- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నక్సలిజం.. ఒక సిద్ధాంత యుగానికి ముగింపు
సాయుధ విప్లవం నుంచి ప్రజాస్వామ్య వాస్తవానికి నక్సలిజం ప్రయాణం. ఒక ఉద్యమం ముగింపు ఎప్పుడూ ఒక్కరోజులో రాదు. అది మెల్లగా కూలిపోతుంది.

సాయుధ విప్లవం నుంచి ప్రజాస్వామ్య వాస్తవానికి నక్సలిజం ప్రయాణం. ఒక ఉద్యమం ముగింపు ఎప్పుడూ ఒక్కరోజులో రాదు. అది మెల్లగా కూలిపోతుంది. మొదట సిద్ధాంతం బలహీనపడుతుంది. తర్వాత ప్రజా మద్దతు తగ్గుతుంది. చివరికి నాయకత్వం ఒంటరిగా మిగులుతుంది. ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా భావించబడుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజి తెలంగాణ పోలీసులకు లొంగిపోవడం.. కేవలం ఒక వ్యక్తి లొంగుబాటు కాదు. అది ఒక యుగానికి చారిత్రాత్మక మలుపు. గత కొన్నినెలలుగా కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం, ముఖ్య కార్యదక్షులు దాదాపు 95 శాతం మంది వరుసగా లొంగిపోయారు. ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని ప్రకటించిన గడువు, లొంగుబాటు పిలుపులు, భద్రతా బలగాల కట్టుదిట్టమైన వ్యూహం.. ఈ పరిణామాలకు వేగం తెచ్చాయి. దేవ్ జీ లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి ప్రతీకాత్మక ముగింపు. కేంద్ర కమిటీ స్థాయి నాయకత్వం కూలిపోవడం అంటే సంస్థాగతంగా ఉద్యమం నిలబడే ఆధారం కూలిపోవడమే. వసంత మేఘంలా ఘర్జించిన విప్లవ స్వరం ఇప్పుడు లొంగుబాటు ప్రకటనల మౌనంగా మారింది.
వసంత మేఘ ఘర్జన నుంచి
తెలంగాణ గ్రామాల గుండా ప్రయాణిస్తే హైవేల పక్కన, చిన్నచిన్న రహదారులలో అవతల సుత్తీ–కొడవలి గుర్తు ఉన్న స్థూపాలు కనిపిస్తాయి. అవి ఎవర్నీ పిలవవు. కానీ చాలా ప్రశ్నలు వేస్తాయి. అదే గ్రామాల్లో దళితవాడల్లో వరుసగా అంబేడ్కర్ విగ్రహాలు, వాటి పక్కనే ఇటీవల వెలిసిన శివాజీ, వివేకానందుల విగ్రహాలు… ఇవి విగ్రహాల పోటీ కాదు. ఇవి భారత గ్రామీణ రాజకీయ చైతన్యంలో మారిన దశల సూచికలు. సాయుధ వామపక్షం, అస్తిత్వ–హక్కుల ఉద్యమం, హిందుత్వ రాజకీయాలు ఈ మూడు మధ్య నక్సలిజం ప్రయాణం. ఒక ఉద్యమం కథ మాత్రమే కాదు.. భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న అత్యంత దీర్ఘకాలిక సవాల్ కథ.
ఆకలి, కరవు, కోపం ‘హంగ్రీ సిక్స్‌టీస్’
1960ల భారత్ కేవలం పేద దేశం కాదు. అది అసంతృప్తితో మండుతున్న సమాజం. కరవు, ఆహార కొరత, డీవాల్యూయేషన్, నిరుద్యోగం… చరిత్రకారుడు సుమంత బెనర్జీ చెప్పినట్టు ఇది ‘హంగ్రీ సిక్స్‌టీస్’.. రాడికల్ ఆలోచనలకు అత్యంత అనుకూల కాలం. అంతర్జాతీయంగా చైనా, వియత్నాం, క్యూబా విప్లవాల దశాబ్దం. భారత యువతకు సాయుధ మార్గం అసాధ్యంగా అనిపించలేదు. నిజాం పాలన ముగిసినా..తెలంగాణలో భూస్వామ్య పెత్తనం కొనసాగింది. వెట్టిచాకిరి, దొరల అరాచకాలు, ఉపాధి అవకాశాల లేమి, ఇక్కడ నక్సలిజం ఒక సిద్ధాంతంగా కాక, తక్షణ న్యాయ సాధనగా కనిపించింది. దున్నేవానికి భూమి,బీడీ ఆకు ఉద్యమం, పుల్లరి ఉద్యమం.. రాష్ట్రం చేయని పనులు నక్సలైట్లు చేసి చూపించారు. అందుకే దళితులు, ఆదివాసీలు ఈ ఉద్యమానికి పునాదిగా మారారు.
