్ జాన్స్ టన్) ఓ మ్యూజిక్ షాపులో పని చేస్తుంటాడు. అతడికి ముగ్గురు స్నేహితులు. ఇందులో ‘నిక్కీ’ (ఇండే నవరెట్టి)ని అతడు ప్రేమిస్తాడు. కానీ.. చెప్పేందుకు భయపడతాడు. బౌర్ కు ‘వన్ విష్ విల్లో’ అనే తాంత్రిక శక్తులున్న బొమ్మ గురించి తెలుస్తుంది. ఆ బొమ్మను విరిచేసి, నిక్కి తనను ప్రేమించాలని కోరుకుంటాడు. కానీ.. ఆనాటి నుంచి నిక్కీ దెయ్యం పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. తరువాత ఏం జరిగిందనేది తెరపై చూడాలి. ఇదో సైకలాజికల్ హర్రర్ సినిమా. ఇండియాలో కూడా విడుదలయింది. నిక్కి ప్రాణాలు పోగొట్టుకునే దశ వస్తుంది. ఆమె ప్రేమకోసం బౌర్ చేసిన త్యాగం ఏమిటనేది చూడవలసిందే.
సినిమా ఎలా ఉంది ..
వర్తమాన ఆధునిక సమాజంలో ఒంటరితనాన్ని వదిలించుకునే క్రమంలో ‘అతిప్రేమ’ అధికమయింది. ప్రేమ, ఇష్టం అనేవి సహజంగా కలగాలి. మితంగా కూడా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలతో పని లేకుండా భయపెట్టి అడ్డదారులలో ప్రేమను పొందాలనుకోవడం పిచ్చితనం. ఇదే అంశాన్ని దర్శకుడు కర్రీ బార్కర్ (యూట్యూబర్) హారర్ అంశాలుకన్నా సైకలాజికల్ పాయింట్స్ కే ప్రాధాన్యతనిచ్చి తక్కువ రన్ టైమ్ తో సినిమాను ముగించిన విధానం ‘దిగ్గజ దర్శకుల’కు ఓ పాఠమే.
ప్రత్యేకతలు..
ఇదో హారర్ సినిమాలా ఉంటుంది. కాని.. తెల్లని, ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకున్న దెయ్యాలు ఇందులో లేవు. ఓ సాధారణ ప్రేమకథలా మొదలై, ‘వన్ విష్ వీల్లో’ బొమ్మ విరగడంతో కథ టర్న్ తీసుకుంటుంది. లేని వాటిని ఉన్నవిగా ఊహించుకొని ప్రేక్షకులు కుర్చీ చివరి అంచుకు వచ్చేస్తారు. నిక్కీ తనను తాను గాయపరచుకునే సన్నివేశం, సారాపై ఎటాక్ చేసే దృశ్యాలు చాలా వయొలెంట్‌గా ఉంటాయి. తన తప్పును దిద్దుకునే ప్రయత్నంలో హీరో పడే సంఘర్షణ చివరి వరకు థ్రిల్లింగ్ ఉంటుంది. నిజా నికిదో ముక్కోణపు ప్రేమ కథ. ఈ కథను అనేక అంశాలతో ముడివేసి దర్శకుడు చెప్పిన తీరుకు క్లైమాక్స్ ఓ ఉదాహరణ.
పాత్రలు..
సినిమాలో నిక్కీ, బౌర్ లు మాత్రమే కనిపిస్తారు. నిక్కీ పాత్రలో ‘నవరెట్టి’ అద్భుతంగా నటించింది. సైకో ప్రేమికురాలిగా, సాధారణ అమ్మాయిగా ఆమె చూపిన వేరియేషన్స్ సినిమాకు ప్రాణం పోసాయి. బౌర్ గా మైఖేల్ జాన్సన్ ఎమోషనల్‌తో ఆకట్టుకుంటాడు. ఎటువంటి విజువల్ ఎఫెక్ట్ లేకుండా హర్రర్ సన్నివేశాల చిత్రణ క్రేజీగా ఉంటుంది. హీరో, హీరోయిన్స్ కాకుండా మరో నాలుగైదు పాత్రలున్నాయి. అవన్నీ వాటి పరిధి మేరకు మంచి నటనను ప్రదర్శిస్తాయి.
హెచ్చరిక..
‘అబ్సెషన్’ చిత్రంలో అభ్యంతరకర దృశ్యాలు చాలానే ఉన్నాయి. కుటుంబంతో కలసి చూడాలంటే కాస్త కష్టమే మరి. కేవలం ఏడు కోట్ల బడ్జెట్‌తో ఇంగ్లీషులో తీసిన ఈ సినిమా పదమూడు వందల కోట్లు సంపాదించిందంటే ఈ సినిమా ఎంత మందిని ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు.
- భమిడిపాటి గౌరీశంకర్
94928 58395






