- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓట్ల లెక్కింపులో తారుమారు.. ప్రజాతీర్పును అవమానిస్తున్న పరకాల లెక్కలు!
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల “అద్భుతం” వెనుక ఏదైన “దుశ్చర్య” ఉందా?’ అనే పేరుతో పరకాల ప్రభాకర్ ది వైర్‌లో రాసిన వ్యాసాన్ని ఇలా ప్రారంభించాడు .. ‘2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ డేటాను నిశితంగా పరిశీలిస్తే

‘2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల “అద్భుతం” వెనుక ఏదైన “దుశ్చర్య” ఉందా?’ అనే పేరుతో పరకాల ప్రభాకర్ ది వైర్‌లో రాసిన వ్యాసాన్ని ఇలా ప్రారంభించాడు .. ‘2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ డేటాను నిశితంగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 గెలుచుకోవడానికి దారితీసిన ‘‘అద్భుతం” వెనుక ఉన్న ‘‘దుశ్చర్య” ఏమిటో వెల్లడవుతుంది.
ఇక్కడ ఇచ్చిన అంకెలన్నింటిని భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన డేటా నుంచి వారి అధికారిక నోటిఫికేషన్లు, పత్రికా ప్రక టనల నుంచి తీసుకోవడం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి 68.04% ఓట్లు పోలైనట్లు 2024 మే 13న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఈఓ మీడియాకు వెల్లడించారు.. ఆ తరువాత ఈసీఐ 2024 మే 13న విడుదల చేసిన పత్రికా ప్రకటన నెం. ECIPN842024 ప్రకారం, అదే రోజు రాత్రి 11.45 గంటలకు ఓటింగ్ శాతం 76.50% ఉంది. భారత ఎన్నికల సంఘం 2024 మే 17వ తేదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన నెం. ECIPN892024 ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని 80.66%కు సవరించారు.. ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఈ సంఖ్యను 81.86%గా పేర్కొనగా, ఈసీఐ గణాంకాల నివేదిక ఈ సంఖ్యను 81.79%గా పేర్కొంది’’.
నిమిషాల వ్యవధిలోఈసీ ప్రకటించగలదా?
‘ఈ సంఖ్యలను నిశితంగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ అద్భుతం వెనుక ఉన్న దుర్మార్గం స్పష్టంగా వెల్లడవుతుంది.. ఈ శాతాన్ని వాస్తవ సంఖ్యలలోకి మారిస్తే.. ఆశ్చర్యకరంగా 17,19,482 ఓట్లు పోలయ్యాయి. ఇలా సాగుతుంది పరకాల ప్రభాకర్ కుట్ర సిద్దాంతం. అయినప్పటికీ పరకాల లేవనెత్తిన విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్ర ప్రదేశ్‌లో 175నియోజకవర్గాలకు కలిపి 46,389 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 265 పోలింగ్ బూతులు ఉంటాయి. ఒక నియోజకవర్గ పోలింగ్‌ను పర్యవేక్షించే రిటర్నింగ్ ఆఫీసర్ 267బూతుల నుంచి సమాచారాన్ని తెప్పించటానికి, అలా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పెర్చెంటేజ్ తియ్యటానికి 1గంటకు మించి పడుతుంది. ఇలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల డేటాను సమీకరించి, క్రోడీకరించటానికి ఆయా జిల్లాల కలెక్టర్లకు మరోగంట పడుతుంది. అలా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్ర స్థాయి పర్సేంటేజీని ప్రకటించటానికి కనీసం మరో 2 గంటలు పడుతుంది. అంటే పరకాల ప్రభాకర్ రాసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన 68.04% మధ్యాహ్నం 2-3గంటల మధ్య కాలంలో జరిగిన పోలింగ్‌కు సంబంధించినదై ఉంటుంది. లేకపోతే సాయంత్రం 5గంటలకు 46,389 పోలింగ్ బూతులకు చెందిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేవలం నిముషాల వ్యవధిలో ఎలా ప్రకటించగలడు?
జగన్‌కి తెలిస్తే కదా?
