ప్రజా సమస్యలు పట్టని చట్టసభలు

by Viswanth |
ప్రజా సమస్యలు పట్టని చట్టసభలు
X

ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి చర్చించి ప్రభుత్వం నుంచి పరిష్కారం కనుగొనాలనే ఆసక్తి ప్రజా ప్రతినిధులకు తగ్గిపోయింది. ప్రోటోకాల్, గన్‌మెన్, వాహనాలకు సైరన్.. ఇలాంటి విషయాల్లో ముందుండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మొక్కుబడి ప్రశ్నలతో సరిపెట్టుకుంటున్నారు. స్వల్పకాలిక చర్చ, స్పెషల్ డిబేట్.. ఇలాంటివేవీ మచ్చుకైనా లేవు. అసెంబ్లీ సమావేశాలను కాంట్రాక్టులు, కమిషన్‌లు, పైరవీలు, వ్యక్తిగత ప్రయోజనాలు.. వీటికే వాడుకుంటున్నారు. చట్టసభలు భజన మందిరాలుగా మారడమే కాక ప్రతిపక్షాల గొంతు నొక్కేవిగా మారిపోయాయి. చట్టసభల్లో తమ ప్రస్తావన చర్చకు వస్తుందన్న ఆశలేవీ ప్రజలకు లేవు. ప్రజా ప్రతినిధులు ఆ తీరులో వ్యవహరిస్తారన్న నమ్మకమూ లేదు. అందుకే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అక్కడ ఆందోళనలు చేయడం తప్ప మరో మార్గం లేదనే భావనకు ప్రజలు వచ్చేశారు.

దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. అంటూ మహాకవి శ్రీశ్రీ ఆనాడే చెప్పారు. ఇప్పుడు పార్లమెంటు, శాసనసభలను చూస్తే అదే గుర్తుకొస్తున్నది. ప్రభుత్వాలపై విపక్షాల తిట్లు, విమర్శలు, నినాదాలు వినిపిస్తున్నాయి. ఆహా.. ఓహో అంటూ ప్రభుత్వంపై అధికార పార్టీ ప్రశంసలు, పొగడ్తలు కనిపిస్తున్నాయి. అక్కడ ఆత్మనిర్భర్ భారత్.. ఇక్కడ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రాగాలు వినిపిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మహత్యలు, రూపాయి విలువ పతనం.. ఇవేవీ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి పట్టవు. సభలో అర్థవంతమైన చర్చలూ లేవు.

ఇటీవలి కాలంలో చట్టసభలు భజన మందిరాలుగా మారిపోయాయి. ప్రజలకు సంబంధించిన సమస్యలను చర్చించడాన్ని గాలికొదిలేశాయి. పార్లమెంటుదీ అదే దారి. రాష్ట్రస్థాయిలో అసెంబ్లీ, కౌన్సిల్ తీరూ అంతే. అక్కడ ప్రధానిని పొగిడితే ఇక్కడ ముఖ్యమంత్రిని కీర్తిస్తున్నారు. ప్రశ్నించడాన్ని ప్రతిపక్షాలు మర్చిపోయాయి. వివరణ ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటున్నది. ప్రజాస్వామ్యం అంటూ గొప్పగా లెక్చర్లు ఇచ్చే రాజకీయ పార్టీలు బాధ్యత నుంచి తప్పుకున్నాయి. ప్రజలు, వారి సమస్యలు, కనుగొనే పరిష్కారం ప్రాధాన్యత లేనివిగా మారిపోయాయి. కేంద్రాన్ని తిట్టడం రాష్ట్రానికి అలవాటుగా మారిపోయింది. అధికార పార్టీని విమర్శించడమే ప్రతిపక్షాల పని అన్నట్లు తయారైంది.

అధికారం కర్రపెత్తనంగా మారిపోయింది. ఏడాదికి కనీసం నెల రోజులపాటైనా సమావేశాలు జరగడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి టర్ములో కేవలం 126 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. సగటున ఏడాదికి 25 రోజులు. రెండో టర్ములో అది 69 రోజులకు తగ్గిపోయింది. ఇందులో కొన్ని సంతాప తీర్మానాలు, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్.. లాంటివాటికే పరిమితమవుతున్నాయి. ఇక జూలై-ఆగస్టు మాసాల్లో మరో వారం జరిగే అవకాశమున్నది. గత నాలుగేళ్ల ప్రాక్టీసు చూస్తే అంతకంటే ఎక్కువ రోజులు జరుగుతుందని ఆశించలేం. ఎలాగూ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇంకొక్క సెషన్‌‌కే అవకాశమున్నది.

బాధ్యత మరచిన ప్రజా ప్రతినిధులు

ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి చర్చించి ప్రభుత్వం నుంచి పరిష్కారం కనుగొనాలనే ఆసక్తి ప్రజా ప్రతినిధులకు తగ్గిపోయింది. ప్రోటోకాల్, గన్‌మెన్, వాహనాలకు సైరన్.. ఇలాంటి విషయాల్లో ముందుండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మొక్కుబడి ప్రశ్నలతో సరిపెట్టుకుంటున్నారు. స్వల్పకాలిక చర్చ, స్పెషల్ డిబేట్.. ఇలాంటివేవీ మచ్చుకైనా లేవు. అసెంబ్లీ సమావేశాలను కాంట్రాక్టులు, కమిషన్‌లు, పైరవీలు, వ్యక్తిగత ప్రయోజనాలు.. వీటికే వాడుకుంటున్నారు.

ఏటేటా చట్టసభల పనిదినాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలనగానే ఎక్కడ లేని హడావిడి కనిపించేది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోం వర్క్ చేసి నియోజకవర్గాల సమస్యలను చర్చించడానికి లిస్టును తయారుచేసుకునేవారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేవారు. నిర్దిష్టంగా గణాంకాలను, ఉదాహరణలను ప్రస్తావించి నిలదీసేవారు. ప్రభుత్వం నుంచి సమాధానాన్ని, నిర్ణయాన్ని రాబట్టేవారు. ఇప్పుడు విపక్షాలు విమర్శించడానికి, అధికార పార్టీ సభ్యులు కీర్తించడానికి పరిమితమయ్యారు. పార్లమెంటులో మోడీ.. మోడీ.. అంటూ నినదిస్తున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని దేవుడు అని పొగిడేస్తున్నారు.

పొగడ్తలు.. విమర్శలు.. నినాదాలు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా లేదు. మేధావుల, నిపుణుల, బుద్ధిజీవుల సలహాలను తీసుకుని పాలనను ప్రజారంజకంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నాయి. ఆచరణలో ప్రభుత్వాలూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నాయి. అదానీ విషయం మినహా మరేమీ లేదన్నట్లుగా ప్రతిపక్షాలు దాన్ని పట్టుకుని వేలాడాయి. చివరకు సాధించింది కూడా ఏమీ లేదు. విలువైన సమయాన్ని వృథా చేశాయి. ప్రజల ఇబ్బందులను, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీయడాన్ని పక్కకు పెట్టాయి.

నిజానికి చట్టసభలు అర్థవంతంగా జరగాలంటూ పార్టీల నేతలు లెక్చర్లు ఇస్తుంటారు. ప్రతి ఏటా అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ స్పీకర్లు, చైర్మన్లు సమావేశమై వీలైనంత ఎక్కువ రోజులు సమావేశాలు జరగాలని, చర్చలు ఫలితాలు ఇచ్చే దిశగా ఉండాలని నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రాజ్యాంగ సమీక్షా సంఘం సమావేశమై చట్టసభలు సంవత్సరానికి 50 రోజులు, పార్లమెంటు ఉభయ సభలు 100 రోజుల పాటు కనీస స్థాయిలో పనిచేయాలని సూచించింది. వాటిని కేంద్రం, రాష్ట్రాలు తుంగలో తొక్కాయి. శాసన వ్యవస్థ ద్వారా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వాలు మర్చిపోయాయి.

చివరకు బడ్జెట్ సమావేశాలు కూడా వారం రోజులకు తగ్గిపోయాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి టర్ములో 2015లో 14 రోజులు, 2015లో 17 రోజులు, 2017లో 13 రోజులు, 2018 లో 13 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు రెండో టర్ములో సగానికి తగ్గిపోయింది. 2019లో ఓటాన్ అకౌంట్ పేరుతో 3 రోజులకు, 2020లో 8 రోజులకు, 2021లో 9 రోజులకు, 2022 లో 7 రోజులకు, ఇప్పుడు (2023లో) 7 రోజులకు పడిపోయింది. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు, చేసిన కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు తదితరాలపై లోతుగా చర్చించి ప్రభుత్వం నుంచి జవాబు రాబట్టడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. ప్రభుత్వమూ నిర్లక్ష్యంగానే వ్యవహరించింది.

ప్రయోజనం లేని సమావేశాలు

ఒకప్పుడు చట్టసభలో మాట ఇస్తే దాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండేది పాలకులకు. అంతటి గౌరవం కనిపించేది. ఇప్పుడు అదే వేదికగా ఆ హామీలను తుంగలో తొక్కేయడం సాధారణమైంది. ఇచ్చిన హామీ నుంచి తప్పుకుంటే నిలదీసే సంప్రదాయమూ లేదు. ప్రజలు వారి బాధలను చెప్పుకోడానికి ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండరు. ప్రభుత్వం ద్వారా స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలన్న బాధ్యత ప్రజా ప్రతినిధులకు లేదు. నోటుకు ఓటు వేసే కల్చర్ డెవలప్ అయింది. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య బంధం ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలప్పుడే. వ్యవసాయానికి కరెంటు రాకున్నా, ఆసరా పింఛన్లు అందకున్నా, హాస్టళ్ళలో తిండి నాసిరకంగా ఉన్నా, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా.. ఇవేవీ అటు ప్రజాప్రతినిధులకు, ఇటు ప్రభుత్వానికి పట్టడం లేదు.

దయతలచి ఇస్తే తీసుకోవడమే తప్ప డిమాండ్ చేస్తే కుదరదు అనేది తెలంగాణలో స్థిరపడింది. ప్రశ్నించడాన్ని ప్రతిపక్షాలు మర్చిపోయాయి. ఒకవేళ ప్రశ్నించినా అది పసలేనిది.. పనికిమాలింది.. అంటూ కొట్టిపారేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అధికార, ప్రతిపక్షాలు సమిష్టిగా, బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యానికి సార్ధకత ఉంటుందనేది మాటలకే పరిమితమైంది. ప్రతిపక్షమే ఉండొద్దనేది అధికార పార్టీ విధానంగా మారిపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంపై ప్రతిపక్షాలకు విధానమే లేకుండా పోయింది. రెండు పార్టీల బలప్రదర్శనలకు, వాగ్ధాటికి చట్టసభల సమావేశాలు వేదికగా మారాయి.

ఆత్మ స్తుతి.. పర నింద..

ప్రభుత్వాన్ని ప్రశంసలు, పొగడ్తల్లో ముంచెత్తడం అధికార పార్టీకి ఆనవాయితీగా మారింది. అందుకే పార్లమెంటులో మోడీని విశ్వగురువుగా బీజేపీ సభ్యులు పొగుడుతున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవుడితో పోలుస్తున్నారు. దీవెనలు.. కిట్‌ లాంటి పథకాలకు వారి పేర్లు పెట్టుకుని సంతృప్తి చెందడం మొదలైంది. ఒక దశలో ఇది పార్టీలకు బదులుగా ప్రభుత్వాల స్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకూ పనికిరాదు.. విధాన నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధత.. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళే విజన్ లేదు.. ఇలాంటి విమర్శలతో కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ తూర్పారబట్టారు. బడ్జెట్ సమావేశాలను పొలిటికల్ మీటింగ్‌లాగా మార్చేశారు.

ఏం చేసినా అది కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమని తెలంగాణ అధికార పార్టీ సభ్యులు ఆయనను ఆకాశానికెత్తారు. నెహ్రూ పాలన, ఆయన పాలసీలే దేశానికి శ్రీరామరక్ష అని కాంగ్రెస్ తన పాత చరిత్రను ప్రస్తావించి సంతృప్తిపడింది. చట్టసభలు భజనమందిరాలుగా మారడమేకాక ప్రతిపక్షాల గొంతు నొక్కేవిగా మారిపోయాయి. ప్రభుత్వం తాను అనుకున్న బిల్లులను సంఖ్యాబలంతో ఆమోదింపజేసుకోవడం, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే తీరులో వ్యవహరించడం రొటీన్ ప్రాక్టీసుగా తయారైంది. చట్టసభల్లో తమ ప్రస్తావన చర్చకు వస్తుందన్న ఆశలేవీ ప్రజలకు లేవు. ప్రజా ప్రతినిధులు ఆ తీరుల వ్యవహరిస్తారన్న నమ్మకమూ లేదు. అందుకే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అక్కడ ఆందోళనలు చేయడం తప్ప మరో మార్గం లేదనే భావనకు వచ్చేశారు.

- ఎన్. విశ్వనాథ్

99714 82403

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story