- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధునిక వెలుగులు.. ఒంటరి మనసులు...!
వెలుగులతో నిండిన ఈ ఆధునిక ప్రపంచపు 21వ శతాబ్దం మానవ చరిత్రలో విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి అద్భుత స్థాయికి చేరిన యుగంగా గుర్తింపు పొందింది.

వెలుగులతో నిండిన ఈ ఆధునిక ప్రపంచపు 21వ శతాబ్దం మానవ చరిత్రలో విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి అద్భుత స్థాయికి చేరిన యుగంగా గుర్తింపు పొందింది. కానీ మానవ మనస్సు అత్యంత అస్థిరంగా, ఒంటరిగా మారిన కాలంగా కూడా నిలుస్తోంది. భౌతిక సౌకర్యాలు పెరిగిన కొద్దీ మానసిక శాంతి తగ్గిపోవడం ఆందోళనకరంగా మారింది.
బిలియన్ ప్రజలకు మానసిక రుగ్మతలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నివేదికలు అలార్మింగ్ వాస్తవాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌కు పైగా ప్రజలు మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. డిప్రెషన్ , ఆత్మన్యూనత , ఆందోళనల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతి సంవత్సరం వేలకోట్ల నష్టం జరుగుతోంది. లాన్సెట్ జర్నల్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ ప్రకారం, 2010-2021 మధ్య డిప్రెషన్ తో బాధపడుతున్న వారి సంఖ్య 16.4% పెరిగింది. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరంతర లక్ష్యాల ఒత్తిడి, అధిక పని గంటల నిద్రలేమి, లేఆఫ్ ఆందోళనలతో మానసిక రుగ్మతలతో కుంగిపోతున్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణుల మాటల్లో మానసిక ఆరోగ్య సంక్షోభం ఇప్పుడు గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. దీనికి తక్షణ, సమగ్ర విధానం అవసరం. అని ఉద్ఘాటించారు..
పాండమిక్ ప్రభావం
కోవిడ్-19 మహమ్మారి ఈ మౌన సంక్షోభాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. పాండమిక్ మొదటి సంవ త్సరంలోనే డిప్రెషన్ కేసులు 27.6% పెరిగాయి, ఆందోళన రుగ్మతలు 20.6% పెరిగాయి. ఒంటరితనం, భయం, అనిశ్చితి, ఉపాధి నష్టం కోట్లాది మందిని మానసికంగా కుంగదీశాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయిన వారు నెలల తరబడి ఇంట్లోనే ఉండి డిప్రెషన్‌లోకి జారుకున్నారు. భారతదేశంలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది.
బహుముఖ కారణాలు..
వేగవంతమైన జీవనశైలి, నిరంతర పోటీ, ఉద్యోగ భద్రతలేమి, ఆర్థిక అసమానతలు, కుటుంబ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రకృతి వైపరీత్యాలు, ఉపాధి వలసలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.. డిజిటల్ ప్రపంచం మనల్ని ప్రపంచానికి దగ్గర చేసినా మనిషిని మనిషి నుండి దూరం చేసింది. సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతున్న గుర్తింపు ఆరాటాలు, తప్పుడు విజయాలు, ప్రమాణాలు అసంతృప్తిని పెంచుతున్నాయి. క్లైమేట్ చేంజ్ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. విద్యార్థులు పరీక్షల ఒత్తిడిలో బాల్యాన్ని కోల్పోతున్నారు. ఉద్యోగులు లక్ష్యాల భారంతో యంత్రాల్లా జీవి స్తున్నారు. మహిళలు ఇంట, వృత్తిపరంగా బహుముఖ బాధ్యతల మధ్య నలుగుతున్నారు.. వృద్ధులు పిల్లలు విదేశాల్లో స్థిరపడిన తర్వాత ఒంటరితనంతో, నాలుగు గోడల మధ్య మాట్లాడేవారు లేక నిశ్శబ్ద డిప్రెషన్‌లోకి వెళుతున్నారు.
జీవితం అమూల్యం..
మానసిక ఆరోగ్య సంక్షోభం ఒక మౌన మహమ్మారి. దీనిని నిర్లక్ష్యం చేయడం అభివృద్ధిని అర్థహీనంగా మారుస్తుంది. ఆరోగ్యకరమైన మనస్సులు లేకుండా ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం కాదు.. ప్రభుత్వాలు హెల్త్ బడ్జెట్‌లో మానసిక ఆరోగ్య రంగానికి కనీసం 5% కేటాయించాలి. కుటుంబాలు సంభాషణను పునరుద్ధరించుకోవాలి. సహాయం కోరడం తప్పు అనే భావన నుండి ధైర్యంగా ముందుకు రావాలి. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, సంస్థ, ప్రభుత్వం ఈ మార్పులో పాత్ర పోషించాలి. కనిపించే నవ్వుల వెనుక దాగిన ఈ ఒంటరితనం నెమ్మదిగా ఆశలను మసకబారుస్తూ మానవ జీవితంలో అత్యంత మౌనమైన సంక్షోభంగా మారుతోంది. మానసిక ఆరోగ్యానికి,ఆరోగ్యకరమైన మనస్సు ముఖ్యం. జీవితం అమూల్యం.
-గిలకత్తుల వెంకటరమణ గౌడ్
98668 78769






