పతాక యోధుడు.. పింగళి వెంకయ్య

by Ravi |   (  Updated:2026-07-04 00:30:36  IST  )

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జీవితం, దేశానికి చేసిన సేవలు, త్రివర్ణ పతాక రూపకల్పన వెనుక ఉన్న చరిత్ర, మహాత్మా గాంధీతో ఆయన అనుబంధం, జాతీయ జెండా ఆవిర్భావ విశేషాలపై ప్రత్యేక కథనం.

పతాక యోధుడు.. పింగళి వెంకయ్య
X

ఒక దేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, ఆ స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకం కూడా అంతే ముఖ్యం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దేశాన్ని ఏకం చేసే జాతీయ జెండా అవసరమని భావించిన మహాత్మా గాంధీ ఆలోచనలకు రూపమి‌చ్చిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆయన 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మ. చల్లపల్లి, మచిలీపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఉన్నత విద్య కోసం గుంటూరుకు వెళ్లారు. 19 ఏళ్ల వయసులో బ్రిటీష్ సైన్యంలో చేరి దక్షిణా ఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. అనంతరం లాహోర్‌లో ఉర్దూ, జపనీస్ భాషలను అభ్యసించి "జపాన్ వెంకయ్య"గా ప్రసిద్ధి పొందా రు. దక్షిణాఫ్రికాలో భారతీయులు యూనియన్ జాక్‌కు సెల్యూట్ చేయాల్సి రావడం ఆయనను కలచివేసింది. భారతదేశానికి సొంత జాతీయ పతాకం ఉండాలనే సంకల్పంతో 50కి పైగా దేశాల జెండాలను అధ్యయనం చేసి, 1916లో "భారతదేశానికి ఒక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ప్రచురించారు. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో తన జెండా నమూనాను గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ సూచన మేరకు తెలుపు రంగు, మధ్యలో చరఖా చేర్చడంతో త్రివర్ణ పతాకం రూపుదిద్దుకుంది. తరువాత చరఖా స్థానంలో అశోక చక్రం చేరి నేటి జాతీయ పతాకంగా అవతరించింది. వ్యవసాయం, భూగర్భ శాస్త్రంలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆయనను "పత్తి వెంకయ్య", "వజ్రాల వెంకయ్య" అని కూడా పిలిచేవారు. దేశానికి చిరస్థాయిగా నిలిచే గుర్తింపును అందించిన పింగళి వెంకయ్య 1963 జూలై 4న కన్నుమూశారు. ఆయన త్యాగం, దేశభక్తి ప్రతి భారతీయుడికి చిరస్మరణీయం.

(నేడు పింగళి వెంకయ్య వర్ధంతి)

-సుధాకర్.ఏ.వి

90006 74747

Next Story