బలిదానాలు వద్దు.. పోరాడి రిజర్వేషన్ సాధించుకుందాం!

by Ravi |   (  Updated:2025-12-09 01:16:25  IST  )

తెలంగాణ ఉద్యమం మన కళ్ల ముందు జ్వాలగా దహనమైంది. ప్రతి నినాదంలో ఆవేదన, ప్రతి అడుగులో ఆత్మగౌరవం ఉప్పొంగింది. ఉద్యమంలో వేలమంది యువత త్యాగాలు, కవులు, కళాకారులు రగిలించిన సాంస్కృతిక ఉప్పెన, ప్రజల అసమాన ఐక్యత అన్నీ కలిసి ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మించాయి.

బలిదానాలు వద్దు.. పోరాడి రిజర్వేషన్ సాధించుకుందాం!
X

తెలంగాణ ఉద్యమం మన కళ్ల ముందు జ్వాలగా దహనమైంది. ప్రతి నినాదంలో ఆవేదన, ప్రతి అడుగులో ఆత్మగౌరవం ఉప్పొంగింది. ఉద్యమంలో వేలమంది యువత త్యాగాలు, కవులు, కళాకారులు రగిలించిన సాంస్కృతిక ఉప్పెన, ప్రజల అసమాన ఐక్యత అన్నీ కలిసి ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మించాయి. అయితే, దశాబ్దం తర్వాత కూడా అదే ప్రశ్న ముందుంది. స్వరాష్ట్రం నిజంగా అణగారిన వర్గాల కలలను నెరవేర్చిందా? లేక పాత అసమానతలకు కొత్త రూపం మాత్రమే వచ్చిందా?

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేవలం నీళ్లు, నిధులు, నియా మకాల డిమాండ్‌గా మొదలై, సబ్బండ వర్ణాల ఆత్మగౌరవ సమరంగా మారింది. ఆ పోరాటానికి తొలి నిప్పురవ్వ శ్రీకాంత చారి బలిదానం.. ఆ దృశ్యాన్ని, ఆ వేదనను మనం మర్చిపోలేం. ఆ త్యాగమే యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది.

పదేళ్ల ప్రశ్నలు..

ఆనాటి ఉద్యమ లక్ష్యం భౌగోళిక సరిహద్దుల మార్పు మాత్రమే కాదు, తరతరాలుగా నిలిచిపోయిన సామాజిక న్యాయాన్ని, పాలనలో సంపూర్ణ భాగస్వామ్యాన్ని సాధించడం. అప్పుడు సాగర‌హారం, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు పాలకుల గుండెల్లో గుబులు రేపాయి. సకల జనుల సమ్మెలో యావత్ తెలంగాణ సమాజం, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, కుల మతాలకు, పంథాలకు అతీతంగా ఏకమైంది. 1400 మందికి పైగా అమరులైయ్యారు. రాష్ట్రమంతా ఒక్కటై పోరాడితే రాష్ట్రం సిద్ధించింది. పదేళ్లు గడిచాయి.. మరి ఆ కల నెరవేరిందా? మన ప్రాణత్యాగాల ఫలితం ఏమైంది? సామాజిక న్యాయం జరిగిందా? ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక న్యాయం వెనక్కి పోయి, పాలనా పగ్గాలు మళ్లీ పాత పెత్తందారీ వర్గాల చేతిలో ఇరుక్కుపోయాయి. అందుకే, యువత తమ సొంత రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దయనీయ దుస్థితి దాపురించిందా? ఈ ప్రశ్న ప్రతి తెలంగాణ బిడ్డను వెంటాడుతోంది.

సాయి ఈశ్వర్.. నేటి కన్నీటి సాక్ష్యం!

