జనతా పార్టీ తరహా సమీకరణ సాధ్యమేనా?!

by Ravi |   (  Updated:2026-05-03 01:15:30  IST  )

జనతా పార్టీ ఏర్పాటుతో వచ్చిన రాజకీయ మార్పులు, నేటి ఇండీ కూటమి ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రతిపక్ష ఐక్యతలో లోపాలు, బలమైన ప్రత్యామ్నాయం నిర్మాణంపై విశ్లేషణ.

జనతా పార్టీ తరహా సమీకరణ సాధ్యమేనా?!
X

జనతా పార్టీ... భారతదేశ రాజకీయ యవనికపై ఒక ఉద్వేగభరిత సందర్భం. ఆ సమీకరణ ఒక వాస్తవిక ఆచరణగా రూపాంతరం చెందిన నాడు దేశం ఎమర్జెన్సీ గుప్పిట విలవిలలాడుతు‌న్నది. ప్రతిపక్షాన్ని, ప్రశ్నించే గొంతును ఏకంగా ప్రజాస్వామ్య ప్రక్రియ లన్నింటినీ తన చెప్పుచేతల్లో నిలుపుకునేం దుకు అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం పూనుకున్నప్పుడు ప్రతిపక్షం సంఘటితమైంది.

పాత కాంగ్రెస్ వాదులు, సోషలిస్టులు, జనసంఘీ యులు, లోహియావాదులు, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ న్యూక్లియస్‌గా జనతా పార్టీ ఏర్పడింది. ఆ పార్టీతో ద్రావిడ పార్టీలు, కమ్యూనిస్టులు జతకట్టి దేశంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికారు.

అధికార కూటమి బిగ్ బ్రదర్ తత్వం..

ఇప్పుడు కూడా ప్రతిపక్షం, ప్రజాభిప్రాయం, ప్రశ్నించే గొంతుక అన్నీ ఇబ్బందుల వలయంలో ఉన్నాయి. ప్రతిపక్షం అణచివేతను చవిచూస్తున్నది. అధికార కూటమి వ్యూహాల నడుమ ప్రతిపక్షం విలవిలలాడుతున్నది. ప్రభుత్వ చర్యల పర్యవసానంగా రాజ్యాంగంలో సవర‌ణల కుతంత్రాలు జరుగుతున్నాయి. ఎన్నికల కోసం అధికార కూటమి అనుసరిస్తున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తుగ‌డలు ప్రతిపక్షాన్ని అయోమయంలోకి నెడు తున్నాయి. ఎమర్జెన్సీ కాకున్నా అంతే స్థాయి వత్తిడి తరహా పాలన ఫలితంగా ఎన్నికల వ్యవస్థ మొదలు ప్రతీ రాజకీయ అంగమూ కునారిల్లే దశకు చేరుకున్నది. అధికార కూటమి బిగ్ బ్రదర్ తత్వం అన్ని రాజకీయ వ్యవస్థలనూ సంక్షుభితం చేస్తున్నది. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే రూపంలో మొదలైన ప్రతిపక్ష పార్టీల విభజన ఎత్తుగడ చివరగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్ష విలీన దశ వరకూ కొనసాగింది. ఇలాంటి దశలో మరి మరో జనతా పార్టీ తరహా ప్రయత్నం లేదా కూటమి నిర్మాణం సాధ్యం ఔతుందా? అనే ఆలోచన ఈ వ్యాసానికి మూలం.

నాటి, నేటి కూటములకు పోలిక ఎక్కడ?

అప్పుడు జనతాపార్టీ.. అనంతర కాలం కూటముల తరుణం. ఏక పార్టీ వ్యవస్థ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కిం‌చుకోవటం కష్టసాధ్యమైనప్పుడు, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ, తాజాగా ఇండి అలయెన్స్ వచ్చాయి. ఇప్పటి ప్రతిపక్షానిది ఇండి అలయెన్స్. ఆ కూటమిలో అన్నీ లుకలుకలే.. అన్నీ పరస్పర రంధ్రాన్వేషణలే. ఈ దశలో అధికార కూటమిని నిజంగా ఎదుర్కుని జనతా తరహా స్ఫూర్తిని సాధించగలిగే సత్తా ప్రతిపక్షానికి ఉందా? బెంగాల్ ఫలితాల అనంతరమైనా అది వాస్తవిక రూపం దాలుస్తుందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండీ కూటమి మాత్రం ఇప్పటికీ సడలిన కూటమిగానే మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణం, అప్పటిలా ఒక సమగ్ర, అత్యవసర రాజకీయ కారణం లేకపోవడం. మోడీ ప్రభుత్వంపై, ప్రజాస్వామ్య విలువల క్షీణత గురించి ప్రతిపక్షాలు తరచుగా మాట్లాడుతున్నప్పటికీ, అది కూటమి భాగస్వాములందరిలో ఒకే రకమైన అత్యవసర భావనను కలిగించలేదు. రాష్ట్ర స్థాయి రాజకీయ పోటీలు జాతీయ ఐక్యతపై పైచేయి సాధిస్తున్నాయి.

