ఏజెన్సీలోకి గిరిజనేతరులను నిలువరించాలి

by Disha edit |
ఏజెన్సీలోకి గిరిజనేతరులను నిలువరించాలి
X

రాజ్యాంగంలోని ఆర్టికల్ 244ని ఐదవ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు వర్తింపజేశారు. ఐదవ షెడ్యూల్లో రాష్ట్ర గవర్నర్లతో సంప్రదించి షెడ్యూల్ ప్రాంతాలను తెలపడానికి రాష్ట్రపతికి అధికారముంది. అలాగే శాంతిభద్రతల నిబంధనలు రూపొందించడానికి రాష్ట్ర గవర్నర్ కి అధికారం ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959 లో షెడ్యూల్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రాతపూర్వక ఒప్పందంతో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న స్థిరాస్తులను ఆదివాసీల నుండి బదిలీ చేయడాన్ని ఇది నిషేధించింది. ఈ 1959 నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా 1970లో 1959 చట్టాన్ని సవరణ చేసి 1/70 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనేతరులకు అనుకూలంగా భూమి బదిలీ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. దీనినే రామ్‌రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులోనూ సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని ఉటంకించింది.

వారి నిర్లక్ష్యం కారణంగా

అయితే ఈ చట్టం ద్వారా గిరిజన ఆస్తులు, గిరిజనుల హక్కులకు రక్షణ కలుగుతుంది అనుకుంటే విచిత్రంగా ఈ చట్టం అమల్లోకి వచ్చాకనే వలసలు ఎక్కువయ్యాయి. ఉదాహరణకు 1971 జనాభా లెక్కల ప్రకారం భద్రాచలం గ్రామంలో 1,612 ఇండ్లు, 2,405 ఓటర్లు, మొత్తం జనాభా 10,710 మాత్రమే. మరి ఇప్పుడు ఫిబ్రవరి 2022 నాటికి 12,600 ఇండ్లు, 37,250 ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు. వీరందరూ ఆ చట్టాన్ని నిబంధనలను బేఖాతర్ చేయడమే కాదా? ఏజెన్సీ ప్రాంతాల్లో వలసలు పెరిగి ఇల్లందు, కొత్తగూడెం మండలాలు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల పరిధిలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను గిరిజనేతరులు కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని సుమారు 1,622 రెవెన్యూ గ్రామాల పరిధిలోకి గిరిజనేతరులు వచ్చి వ్యాపారాలు చేసి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను, ఆదివాసీల భూములను కబ్జా చేశారు. అయితే అలాంటి వారిని అడ్డుకోవాల్సిన ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. వీరి నిర్లక్ష్యాన్ని గుర్తించిన గిరిజనేతరులు గిరిజనుల భూభాగంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. ఆ వలసలను నియంత్రించాల్సిన అధికారులు వారికి ఏజెన్సీ ప్రాంత గుర్తింపు కార్డు, ఓటు హక్కు, ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అలాగే ప్రభుత్వం ఇస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను వలస గిరిజనేతరులకు అందడం వలన మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీ ప్రాంతాలకు ప్రభుత్వమే గిరిజనేతరుల వలసలను ప్రోత్సహిస్తుంది.

ప్రభుత్వ తప్పుడు నిర్ణయంతో

ఈ వలసలు ఎక్కువయి చివరకు ఐదవ షెడ్యూల్ భూభాగంలోకి దొడ్డిదారిన వలసలు వస్తున్న గిరిజనేతరులైన ఆదివాసీల అభివృద్ధి కోసం 2000 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జీఓ-3 ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో 62 శాతం గిరిజనేతరులు నివాసముంటున్నారని సుప్రీంకోర్టులో కేసు వేస్తే కోర్టు ఆ జీఓ అమలు కాకుండా కోర్టు ఆ జీఓని రద్దు చేసింది. దీంతో గిరిజనేతరులు 1959 చట్టాన్ని సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం 1970 చట్టం తర్వాత గిరిజన ప్రాంతాల్లోకి వచ్చిన గిరిజనేతరుల గుర్తింపు కార్డులు రద్దు చేసి వారిని గిరిజనేతర ప్రాంతాలకు తరలించాలి. అప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతత నెలకొని ఆదివాసీ సమాజం అభివృద్ధి లోకి రావడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఆదివాసీల అభివృద్ధి మాటున అక్రమంగా నివాసాలు ఏర్పరుచుకున్న వారికి భూమి హక్కులు, ఉద్యోగ అవకాశాలు, ఇండ్ల హక్కులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీఓలను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ద్వారా కోర్టులో రద్దు చేపిస్తూ వస్తుంది. అయినా ప్రభుత్వం తీరు మార్చుకోకుండా గిరిజనేతర వలసలను ప్రోత్సహిస్తూనే ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలో హక్కులు మాకు ఉన్నాయని గిరిజనేతరులు చెలరేగిపోయి ఆదివాసులపై, వారి చట్టాలపై దాడులు చేస్తున్నారు. ఆదివాసీ సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఐటీడీఏ అధికారులు, రాజకీయ నాయకులు కర్తవ్యం మర్చిపోవడం వలనే ఆదివాసుల పైన ముప్పేట దాడులు జరుగుతున్నాయి. గిరిజనేతరుల దాడులతో మనుగడ కోల్పోతున్న ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకై భవిష్యత్తులో ప్రభుత్వం ఐదో షెడ్యూల్ నిబంధనలకు లోబడి రూపొందించాలని గిరిజేతరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము.

పూనెం శ్రీనివాస్

ఆదివాసీ సంక్షేమ పరిషత్, రాష్ట్ర అధ్యక్షులు

9000322495

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed