Karuppu: అన్యాయంపై దైవం చేసే న్యాయ పోరాటం

by Ravi |   (  Updated:2026-07-04 00:45:39  IST  )

సూర్య ప్రధాన పాత్రలో ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో వచ్చిన 'కరుపు' (వీరభద్రుడు) సినిమా ఎలా ఉంది? కథ, నటీనటుల ప్రదర్శన, సాంకేతిక అంశాలు, ప్లస్-మైనస్ పాయింట్లు, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనే అంశాలపై రివ్యూ.

Karuppu: అన్యాయంపై దైవం చేసే న్యాయ పోరాటం
X

సామాజిక అంశాలకు ఫాంటసీ టచ్ జోడించి, వినోదంతో పాటు బలమైన సందేశాన్ని అందించే ప్రయత్నంలో తెరకెక్కిన చిత్రం 'కరుపు' ('వీరభద్రుడు'). ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం, వ్యవస్థలోని అన్యాయం, అవినీతి, సామాన్యుడికి న్యాయం దక్కని పరిస్థితులను పురాణ నేపథ్యంతో ముడిపెట్టి ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేసింది.

వ్యవస్థలోని అవినీతిని అంతం చేయడానికి..

మన ప్రస్తుత సమాజంలో నెలకొన్న వ్యవస్థాగత లోపాలను, సామాన్యుల పట్ల పాలనా యంత్రాంగం చూపే నిర్లక్ష్యాన్ని చాలా తీవ్రంగా ప్రశ్నిస్తుంది. తన కూతురి లివర్ ఆపరేషన్ కోసం తెచ్చిన నగలను దొంగలు కొట్టేయడంతో ఓ నిస్సహాయ తండ్రి పోలీసులను, కోర్టును ఆశ్రయిస్తాడు. అయితే న్యాయ వ్యవస్థలోని లోపాలు, లాయర్ల స్వార్థం వల్ల అతనికి న్యాయం జరగదు. ఈ క్రమంలో దేవుడైన 'కరుప్పు స్వామి' (సూర్య) భూమిపైకి వచ్చి ఆ తండ్రీ కూతుళ్లకు ఎలా న్యాయం చేశాడు అనేదే కథాంశం. చిన్నారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ కుటుంబం పడే వేదన, ఆ తర్వాత వ్యవస్థలోని అవినీతిపరులు వారిని ఎలా వంచించారనేది చాలా సహజంగా, హృదయ విదారకంగా చిత్రీకరించారు. న్యాయ వ్యవస్థలో సామాన్యుడికి దక్కాల్సిన న్యాయం అందక, దిక్కుతోచని స్థితిలో ఒక తండ్రి దైవాన్ని వేడుకోవడం సినిమాలోని ఎమోషనల్ కోర్. ఆ వేదనకు సమాధానంగా ‘కరుపు’ అనే రక్షక దైవం అడ్వకేట్ శర వ ణన్ రూపంలో భూమిపైకి అవతరించడం, అనంతరం వ్యవస్థలోని అవినీతిని ఆ దైవం తనదైన రీతిలో ఎలా అంతం చేసిందనేది కథా గమనం.

ప్రేక్షకుడు కథలో లీనమయ్యేందుకు..

సూర్య ఒక సామాన్య న్యాయవాదిగా కనిపిస్తూనే, ఆ పాత్రలో అంతర్లీనంగా ఉన్న దైవిక శక్తిని తన కళ్ళలో పలికిం‌చడంలో ఆయన మరోసారి అద్భుతం చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, కోర్టు గదిలో చెప్పే సంభాషణలు ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. దర్శకుడు ఆర్.జె. బాలాజీ విలన్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు. కథానాయికగా త్రిష తన పరిధి మేరకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, జి.కె. విష్ణు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు గొప్ప దృశ్య అందాన్ని తెచ్చి పెట్టింది. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రంలోని కీలకమైన ఎమోషనల్ సన్నివే శాలకు, యాక్షన్ ఘట్టాలకు ప్రాణం పోశాయి. ఈ చిత్రంలో ఎమోషనల్ కనెక్టివిటీకి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవ్వడం వల్ల ప్రేక్షకుడు కథలో పూర్తిగా లీనమైపోతాడు.

తమిళ నేటివిటీ ఎక్కువ ఉండటంతో..

దర్శకుడు ఎంచుకున్న కథ చాలా బలమైనది. అయితే, సినిమా ద్వితీయార్థంలో కథనం కొంత నెమ్మదించడం, పతాక సన్నివేశాలు మరీ ఊహకందని విధంగా సాగడం చిత్రానికి చిన్న మైనస్ అనిపించవచ్చు. ఈ సన్నివేశాల్లో ఎమోషన్ మరింత ఉంటే బాగుండేది. అయినప్పటికీ, సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను పట్టుదలతో నడిపిస్తాయి. సమాజం లోని లోపాలను ఎత్తిచూపుతూనే, న్యాయం ఎప్పుడూ అంతం కాదనే సందేశాన్ని ఈ చిత్రం బలంగా వినిపించింది. సూర్య అభిమానులకే కాకుండా, బలమైన సామాజిక అంశాలున్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే, 'గోపాల గోపాల' తరహా పాత కథ కావడం, రొటీన్ స్క్రీన్‌ప్లే, బలహీనమైన విలనిజం సినిమాకు మైనస్ పాయింట్స్. ముఖ్యంగా తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండటం, పేలవమైన తెలుగు డబ్బింగ్ వల్ల మన ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వదు. లాజిక్స్ పక్కన పెట్టి కేవలం సూర్య కోసం ఒకసారి చూడొచ్చు.

-డా. కట్కూరి

[email protected]

Next Story