కథా సంవేదన: మరణ వాంగ్మూలం

by Disha edit |
కథా సంవేదన: మరణ వాంగ్మూలం
X

ప్రమోషన్ మీద వరంగల్‌కి బదిలీ అయింది. ఇప్పటివరకు విచారణ జరిపింది ఒక్క హత్యకేసుని మాత్రమే. క్రిమినల్ కేసుల్లో దాదాపు అన్ని నేరాలను విచారించాను. ఇప్పుడు హత్యకేసులని కూడా విచారించే అవకాశం ఉంది. మనుషులు హత్యలు ఎందుకు చేస్తారు..? ఆ విషయానికి వస్తే నేరాలు ఎందుకు చేస్తారు..? అనే ఆలోచనలు నన్ను చుట్టుముట్టినవి.

ఈ ఆలోచనల్లో వున్నప్పుడు నా మొబైల్ ఫోను మ్రోగింది. ఏదో కొత్త నెంబరు.‘లా’ సంబంధమైన పుస్తకాలు రాయడం వలన నా పేరు చాలా మందికి తెలుసు. అదే విధంగా నా టెలిఫోన్ నెంబర్ కూడా.

‘హలో’ అన్నాను. సార్! ఇది రాజేందర్ గారి నంబరేనా..? అవతలి గొంతు. 'అవును' అన్నాను. 'ఒక్క మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టులు శిక్ష విధించే అవకాశం ఉందా? మీ పుస్తకంలో ఆ విషయం గురించి వివరంగా రాశారు. అయినా తెలుసుకుందామని అడిగాను' అన్నాడు ఆ వ్యక్తి.

మరణ వాంగ్మూలం పుస్తకంలో ఆ విషయం గురించి వివరంగా రాశాను. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులని కూడా ఆ పుస్తకంలో వివరించాను. అయినా సరే! 'మీరేం చేస్తుంటారు’ అడిగాను. 'ఏం లేదు సార్. లా పుస్తకాలు చదువుతూ వుంటాను. సందేహ నివృత్తి కోసం అడిగాను' అన్నాడు. ఏం పేరు ఎక్కడ నుంచి అని అడిగేంతలోపే అతను ‘మంచిది సార్’ అని ఫోన్ పెట్టేశాడు. ఇలా ఫోన్లు చేసి ఏవో సందేహాలు అడగడం మామూలే. ఆ విషయం మర్చిపోయాను. ఆ ఫోన్ నెంబర్ ని ‘dying declaration’ Q అని ఫీడ్ చేశాను.

ఓ వారం రోజుల తరువాత వరంగల్‌లో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా జాయిన్ అయ్యాను. రకరకాల కేసులు. హత్యకేసులు వరకట్నం చావు కేసులు ఇలా ఎన్నో సివిల్ కేసులు, అప్పీల్లు, రోడ్డు ప్రమాద నష్టపరిహార కేసులు. కేసుల విచారణల్లో, తీర్పులు ప్రకటించడంలో తలమునకలై వున్నాను. ఓ నెల రోజుల తర్వాత ఓ కేసు వాదనకు వచ్చింది. అందులో రెండు నేరాలు ఉన్నాయి. ఒకటి హత్య చేశాడన్న ఆరోపణ. రెండవది వరకట్నం చావు అన్న ఆరోపణ. అంటే 302, 304 బి ఐపీసీ నేరాలు.

ఉదయాన్నే ఫైల్ తీసి చదివాను. వాళ్ళిద్దరి వివాహం అయ్యి ఏడు సంవత్సరాలు కూడా అవలేదు. ఆమె కాలిన గాయాలతో అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఆమె చనిపోవడానికి ముందు కట్నంకోసం వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షుల్ని పరిశీలించాను. మరణం గురించి వివాదం లేదు. ఏడు సంవత్సరాల లోపు ఆమె మరణించింది, అదీ అనుమానాస్పద స్థితిలో మరణించిందన్న విషయంలో కూడా వివాదం లేదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె భర్త ఇంట్లో లేడు. ఆమె కేకలు విని పక్కింటి వాళ్ళు ఆమెను హాస్పిటల్ తరలించారు. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఆమె మరణ వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నమోదు చేశారు. వరకట్నం గురించి అతను వేధించే వాడని, అతను డిమాండ్ చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులు ఇచ్చే స్థితిలో లేరని చెప్పింది. ఇలా తరుచూ వేధిస్తే కాల్చుకొని చనిపోతానని తాను బెదిరించానని కూడా ఆమె చెప్పింది. దాంతో అతనికి కోపం వచ్చి గ్యాస్ నూనె తనమీద పోసి అంటించాడని కూడా స్పష్టంగా చెప్పింది. చట్టం నిర్దేశించిన పద్దతిలో మేజిస్ట్రేట్ మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశాడు.

