- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి రహిత తెలంగాణ సాధ్యమేనా?
2025 కాలంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గణాంకాలను పరిశీలిస్తే వ్యవస్థలో పేరుకుపోయిన ఈ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

అవినీతి సమాజాన్ని పట్టి పీడించే ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది. ప్రజాస్వామ్య మూలస్తంభాలను బలహీనపరిచే ఈ జాడ్యాన్ని నిర్మూలించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి నైతిక కర్తవ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారదర్శక పాలన దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవినీతి ఇంకా వేళ్లూనుకునే ఉంది. 2025 కాలంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గణాంకాలను పరిశీలిస్తే వ్యవస్థలో పేరుకుపోయిన ఈ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. చట్టపరమైన లొసుగులు, పరిపాలనా పరమైన జాప్యం వంటి అంశాలు ఈ జాడ్యానికి ఊతాన్నిస్తున్నాయి.
చారిత్రక నేపథ్యం ఆధునిక సవాళ్లు
చరిత్రను పరిశీలిస్తే కౌటిల్యుడి అర్థశాస్త్రం కాలం నుండే అవినీతి ప్రస్తావన ఉంది. ఆధునిక కాలంలో అధికార వికేంద్రీకరణ జరిగినప్పటికీ అధికార దుర్వినియోగం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. సంక్లిష్టమైన పరిపాలనా పద్ధతులు, జాప్యంతో కూడిన ఫైళ్ల కదలిక, పారదర్శకత లేని వ్యవస్థలే నేటి అవినీతికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో అవినీతి రూపం మారింది. ఇప్పుడు అది కేవలం నగదు రూపంలోనే కాకుండా క్లిష్టమైన డిజిటల్ లావాదేవీల రూపంలోకి రూపాంతరం చెందింది. దీనిని అరికట్టడానికి పాత పద్ధతులు సరిపోవు.
తెలంగాణ ఏసీబీ నివేదిక 2025
ఇటీవల విడుదలైన 2025 రౌండ్-అప్ నివేదిక ప్రకారం తెలంగాణ ఏసీబీ 199 కేసులను నమోదు చేసి 273 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 157 ట్రాప్ కేసులు ఉండటం గమనార్హం. ఆదాయానికి మించిన 15, ఆస్తుల కేసుల్లో సుమారు 96 కోట్ల విలువైన ఆస్తులను వెలికితీశారు. ఈ గణాంకాలు ఒకవైపు ఏసీబీ చురుకుదనాన్ని సూచిస్తున్నా మరోవైపు వ్యవస్థలో లంచగొండితనం ఇంకా ఎంతగా వేళ్లూనుకొని ఉందో స్పష్టం చేస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, రవాణా శాఖ చెక్ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లలో జరిగిన ఆకస్మిక తనిఖీలు క్షేత్రస్థాయిలో అవినీతి తీవ్రతను చాటిచెబుతున్నప్పటికి వ్యవస్థలోని నైతిక పతనాన్ని సూచిస్తోంది. స్వాధీనం చేసుకున్న సొమ్ములో గణనీయమైన మొత్తాన్ని బాధితులకు తిరిగి చెల్లించడం కొంత ఊరటనిచ్చే అంశం.
చట్టపరమైన విశ్లేషణ
అవినీతి నిర్మూలనపై గతంలో ఏర్పాటైన సంతానం కమిటీ కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుకు దారితీసింది. రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ పరిపాలనలో నైతికత గురించి నొక్కి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సిఫార్సుల మేరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్-1988 ని కఠినంగా అమలు చేయాలి. ముఖ్యంగా సెక్షన్ 17A కింద ప్రభుత్వ అధికారులపై విచారణకు ముందస్తు అనుమతి తప్పనిసరి అనే నిబంధనను దుర్వినియోగం కాకుండా చూడటం అవసరం. బినామీ ఆస్తుల చట్టం అమలులో ఏసీబీ శిక్షణలో బినామీ ఆస్తుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయం. దీనిని మరింత బలోపేతం చేయడం ద్వారా అవినీతిపరుల మూలాలను దెబ్బతీయవచ్చు.
పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం
కేవలం దాడులు చేయడం మాత్రమే పరిష్కారం కాదు. ముందస్తు నిఘా అత్యవసరం. తెలంగాణలో ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఫిర్యాదు వ్యవస్థ, 1064 టోల్ ఫ్రీ నంబర్ అభినందనీయం. ఇది బాధితులకు దర్యాప్తు సంస్థకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. ఆర్థిక లావాదేవీల డిజిటలైజేషన్ ద్వారా నిధుల మళ్లింపును సులభంగా గుర్తించవచ్చు. ఏసీబీ నివేదికలో పేర్కొన్న విధంగా అధికారులకు డిజిటల్ ఫుట్‌ప్రింట్ విశ్లేషణలో శిక్షణ ఇవ్వడం సరైన దిశలో వేసిన అడుగు. టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మానవ ప్రమేయాన్ని తగ్గించి అవినీతి అవకాశాలను తుడిచిపెట్టవచ్చు. ప్రతి కార్యాలయంలో పారదర్శకతను పెంచే బోర్డులు, ఆన్‌లైన్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి.
నిపుణుల అభిప్రాయం
అవినీతిని అంతం చేయడానికి మూడు అంచెల వ్యూహం అవసరం. మొదటగా శిక్షా స్మృతిని కఠినతరం చేయాలి. అవినీతి కేసుల్లో విచారణ కాలపరిమితిని నిర్ణయించడం ముఖ్యం. ఏళ్ల తరబడి విచారణ సాగడం వల్ల సాక్ష్యాలు బలహీనపడే అవకాశం ఉంది. రెండవది సంస్థాగత స్వయంప్రతిపత్తి, ఏసీబీకి లోకాయుక్తకు పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి కల్పించాలి. రాజకీయ జోక్యం లేని దర్యాప్తు మాత్రమే నిజమైన ఫలితాలను ఇస్తుంది. మూడవది బహుమతి శిక్షా విధానం. నిజాయితీగా పని చేసే అధికారులను ప్రోత్సహిస్తూ అవినీతిపరుల ఆస్తులను వెంటనే జప్తు చేసే ప్రక్రియ వేగవంతం కావాలి. తద్వారా తప్పుడు పనులు చేయడానికి అధికారులు భయపడే వాతావరణం కలుగుతుంది.
సంస్కరణల ఆవశ్యకత
తెలంగాణలో అవినీతి నిర్మూలనకు కేవలం చట్టాలు సరిపోవు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు రావాలి. ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా చేరేలా ఐటీ వ్యవస్థలను బలోపేతం చేయాలి. దరఖాస్తుల స్థితిగతులను పౌరులే స్వయంగా చూసుకునే వీలుండాలి. అధికారులు నిర్ణీత సమయంలోగా ఫైళ్లను క్లియర్ చేయకపోతే జరిమానా విధించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచడం ద్వారా భయం లేని సమాజాన్ని నిర్మించవచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఏసీబీ ప్రజలకు అందుబాటులో ఉండటం ఒక సానుకూల పరిణామం. ఇది ప్రజలలో భరోసాను నింపుతుంది.
సామాజిక స్పృహ
చట్టాలు ఎన్ని ఉన్నా ప్రజల్లో మార్పు రానంతవరకు అవినీతి అంతం కాదు. లంచం అడగడం నేరం, ఇవ్వడం కూడా నేరమే అనే అవగాహన ప్రతి పౌరుడిలో కలగాలి. తెలంగాణ ఏసీబీ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలను చైతన్యపరచడం మంచి పరిణామం. పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన తెలంగాణను నిర్మించడం మనందరి బాధ్యత. కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడకుండా సామాజిక విచారణ (Social Audit) వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. ప్రతి పైసా ప్రజా శ్రేయస్సుకే ఖర్చు అయ్యేలా చూడటం మన నైతిక ధర్మం. మీరు ఎదుర్కొనే ప్రతి అవినీతి అభ్యర్థనపై గొంతు ఎత్తండి. ఏసీబీని సంప్రదించండి, చట్టబద్ధమైన సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావండి. పారదర్శక పాలనతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది.
డా.కట్కూరి
సైబర్ సెక్యురిటీ న్యాయ నిపుణులు.