అందరూ నాయకులే.. అందరూ ప్రధానులే..!

నాయకత్వ అంశం కూడా ఇక్కడ కీలకం. జనతా పార్టీకి ఆరంభంలో విభిన్న వర్గాలను సమన్వయం చేసే నాయకత్వం ఉంది. కానీ ఇండీ కూటమిలో అటువంటి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు కనిపించడం లేదు. కాంగ్రెస్ గతంలో ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆ ప్రభావం తగ్గింది. ప్రాంతీయ నాయకులు తమ స్వతంత్ర ప్రాభవాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. ఫలితంగా, ఇది ఐక్య శక్తిగా కాకుండా పోటీ ఆశయాల సమాహారంగా మారింది. సిద్ధాంత‌పరమైన విభేదాలు కూడా అడ్డంకిగా ఉన్నాయి. అప్పుడు జనతా పార్టీకి కాంగ్రెస్ వ్యతిరేకత అనే ఒకే లక్ష్యం ఉండేది. కానీ ఇండీ కూటమిలో ఉన్న పార్టీలు మధ్య సిద్ధాంత పరంగా విభిన్నత ఉంది. మధ్యవర్తిత్వం నుంచి సోషలిజం వరకు, ప్రాంతీయత నుంచి జాతీయత వరకు. ఒక సమగ్ర జాతీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడం కష్టంగా మారింది.

ప్రాంతీయ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్!

ఇంకా ఒక ముఖ్యమైన అంశం రాజకీయ ప్రయో జనాల అసమానత. అనేక ప్రాంతీయ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాకుండా కాంగ్రెస్ కావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇండీ కూటమి పార్టీలే పరస్పరం ప్రత్యర్థులుగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనతా తరహా విలీనానికి అవసరమైన త్యాగం సాధ్యం కాదు.. సంస్థాగత పరిమితులు కూడా ఉన్నాయి. బీజేపీకి ఆరెస్సెస్ మద్దతు ఉంది, ఇది క్రమశిక్షణతో కూడిన శక్తివంతమైన వ్యవస్థ. ఎన్డీఏకు స్పష్టమైన నాయకత్వం, సమర్థవంతమైన ఎన్నికల యంత్రాంగం ఉంది. కానీ ఇండీ కూటమి మాత్రం విభిన్న శైలులు, సామర్థ్యాలతో కూడిన పార్టీల సమూహంగా ఉంది. వీటిని ఒకే వ్యవస్థగా మార్చడం చాలా కష్టం.

స్పష్టమైన ఐక్యతను సాధించకపోతే..!

అంతేకాదు, నేటి రాజకీయ వాతావరణం కూడా 1970ల కాలంతో పోల్చితే భిన్నంగా ఉంది. ఓటర్ల ప్రాధాన్యతలు విభిన్నంగా మారాయి, మీడియా ప్రభావం పెరిగింది, ఎన్నికలు వ్యక్తి ఆధారితంగా మారాయి. ఈ సందర్భంలో మోడీ వంటి బలమైన నాయకత్వ ప్రతిరూపం ముందు విభజిత ప్రతిపక్షం బలహీనంగా కనిపిస్తోంది. అయితే, ఈ పరిస్థితిని కొనసాగించడం ప్రమాదకరం. స్పష్టమైన సిద్ధాంతం, సమన్వయం లేకుండా కేవలం సీట్ల పంపకం ద్వారా మాత్రమే బీజేపీకి సవాలు విసరడం సాధ్యం కాదు. జనతా పార్టీ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేకపోయినా, అది ఒక పాఠాన్ని నేర్పింది. సమయోచితంగా స్వార్థాలను పక్కన బెట్టి ఐక్యత సాధించగలగడం రాజకీయాల్లో కీలకం. ఇది అత్యవసరం కూడా. ఇప్పుడే ఆ తరహా కీలక సమయం ఆసన్నమైంది. ఇండీ కూటమి ఇప్పటికైనా ఒక బలమైన, స్పష్టమైన ఐక్య రూపాన్ని తీసుకోకపోతే, అది కేవలం ప్రతిస్పందనాత్మక కూటమిగానే మిగిలిపోతుంది. రాజకీయాల్లో అవకాశాలు తరచుగా తిరిగి రావు. వాటిని గుర్తించి వినియోగించుకోవడం నాయకత్వ లక్షణం.

-పెండ్యాల కొండల్

75694 95833

Next Story