మరోకోణం:కేసీఆర్ గెలుపు వ్యూహాలు

by D.Markandeya |
మరోకోణం:కేసీఆర్ గెలుపు వ్యూహాలు
X

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్@పీకే టీం సర్వే నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా లేని నియోజకవర్గాలలో నష్టనివారణ చర్యలు చేబడుతున్నారు.40 మంది వరకు సిట్టింగులకు ఈసారి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని తెలంగాణభవన్ వర్గాలు భావిస్తున్నాయి. తరచూ వారాల తరబడి తన ఫాంహౌజ్‌కే పరిమితమవుతున్నకేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహ రచనలు చేయడంలో నిమగ్నమయ్యారని సమాచారం. పలు దఫాలుగా పీకేతో జరిపిన భేటీలలో కొనసాగిన విస్తృత చర్చల అనంతరం ఆయన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారుచేసుకున్నారని అంటున్నారు.

అలా అయితేనే లాభమని

ఈ రోడ్ మ్యాప్‌లో ముఖ్యంగా మూడు అంశాలున్నాయని తెలుస్తోంది. మొదటిది, క్రితంసారిలాగే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం. ఈ నిర్ణయానికి రావడానికి ప్రధాన కారణం అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకూ వెయిట్ చేస్తే, వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా మోడీ సర్కారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, 2024 ఏప్రిల్-మే నెలలలో పార్లమెంటుతో పాటు జమిలి ఎన్నికలు నిర్వహిస్తుందేమోనని అనుమానించడం. అలా జరిగిన పక్షంలో డబుల్ ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసి టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందని భావించడం.

అందుకే, ప్రస్తుత శాసనసభ కాలం 2023 డిసెంబర్‌తో ముగియనున్నందున అంతకంటే తొమ్మిది, పది నెలల ముందే అనగా ఫిబ్రవరి, మార్చిలో ఏదో ఒక మంచిరోజు శాసనసభ రద్దుకు సిఫారసు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అప్పుడు మేలో ఎన్నికలు జరిగే కర్ణాటకతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరపక తప్పని స్థితి ఏర్పడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. షెడ్యూలుకు ముందే ఎన్నికలు నిర్వహించడం వలన కాంగ్రెస్ పుంజుకునేందుకు టైం దొరకదని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా వచ్చే ఎన్నికలు జరిగితే లాభపడేది తామేనని బలంగా నమ్ముతున్నారు.

వ్యతిరేకతను దారి మళ్లించి

రెండవది, అధికార బీజేపీపై, నరేంద్ర మోడీ పాలనపై విరుచుకుపడుతూ వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది టీఆర్ఎస్‌కు పడే ఓటింగ్‌పై ప్రభావం చూపకుండా నివారించడం. కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కమలనాథుల వైపు ఆ వ్యతిరేకతను దారి మళ్లించడం. ఈ దిశగా ఇప్పటికే కేసీఆర్ ఆచరణలోకి దిగిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఆయన ఆలవుట్ వార్ ప్రకటించారు. చేతగాని ప్రభుత్వం, అసమర్థ పాలన అంటూ మోడీని పలు రకాలుగా తూలనాడుతున్నారు.అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడో వెనకబడి వున్నాయని విమర్శిస్తున్నారు.రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన వాటా నిధులను, అప్పులను కేంద్రం అందకుండా చేస్తున్నదని మండిపడుతున్నారు.

బీజేపీకి ఓటేస్తే మత విద్వేషాలు చెలరేగడం తప్ప ఒరిగేదేమీ ఉండదని చెబుతున్నారు. ఇక్కడ అద్భుతంగా అమలవుతున్న స్కీంలకు నిధులు అందకుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శల, ఆరోపణల పర్వాన్ని కేసీఆర్ భవిష్యత్తులో మరింత తీవ్రంగా కొనసాగిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికలు సమీపించిన కొద్దీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక, కాషాయదళ వ్యతిరేక సెంటిమెంటును ఆయన ప్రజలలో మరింత రగిలింపజేస్తారు.