అసలు 2019లో, 2024లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. 2019లో ఓటు హక్కు వినియోగించుకున్నవాళ్ల సంఖ్య 3,16,80063 (80.39%). ఈ ఓట్లలో వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు 1,56,88,569 (49.95%). ఈ ఓట్లతో గెలిచిన సీట్లు 151. అలాగే టీడీపీకి వచ్చిన ఓట్లు 1,23,04,668 (39.17%).. గెలిచిన సీట్లు 23. జన సేనకు 17,36,811(5.53%) ఓట్లు వచ్చాయి.. ఒకే ఒక సీటు గెలిచింది. బీజేపీకి 2,63,849 (0.84%) ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలవలేదు.. 2024 ఎన్నికలకు వచ్చేసరికి 3,38,38,349 (81.86%) ఓట్లు పోలయ్యా యి.. ఈ సంఖ్య 2019తో పోల్చినప్పుడు కేవలం 1.47% మాత్రమే ఎక్కువ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం వల్ల ఓట్లు, సీట్లు ఇలా వచ్చాయి.. టీడీపీ 1, 53,84,576 (45.60%) ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. జనసేన 23,17,747(6.87%) ఓట్లతో 21 సీట్లను, బీజేపీ 9,53,977 (2.83%) ఓట్లతో 8 సీట్లను గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీల కూటమికి సమిష్టిగా వచ్చిన ఓట్లు 1,86,56,300(55.30%).. అలాగే వైఎస్ఆర్‌సీపీ 1,32,84,134(39.37%) ఓట్లతో 11 సీట్లను గెలుచుకుంది. అంటే టీడీపీ కూటమికి, వైఎస్ఆర్‌సీపీకి మధ్య తేడా 53,72,16 6 ఓట్లు. 2019లో విడివిడిగా పోటీచేసిన కూటమి పార్టీల ఓట్లు కలిపితే 1, 43,06,128 అవుతాయి. వైఎస్‌ఆర్‌సీపీకి వచ్చిన 15,6 8,85,691 ఓట్లతో పోల్చినప్పుడు తేడా 13,82,441 ఓట్లు. రాజకీయాలలో 1+1+1 = 3 అవ్వవని జగన్ రెడ్డికి తెలియదు.
కాకిలెక్కలకు విలువ ఉంటుందా?
పరకాల ప్రభాకర్ రాసింది చూశాక ఆయనకు ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనే విషయంపైన అసలు అవగాహనే లేదనిపిస్తుంది. ఎన్నిక అనగానే ఓటర్ల లిస్టుల కాపీలను సిద్దం చేసుకోవటం, పోలింగ్ ఏజంట్లు గా ఏఏ బూతుల్లో ఎవరెవరు ఉండాలో రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయి.. ఓటర్లను గుర్తిస్తూ పోలింగ్ అయ్యేదాకా వుండి ఫామ్ 17సి కాపీని తీసుకోవటం ఏ పోలింగ్ ఏజంటూ మరువడు. ఫాం-17సీలో 7 విషయాలు ఉంటాయి.. ముఖ్యంగా సదరు పోలింగ్ బూత్‌లో మొత్తం ఓటర్లు ఎందరు ఏ ఏ గంటల్లో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? సదరు బూత్‌లో వినియోగించిన ఈవీఎం కు, వీవీపాట్‌లకు సంబంధించిన వివరాలు ఉంటాయి.. ఎందరు వినియోగించుకోలేదనే విషయాలు కూడా ఉంటాయి. కౌంటింగ్‌కి వెళ్లే ఏజెంట్లు ఫాం -17సి లోని సమాచారం ఈవీఎంలలోని ఓట్లతో సింక్ అవుతుందో, లేదో చూస్తారు.. 2024 ఎన్నికల్లో అటువంటి తేడాలు ఉన్నట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. అందుకే ఓట్ల లెక్కింపుకు ముందుగానీ, ఆ తరువాత గానీ పోలైన ఓట్ల గురించి ఎవ్వరూ సందేహాన్ని వ్యక్తపరచలేదు.. కాబట్టి పరకాల ప్రభాకర్ చెబుతున్న కాకి లెక్కలకు ఏమాత్రం విలువ లేదు..
- నెల్లూరు నరసింహారావు
88863 96999