శ్రీకాంత చారి బలిదానం తెలంగాణకు తొలి పునాది వేస్తే, బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, సాయి ఈశ్వర్ చారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించు కున్నాడు. బలిదానం తెలంగాణ పాలక వర్గాలు బీసీలకు చేసిన ఘోర అన్యాయానికి, వారి వంచనకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని విమర్శకులు వాదిస్తున్నారు. ఉద్యమం ఏదైనా బలిదానంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. శ్రీకాంత చారి చరిత్రైతే, సాయి ఈశ్వర్ చారి నేటి కన్నీటి సాక్ష్యం. అణగారిన ఆత్మగౌరవాన్ని పాలక వర్గాలు మళ్లీ మళ్లీ కించపరుస్తున్నారని సామజిక వాదులు ఆరో పిస్తున్నారు. తెలంగాణ జనాభాలో బీసీలు 50 నుంచి 60 శాతం వరకు ఉన్నారు. ఇంతటి సంఖ్యా బలం ఉన్న వర్గానికి రాజ్యాధికారంలో తగిన వాటా దక్కడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా వాటా బడ్జెట్‌లో, రాజకీయ నిర్ణయాల్లో, పాలనా నిర్ణయాల్లో, ఆ వాటాలో ప్రతిబింబించడం లేదు.

రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడంతో..

అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం జీవో 9 జారీ చేసినప్పటికీ, హైకోర్టు దానిపై స్టే విధించింది. బీసీలకు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కావడం, బీసీలకు రిజర్వేషన్లు అవసరమని న్యాయస్థానం ముందు నిరూపించడానికి అవసరమైన బలమైన చట్టపరమైన ఆధారాన్ని (డేటా) రూపొందిం చడంలో విఫలమవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పరాజయం తప్పలేదు. ఇది ప్రభుత్వం కోరి తెచ్చుకున్న సమస్య. స్పష్టమైన రాజకీయ చిత్తశుద్ధి లేమి, న్యాయపరమైన వైఫల్యం, రాజకీయ అధికారం తమ చేతిలో లేకపోతే చట్టబద్ధమైన హక్కులు సైతం నిలబడవనే చేదు సత్యాన్ని నిరూపించింది. బీసీలకు 42% కాదు, వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా 60% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఈ రాజకీయ బలహీనత నుండే పుట్టింది.

రాజ్యాధికారమే ఏకైక మార్గం!

అమరుల త్యాగాలు మనకు నిరాశను పంచడానికి కాదు. అవి మనలో పోరాట స్ఫూర్తిని రగిలించడానికి.. శ్రీకాంత చారి, సాయి ఈశ్వర్ చారిల బలిదానాలు ఒకటే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నాయి. రాజ్యాధికారంలో తగిన వాటా లేకపోతే, అన్యాయం ఆగదు. పాలనా పీఠంపై కూర్చోకపోతే, బడ్జెట్ కేటాయింపులపై, విద్య, వైద్య, ఉద్యోగ విధానాలపై మనకు ఎలాంటి నియంత్రణా ఉండదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు జనాభాలో అత్య ధికంగా ఉన్నప్పటికీ, వారి మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల కారణంగానే పాలనాధికారం కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైంది. పాలకుల కుట్రను దహనం చేయాలంటే ఐక్యత అనే అస్త్రంతో పోరాడాలి. అందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ ఏకం అవ్వడం తప్ప మరో మార్గం లేదు. బలిదానాలు వద్దు. రాజకీయ అధికార యుద్ధం చేయాలి. వెనకబడిన వర్గాల వారు కేవలం ఓటర్లుగా మిగిలిపో కూడదు. న్యాయం కోసం దేవులాడే యాచకులుగా ఉండకూ‌డదు. చట్టాలను రాసే శాసన కర్తలుగా మారాలి, రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలి.

ఈ నినాదంతో ముందుకు వెళదాం..

ఉద్యమ వారసత్వాన్ని, వేలమంది అమరుల ఆకాంక్షలను నిజం చేసే శక్తి, సామాజిక న్యాయాన్ని స్థాపించే శక్తి, కేవలం అధికార పీఠానికే ఉంది. నువ్వే పాలకుడివి కావాలి. చట్టాలను నువ్వే రాసుకోవాలి. అధికారం సాధించి‌నప్పుడే, అణగారిన వర్గాలకు న్యాయం వెల్లివిరిసినప్పుడే ఈ పోరాటం ఆగాలి. ఏకమై, లక్ష్యం వైపు ఉరకాలి. సరైన సమయం ఇదే. ‘మన శాసనం మనమే రాసుకుందాం అనే నినాదం’తో ముందుకు సాగాలి. ఓటే ఆయుధం రాజ్యాధికారమే ఏకైక మార్గం, చివరి లక్ష్యం కావాలి.

-డా.కట్కూరి

న్యాయ నిపుణుడు.

[email protected]

Next Story