అక్షరాన్ని ఆయుధంగా మార్చిన ప్రజాకవికి.. ఈ గౌరవం సరిపోతుందా?

by Ravi |   (  Updated:2025-11-18 01:15:22  IST  )

తెలంగాణ నేలపై ఏ విద్యాలయంలోనూ చదువుకోకుండానే అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్న మహాకవి అందెశ్రీ. ఈయన మరణం కేవలం ఒక ప్రజాకవి అస్తమయం కాదు. మన మాతృభూమి ఆత్మను

అక్షరాన్ని ఆయుధంగా మార్చిన ప్రజాకవికి.. ఈ గౌరవం సరిపోతుందా?
X

తెలంగాణ నేలపై ఏ విద్యాలయంలోనూ చదువుకోకుండానే అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్న మహాకవి అందెశ్రీ. ఈయన మరణం కేవలం ఒక ప్రజాకవి అస్తమయం కాదు. మన మాతృభూమి ఆత్మను, పల్లె జనాల కన్నీటిని, పోరాట స్ఫూర్తిని తన కవిత్వంతో మేలుకొలిపిన ప్రజాకవికి, కేవలం ‘రాష్ట్ర గీత రచయిత’ అనే ఒక్క బిరుదు సరిపోతుందా? ఈ ప్రశ్న ప్రతి తెలంగాణ గుండెను, సాహిత్య అభిమాని హృదయాన్ని తొలిచివేయాలి. ఆయన అందించిన స్ఫూర్తి ముందు మనం అందించిన గౌరవం ఇంకా చాలా తక్కువ అని గుర్తించాల్సిన చారిత్రక సందర్భం ఇది.

అందెశ్రీ జీవితం ఒక కవిత్వ పాఠశాల. ఎల్లయ్యగా పుట్టిన ఆయనకు, జీవితంలోని ప్రతీ కష్టం ఒక అక్షరమై, ప్రతీ నిట్టూర్పు ఒక పదమై, ప్రతీ పోరాటం ఒక గేయమై పలికింది. ఆయన కవిత్వానికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తెలంగాణ మట్టి నుండి వచ్చింది. ఏ అకాడమీ పురస్కారం ఇవ్వలేని గౌరవం అది. అందుకే ఆయన కేవలం ‘కవి’ కాదు, ‘మట్టి కవి, ప్రకృతి కవి, ప్రజాకవి’.

నిరక్షరాస్యుడు సాధించిన అక్షర విజయం!

చదువు లేని ఒక వ్యక్తి, రాష్ట్రానికే గీతాన్ని అందించడం చరిత్రలో అరుదైన అద్భుతం. ఇది సాధారణమైన విజయమా? కాదు! ఇది నిరక్షరాస్యుడు సాధించిన అక్షర విజయం. ఆయన కలం నుండి జాలువారిన ‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’ అనే పాట కేవలం ఒక గీతం కాదు. అది క్షీణిస్తున్న మానవ సంబంధాలపై, కరిగి పోతున్న మానవత్వంపై వేసిన ఒక శాశ్వత విలాప గీతం. ఈ పాట తాత్వికత, సామాజిక స్పృహ అద్భుతం. అదే విధంగా, ‘జయ జయహే తెలంగాణ’ అనే మహా గీతం, కోట్లాది మంది నిద్రాణమైన తెలంగాణ గుండెల్లో పోరాట జ్వాలను రాజేసింది. ఈ పాట రాష్ట్ర ఏర్పాటుకు ఉత్ప్రేరకంగా పనిచేసిన ఒక చైతన్య మంత్రం. ఆ గీతంలోని ప్రతీ పదం ఒక పిలుపు, ప్రతీ భావం ఒక ఉద్యమం. తెలంగాణ ఉద్యమ చరిత్రను అందెశ్రీ కవిత్వం లేకుండా రాయడం అసాధ్యం. అప్పటి సభలు, సమావేశాలు, విద్యార్థి పోరాటాలు అన్నీ ప్రజా కవిత్వంతో సాంస్కృతిక ఉద్యమంగా పాటతోనే ఊపిరి పోసుకున్నాయి. ఆయన పాటలన్నీ ప్రజల భాషలో, ప్రజల పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించాయి.

జాతీయ స్థాయి గౌరవం కల్పించలేమా?

అయితే, ఆయన బతికి ఉన్న కాలంలో, ఆయన కవిత్వానికి, దక్కాల్సిన పూర్తిస్థాయి గౌరవాన్ని కల్పించడంలో విఫలమయ్యారనేది కఠోర సత్యం. ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా అధికారికంగా ప్రకటించడానికి దశాబ్దం పాటు నిరీక్షించవలసి రావడం మన వ్యవస్థాగత వైఫల్యాన్ని తెలియజేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో ఆయనకు రాష్ట్ర గీత రచయితగా గౌరవం దక్కింది. నగదు పురస్కారం దక్కింది, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించ బడ్డాయి. అంతవరకు సంతోషం. కానీ, ఒక ప్రజాకవికి దక్కాల్సిన జాతీయ స్థాయి గౌరవం దక్కలేదు. ఆయన అశు కవితా పటిమను, పదాల లోతును, తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని, జనజీవన చిత్రణను దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయడంలో మనం విఫలమయ్యాం. అందువల్ల, ఇప్పుడు మన ముందు ఒక చారిత్రక బాధ్యత ఉంది.

ఆయన గొప్పతనం తరాలకు అందించాలంటే..

ఇది అందెశ్రీ మరణానికి కేవలం సంతాపం తెలిపే సమయం కాదు. ఆయన వారసత్వాన్ని పదిలపరిచేందుకు ఒక బృహత్ ప్రణాళికను అమలు చేయాల్సిన సమయం. మొదటగా ఆయనకు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘పద్మ విభూషణ్’ లేదా ‘పద్మ భూషణ్’ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని తీర్మానించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవితం, సాహిత్యంపై ఒక ప్రత్యేక అధ్యాయాన్ని వెంటనే చేర్చాలి. రాబోయే తరాలకు ఒక నిరక్షరాస్యుడు సాధించిన అక్షర విజయాన్ని పరిచయం చేయాలి. మూడోది ఉస్మానియా లేదా కాకతీయ విశ్వ విద్యాలయంలో ఆయన పేర తెలంగాణ సాంస్కృతిక, జానపద పరిశోధనా కేంద్రం’ ఏర్పాటు చేసి, ఆయన కవిత్వంపై, గేయ సాహిత్యంపై లోతైన అధ్యయనాలు జరిగేలా ప్రోత్సహించాలి. నాలుగు ఆయన రాసిన వేలాది పాటలు, కవితలన్నింటినీ సేకరించి, వాటిని సంపుటిగా ప్రచురించి, దేశీయ, అంతర్జాతీయ భాషల్లోకి తర్జుమా చేయించాలి. ఈ దేశంలో కవిత్వానికి, ప్రజా ఉద్యమాలకు మధ్య ఉన్న అంతరాన్ని చెరిపి‌వేసిన గొప్ప వారధి ఆయన. తెలంగాణ మట్టిలో ఆయన శ్వాస నిలిచిపోయి ఉండవచ్చు. కానీ ఆయన పాట మాత్రం శాశ్వతంగా బతికి ఉంటుంది. ఆ పాటల గొప్పతనం తరతరాలకు అందించడం మనందరి నైతిక కర్తవ్యం. అదే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి.

-డా.కట్కూరి

సామాజిక విశ్లేషకులు, న్యాయ నిపుణులు

[email protected]

Next Story