ఉత్తరాది, దక్షిణాది వివాదం సమంజసమేనా?

by Ravi |   (  Updated:2025-03-09 01:00:34  IST  )

ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల వివాదాన్ని మరోసారి రేకెత్తించడం వల్ల విభజన రాజకీయాలకు డీఎంకే ఆజ్యం పోస్తోంది.

ఉత్తరాది, దక్షిణాది వివాదం సమంజసమేనా?
X

ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల వివాదాన్ని మరోసారి రేకెత్తించడం వల్ల విభజన రాజకీయాలకు డీఎంకే ఆజ్యం పోస్తోంది. భౌగోళిక స్వరూపం ఆధారంగా ఏర్పడిన తారతమ్యాలను విభజన రాజకీయాలకు ఆసరాగా మార్చుకుంటోంది. ద్రవిడ వాదం పేరిట ప్రజలను విభజించడమనే దారుణమైన నేరానికి పాల్పడుతోంది. తన రాజకీయ లబ్ధి కోసం దేశ సార్వభౌమత్యానికే సవాలు విసురుతోంది.

కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తోందనీ.. ఇప్పటివరకూ నిధుల విషయంలో అన్యాయం చేసిన కేంద్రం ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా మరో అన్యాయానికి తెరతీసిందని, ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు. పైగా ద్రవిడ వాదాన్ని ఎవ్వరూ ఆపలేరనీ.. తాము మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఉత్తరాది దక్షిణాది అనే విభజన ఎక్కడ నుంచి వచ్చిం ది..? ఇందుకు హేతుబద్ధత ఏమిటి..? అసలు ఈ వాదన సరైందేనా..? ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం సమంజసమేనా..?

ఉత్తరాదిపై వ్యతిరేకతే లక్ష్యమా?

బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ద్రవిడవాద ఉద్యమం మొదలైంది. కానీ ఆ తర్వాత ఈ ఉద్యమం క్రమంగా పక్కదారి పట్టింది. ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని అనునిత్యం వ్యతిరేకించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగుతోంది. ద్రవిడవాద రాజకీయ పార్టీలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అసలు ద్రవిడవాదం అన్నదానికి ఓ ప్రాతిపదికనే లేదు. ఒక దేశాన్ని భౌగోళిక పరిస్థితుల ఆధారంగా విభజించడం అన్నది చాలా తప్పు. అది తీవ్రమైన నేరం కూడా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలైతే ద్రవిడవాదం పేరిట దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒకటే అని చెబుతున్నాయో.. అవే పార్టీలు ఒకప్పటి మద్రాసు నుంచి తెలుగువారిని తరిమేశాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను కోరుకున్నాయి. కర్ణాటకతో కావేరీ జలాల విషయంలో గొడవలు పడటం, కేరళతోనూ నీటి విషయాల్లో తగువులాడుకోవడం గతంలో అనేకం జరిగాయి. ఈ పార్టీలు ఇప్పుడు దక్షిణాది అని చెప్పి రాష్ట్రాలను ఏకం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అందులోనూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం మరీ విడ్డూరం.

విభజన రాజకీయాలకు అస్త్రంగా..

తమిళనాడులో ద్రవిడవాద ఉద్యమం పేరిట తెలుగువారిని తరిమేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ఐక్యత ఏమైపోయింది..? కావేరీ జలాల వివాదం ఏర్పడినప్పుడు ఐక్యతతో కూర్చుని పరిష్కరించుకున్నారా..? భౌగోళిక తారతమ్యాలు మనుషుల విభజనకు కార ణం కాకూడదు. ఉత్తరాది దక్షిణాది అనే వాదనను విభజనకు ఉపయోగించుకోవడం తీవ్రమైన నేరమే అవుతుంది. ఇది కేవలం పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే పరిమితం కావాలి. విభజన రాజకీయాలకు అస్త్రంగా మారకూడదు. అలా జరిగినప్పుడు ప్రజల్లో చీలిక ఏర్పడుతుంది. ప్రత్యేక దేశం నినాదాలు అందు లో నుంచి పుట్టుకువచ్చినవే. అందుకు ఎంతమాత్రమూ ఆస్కారం ఇవ్వకూడదు. ఇప్పటికైనా ద్రవిడవాద పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం ఉత్తర - దక్షిణ వివాదాలను సృష్టించకుండా ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. ప్రపంచం ప్రగతి వైపు అడుగులు వేస్తున్న కొద్ది ప్రాంతీయ వాదం అనే భావన తగ్గుతూ వస్తోంది. దానికి అనుగుణంగా నడవడమే దేశానికి మంచిది.

- హరి ప్రసాద్ ,

76739 96504

Next Story