- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసియా ఆత్మగౌరవ ధిక్కారం ఇరాన్
ఇరాన్ ఇప్పుడు సామ్రాజ్యవాద పీడిత మూడవ ప్రపంచానికి ఒక దీప స్తంభంగా మారుతున్నది. అమెరికా దాడులకు ప్రతీకారంగా

ఇరాన్ ఇప్పుడు సామ్రాజ్యవాద పీడిత మూడవ ప్రపంచానికి ఒక దీప స్తంభంగా మారుతున్నది. అమెరికా దాడులకు ప్రతీకారంగా మధ్య ప్రాచ్యంలోని అమెరికా యుద్ధ స్థావరాలపై విరుచుకపడుతున్నది. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. ఈ యుద్ధం తాము ప్రారంభించినది కాదని, తమపై దాడి చేసిన వారి పట్ల జాలి చూపమని గర్జిస్తున్నది. ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన అనంతరం కూడా ఇరాన్ ఇజ్రాయెల్‌పై తన శక్తి మేరకు దాడులు చేసి నష్టపరిచింది. ఎలాంటి తడబాటును, లొంగుబాటును ప్రదర్శించని ఇరాన్ దేశానికి భారత్ అండగా ఉండాలి..
దక్షిణార్ధ గోళంలో ఉన్న ఆసియా దేశాలలో అనేకం మతం ఆధారంగా కలహించుకుంటూ, అగ్రరాజ్యాల ప్రయోజనాలను తీర్చే విధంగా విధేయంగా ఉంటున్న సందర్భంలో, వీటికి అతీతంగా స్వయం స్వాలంబన, ఆత్మ గౌరవ బావుటాను ఎగురవేస్తున్న దేశంగా ఇరాన్ చరిత్ర పుటలలో నిలుస్తున్నది. వియత్నాం తర్వాత ప్రపంచ పోలీసుగా విర్రవీగుతున్న అమెరికాను అది అగ్ర రాజ్యం కాదు, ఒక క్రూర ఆధిపత్య, అప్రజాస్వామిక నియంత ధోరణులకు ప్రతీక అని ప్రకటించిన దేశం ఇరాన్. ఇంధన వనరులు ఎక్కువగా ఉన్న మధ్య ప్రాచ్యంలో అమెరికా విస్తరణ వాదానికి, దాని ప్రాక్సీ ఇజ్రాయెల్‌ను మధ్య ఆసియాలో అగ్ర పోలీసు రాజ్యంగా నిలబెట్టడానికి దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియను నిరోధిస్తూ బలమైన రక్షణ శ్రేణిగా ఇరాన్ నిలబడుతున్నది.
యుద్ధోన్మాదం కాదు.. ట్రంపోన్మాదం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధాలకు అమెరికా దూరం గా ఉండాలని ప్రదర్శనలు జరిపి, నేను అధికారంలో ఉంటే రష్యా, ఉక్రేనియా యుద్ధం జరిగేది కాదని చెప్పిన ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచంపై ఆధిపత్యం కోసం యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తున్నారు. తన తొలి దశ పాలనలో ఇరాన్ సైన్యాధిపతి సులేమాన్‌ను 2020లో చంపించిన ట్రంప్, రెండో దశ పాలనలో తన ప్రాక్సీ ఇజ్రాయెల్‌తో ఇరాన్‌పై జూన్ 13 నుండి దాడులను ప్రారంభించింది. ఇరాన్ కీలక శాస్త్రవేత్తలను సైనికాధికారులను హతమార్చింది. జూన్ 22న అమెరికా నేరుగా 30 వేల కిలోల పేలుడు పదార్థాలను ఇరాన్ లోని ఫార్డో, నటాంజ్, ఇష్ఫాన్ అణు క్షేత్రాలపై జారవిడిచి వాటిని ధ్వంసం చేసింది.
ఇరాన్‌ని మట్టుపెట్టడమే లక్ష్యం
మధ్య ఆసియాలో ఉన్న అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవడానికి, అమెరికా దాని బంటు ఇజ్రాయెల్ చేస్తున్న పలు ప్రయత్నాలకు ఇరాన్ అడ్డుగోడగా నిలుస్తున్నది. రాజకీయ ఆర్థిక సాంకేతిక రంగాలలో నిలదొక్కుకుని మధ్య ప్రాచ్యంలో సామ్రాజ్యవాదానికి సవాల్ విసురుతున్న ఇరాన్‌ను మట్టు బెట్టాలనే తెగింపుతోనే అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధమిది. ట్రంప్ బాంబు దాడులకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదు, అక్కడి ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి నియమాలకు విరుద్ధమైనది అని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. బాంబులు తుపాకులతో పాటు ఆహారాన్ని పాలస్తీనా ప్రజలకు అందకుండా చేస్తూ జాతి హత్యాకాండకు పాల్పడుతున్న యుద్ధ నేరస్తుడిగా అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారంట్ జారీ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జత కట్టడం అమానవీయం అని ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు.
నీకొక న్యాయం.. ఇతరులకో న్యాయం
కొందరు అణ్వస్త్రాలను ఉంచుకుని మిగతా వాళ్లకు ఆ హక్కు లేదనడం అన్యాయం. అణ్వస్త్ర దేశాలు అవి లేని దేశాల కోసం ఏర్పాటు చేసిందే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం. దీనిని భారత్ ఆమోదించలేదు. భారత అణుశక్తి విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు అగ్రరాజ్యాల బెదిరింపును ధిక్కరిస్తూ నెహ్రూ వ్యాఖ్య “మాకు అణు బాంబు తయారు చేయాలన్న కోరిక లేదు, అయితే మాతో శత్రుత్వం ఉన్న వారు తయారు చేసుకుంటే చేతులు ముడుచుకుని కూర్చోం. అంతే కాక శాంతియుత అవసరాల కోసం అణు శక్తిని వాడుతున్నప్పుడు, అదే క్రమంలో బాంబులు తయారు చేస్తామేమో అని అమెరికాకు అనుమానం వచ్చినంత మాత్రాన మా సాంకేతిక అవసరాలను మేము వదులుకోం”
ఇరాన్‌కి అండగా నిలవాలి..
ఈ వైఖరితోనే ఇరాన్ దేశానికి భారత్ అండగా ఉండాలి. తటస్థ వైఖరిని కలిగి ఉండడం, కనీసం ఖండన లేకపోవడం భారత్‌ను చారిత్రక అపరాధిగా మిగులుస్తుంది. ఇరాన్‌తో భారత్‌కు శతాబ్దాల పాటు సాంస్కృతిక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అమెరికాను నమ్ము కునే బదులు దక్షణార్ధ గోళ దేశాలతో కలిసి పనిచేయడమే అలీన దేశంగా ప్రభావంతమైన శక్తిగా భారత్ ముందున్న కర్తవ్యం.
అస్నాల శ్రీనివాస్
96522 75560