కొత్త ప్రత్యామ్నాయం కోసమంటూ

మూడవది, జాతీయ పార్టీ ఏర్పాటు. డెబ్బై ఐదేళ్ల పాలనలో దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ తదితర జాతీయ పార్టీలు అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాయని, వ్యవస్థ బాగుపడాలంటే ఒక కొత్త ప్రత్యామ్నాయం రావాలని ఆయన చాలా రోజుల క్రితమే ప్రవచించారు. ఏ వనరులూ లేని చిన్న చిన్న దేశాలు సైతం అభివృద్ధిలో ఎక్కడో ఉంటే, అపార వనరులున్న భారత్ బాగా వెనకబడి ఉన్నదన్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి అయినా సరే, దేశాన్ని ప్రగతి పథాన నడిపిస్తానని స్పష్టం చేశారు. అందుకోసం ఏ బలిదానం చేయడానికి అయినా కేసీఆర్ సిద్ధంగా ఉంటాడని చెప్పారు.

దేశమంతా తిరుగుతానని, కలిసివచ్చే శక్తులను సమీకరిస్తానని అన్నారు. ఇందుకోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీ పెట్టే విషయమై కూడా ఆయన తన సన్నిహిత సహచరులతో చర్చిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆప్ అధినేత కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులను ఇప్పటికే కలిశారు. నటుడు ప్రకాశ్‌రాజ్, ఏపీకి చెందిన ఉండవల్లి, తమిళ సినీ హీరో విజయ్ తదితరులు ఆయా రాష్ట్రాల్లో కొత్త పార్టీలో ప్రధానపాత్ర వహిస్తారని అంటున్నారు.

తనకు అనుకూలంగా మార్చుకుని

కేసీఆర్ కొత్త జాతీయపార్టీ పెట్టడం వెనకాల అసలు రహస్యం తెలంగాణలో గెలవడానికేననే అనుమానాలు రాజకీయ వర్గాలలో ఉన్నాయి. దేశాన్ని బంగారు భారత్‌గా చేస్తాననే నినాదంతో ఢిల్లీకి వెళ్తున్నానని, తనను ఆశీర్వదించాలని కేసీఆర్ ప్రజానీకాన్ని ఇంప్రెస్ చేస్తారని వీళ్లు భావిస్తున్నారు. ఇక్కడ ఘన విజయం అందించి తనను ముఖ్యమంత్రిని చేస్తే తాను ఉత్తర భారతానికి ఇనుమడించిన ఉత్సాహంతో వెళతానని ఆయన ఓటర్లకు అప్పీల్ చేయవచ్చు.

ఒక తెలంగాణ బిడ్డ ఢిల్లీని ఏలడానికి వెళ్తున్నారని, ఆయనను గెలిపించడం మన కనీస బాధ్యత అనే విషయం జనాలలోకి వెళితే టీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందనే వాదనను కొట్టిపారేయలేం. ఒకసారి ఒక విషయానికి ఫిక్స్ అయితే కేసీఆర్ ప్రజలను మెస్మరైజ్ చేసి ఎలా తన వైపు తిప్పుకోగలరో మనం గత ఎన్నికలలో చూశాం కూడా. కాంగ్రెస్ గెలుస్తుందన్న పరిస్థితిని 'చంద్రబాబు' అస్త్రాన్ని ప్రయోగించి ఆయన తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు.

చివరగా

కేసీఆర్ అనుసరిస్తున్న ఈ త్రిముఖ వ్యూహం నిజంగానే పని చేస్తుందా? ఆయన జాతీయపార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్ముతారా? తన పాలనపై ఉన్న వ్యతిరేకతను బీజేపీపైకి మళ్లించగలుగుతారా? మోడీ-కేసీఆర్‌ మధ్య వైరం భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుంది? కొత్త అప్పులు పుట్టకుండా గులాబీ బాస్ తన అబ్బురపడే పథకాన్ని ప్రకటించగలరా? అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పుంజుకుంటుందా? తెలంగాణలో గెలుపు కోసం సర్వశక్తులనూ కేంద్రీకరిస్తున్న కమలనాథుల కల నెరవేరుతుందా? వచ్చే ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీల మధ్య హంగ్ తప్పదా? ఇవన్నీఇప్పుడే జవాబు దొరకని ప్రశ్నలు.

డి.మార్కండేయ

[email protected]

Next Story