దండకారణ్యం ప్రత్యామ్నాయ ప్రయోగం
బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఒక ‘జనతన రాజ్యం’ నిర్మించాలనుకున్నారు. వ్యవసాయం, సహకార సంఘాలు పాఠశాలలు, ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ.. అది ఒక సామాజిక ప్రయోగం. కానీ అది అడవులకే పరిమితమైంది. సోవియట్ యూనియన్ పతనం, ప్రపంచీకరణ, ఐటీ విప్లవం, సంక్షేమ పథకాలు.. ఈ మార్పులన్నీ నక్సలిజాన్ని కాలానికి అతీతంగా మార్చేశాయి. ఒకప్పుడు రిక్రూట్‌మెంట్ కేంద్రాలైన హాస్టళ్లు, కళాశాలలు ఇప్పుడు కార్పొరేట్ కలల దారులు. యువత కలలు మారాయి. సాయుధ విప్లవం అసంబద్ధంగా మారింది. 1990లలో దళిత ఉద్యమం నక్సలిజం ఖాళీ చేసిన స్థలాన్ని ఆక్రమించింది. కులాన్ని తగిన రీతిలో అడ్రస్ చేయలేకపోవడం నక్సలైట్ ఉద్యమానికి మౌలిక లోపం. ఈ విషయాన్ని కోబాడ్ గాంధీ వంటి నేతలు స్వయంగా అంగీకరించారు.
లొంగుబాట్లు చివరి మలుపు
ఇప్పుడు నక్సలిజం కేవలం సిద్ధాంతపరంగా కాదు.. సంస్థాగతంగా కూడా కూలిపోతోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా భావించబడుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోవడం ఈ పరిణామానికి గట్టి సంకేతం. దేవ్ జీతో పాటు అనేక మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, పార్టీకి ఆయువుపట్టుగా భావించిన ఉన్నత స్థాయి నాయకులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. దండకారణ్యంలో స్థావరాలు బలహీనపడటం, అర్బన్ నెట్‌వర్క్స్ పూర్తిగా ఛిన్నాభిన్నం కావడం, భద్రతా బలగాల సాంకేతిక ఆధిక్యం, ప్రజల మద్దతు కోల్పోవడం.. ఈ నాలుగు కారణాలు మావోయిస్టు ఉద్యమాన్ని తుది దశకు నెట్టేశాయి. ఇప్పుడు ప్రశ్న “ఎన్ని ఎన్‌కౌంటర్లు” కాదు. “ఎన్ని లొంగుబాట్లు” అన్నదే. డ్రోన్లు, గ్రేహౌండ్స్, డీఆర్‌జీ, అత్యాధునిక నిఘా వ్యవస్థ రాజ్యం వద్ద అపార శక్తి చేరింది. 2000–2025 మధ్య 12,000 మందికి పైగా మరణాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యం ప్రకటించారు.. 2026 మార్చి 31 నాటికి నక్సలిజానికి ముగింపు. ఇప్పుడు ఆ లక్ష్యం అసాధ్యంగా అనిపించడం లేదు.
నక్సలిజం ఓడిందా లేక కాలం గెలిచిందా?
నక్సలిజం భారతదేశాన్ని మార్చలేకపోయింది. అది నిజం. కానీ భారతదేశం ఎలా మారిందో.. నక్సలిజం మనకు చూపించింది. భూస్వామ్య అరాచకాలు, వెట్టిచాకిరి, అటవీ దోపిడీ ఈ అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థను సవరించడానికి నక్సలిజం ఒత్తిడి గ్రూప్‌లా పనిచేసింది. అయితే కులం, ప్రజాస్వామ్యం, మారుతున్న ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో ఆ ఉద్యమం విఫలమైంది. ఇప్పుడు మావోయిస్టు నాయకుల లొంగుబాట్లు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి.. ఇది కేవలం సైనిక ఓటమి కాదు. ఇది ఒక సిద్ధాంత యుగానికి ముగింపు. వసంత మేఘ ఘర్జన ఇప్పుడు అడవుల్లో పీలస్వరమైంది. ఆ పీలస్వరంలో ఒక తరం కలల శబ్దం ఉంది. చరిత్ర దాన్ని తీర్పు చెప్పే రోజు ఇప్పుడే మొదలైంది.
(మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ లొంగుబాటు నేపథ్యంలో)
శ్రీనివాసరెడ్డి కాలగిరి
90101 28884