ఇతర సాక్ష్యాలు బలంగా లేవు. ఆమె తల్లిదండ్రులు కోర్టులో ప్రతికూల సాక్ష్యం చెప్పారు. ముద్దాయి వాళ్ళని ప్రలోభపెట్టాడని ప్రాసిక్యూషన్ ఆరోపణ. నేరం అతను చేశాడన్న సాక్ష్యం లేదు. ఆ నేరం జరిగినప్పుడు చూసిన వాళ్ళు లేరు. కేసు మొత్తం ఆమె మరణ వాంగ్మూలం మీద ఆధారపడి వుంది. ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించాడు. మరణ వాంగ్మూలం ఆధారంగా ముద్దాయికి శిక్ష విధించాలని చెప్పాడు. కేసులో బలమైన సాక్ష్యం లేవని, మరణ వాంగ్మూలాన్ని విశ్వసించడానికి వీల్లేదని, అది మేజీస్ట్రేట్ నమోదు చేసే సమయానికి ఆమె తల్లిదండ్రులు హాస్పటల్‌కి వచ్చారని వాళ్ళు కోపంతో వరకట్నం విషయం ఆమెతో చెప్పించారని అందుకని అతన్ని కేసు నుంచి విడుదల చేయాలని వాదనలు చేశాడు. వాదనలు విన్న తరువాత ముద్దాయి వైపు చూశాను. అతను ఎలాంటి భావం లేకుండా నిర్వికారంగా నిల్చొని ఉన్నాడు. రెండు రోజుల తరువాత తీర్పు ప్రకటిస్తానని ఉత్తర్వులు రాశాను.

మర్నాడు కేసు చదివి తీర్పుని స్టెనోకి డిక్టేట్ చేశాను. మృతురాలి తల్లిదండ్రులు ప్రాసిక్యూషన్ కేసుని బలపరచలేదు. ఇంటి చుట్టు పక్కల వాళ్ళు కూడా వరకట్నం గురించి ఏమీ చెప్పలేదు. అరుపులు విని తాము బాధితురాలిని హాస్పటల్‌కి తీసుకొని వెళ్ళమని మాత్రమే చెప్పారు. అప్పుడు ముద్దాయి ఇంట్లో లేడని కూడా చెప్పారు. మరణ వాంగ్మూలం మినహా కేసులో మరే ఇతర సాక్ష్యాలు లేవు. కానీ మరణ వాంగ్మూలంలో అన్ని విషయాలను ఆమె స్పష్టంగా చెప్పింది. దాన్ని సరిగ్గానే నమోదు చేశాడు మేజిస్ట్రేట్. ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్‌కి వచ్చిన తరువాతనే మరణ వాంగ్మూలం నమోదు అయింది. కానీ అది నమోదు చేసేటప్పుడు వాళ్ళు ఎవరూ అక్కడ లేరు. ఒక్క డ్యూటీ డాక్టర్ తప్ప మరెవరూ లేరు.

మూడు గంటల ప్రాంతంలో తీర్పు కాపీని రెడీ చేసి తీసుకొని వచ్చాడు స్టెనో. సరిచూసుకున్నాను. తీర్పుని ప్రకటించాను. ముద్దాయి నేరం చేశాడని రుజువైందని చెప్పాను. శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని అడిగాను. ఏమీ లేదు సార్ అన్నాడు అతను. కచ్చితంగా తనకి శిక్ష పడుతుందని అతనికి అర్థమైనట్టుగా ఉంది అతని ప్రవర్తన. అతని న్యాయవాది శిక్ష గురించి ఏదో చెప్పాడు. అతని వాదనలు విని ముద్దాయికి శిక్షను ఖరారు చేశాను.

పోలీసులు అతన్ని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొని వెళ్ళారు. నేను బెంచి దిగి చాంబర్‌లోకి వచ్చాను. ముద్దాయి ప్రవర్తన ఎందుకో కొత్తగా అన్పించింది. శిక్ష పడుతుందని అతనికి ఖచ్చితంగా తెలిసినట్టుగా వుంది అతని ధోరణి. బెంచి దిగాను. కానీ అతని గురించిన ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఎందుకో నాకు ఫోన్ కాల్ విషయం గుర్తుకొచ్చింది. ఫైల్ తెప్పించుకొని చూశాను. ముద్దాయి పేరు క్రింద అతని మొబైల్ నెంబర్ కూడా వుంది. నా దగ్గర వున్న dying declaration ‘Q’ అని ఫీడ్ అయిన నెంబర్‌తో సరిచూశాను. ముద్దాయి నెంబరే అది. అతని ప్రవర్తన అలా ఎందుకు వుందో నాకు అర్థమైంది.

మంగారి రాజేందర్ జింబో

94404 83001


Next Story