- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెట్ ఒత్తిడిలో ఇన్‌సర్వీస్ టీచర్లు.. సడలింపులపై ఆశలు..
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ అర్హత తప్పనిసరి కావడంతో తెలంగాణ ఇన్‌సర్వీస్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేక టెట్ అవసరం, సిలబస్ మార్పులు, అర్హత సడలింపులపై డిమాండ్లను ఈ వ్యాసం వివరిస్తుంది.

ఉపాధ్యాయులు, సమాజానికి అవసరమైన బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుని నిత్యం జ్ఞాన దీపాలుగా వెలుగుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో వేలాది మంది ఇన్‌సర్వీస్ టీచర్లు ‘టెట్’ అర్హత పరీక్ష అంశంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2028 ఆగస్టు 31లోగా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి కావడంతో, ఇప్పటికే బోధన, పరిపాలన, కుటుంబ బాధ్యతలతో సతమత మవుతున్న ఉపాధ్యాయులపై మరో పరీక్ష భారం పడింది. ఈ నేపథ్యంలో ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహణ, సిలబస్‌లో మార్పులు, అర్హతా ప్రమాణాల్లో సడలింపులు వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
టెట్ నేపథ్యం.. టీచర్లలో అయోమయం..
ఉపాధ్యాయ నియామకాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం టెట్‌ను అమలు చేస్తున్నారు. టెట్ అనేది అర్హత పరీక్ష. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉపాధ్యాయులుగా నియమించబడేందుకు ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత పొందడం తప్పనిసరి. 2010లో ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌లోనూ ఈ నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాలన్న సుప్రీంకోర్టు పునరుద్ఘాటనతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నో పరీక్షలు దాటి ఉద్యోగంలో చేరిన మాకు మళ్లీ టెట్ అవసరమా? వారిలో ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు ఏమవుతాయన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 25–30 ఏళ్ల సర్వీస్ ఉన్న వారు వయసు, ఆరోగ్యం, కుటుంబ బాధ్యతల కారణంగా మళ్లీ పరీక్ష రాయడం కష్టమని భావిస్తున్నారు. అందుకే ఎలాగైనా ఈ టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలని అనేకమంది టీచర్లు వేడుకుంటున్న పరిస్థితి ఉన్నది.
ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ముందుకు రావడం స్వాగతించదగిన పరిణామం. నిరుద్యోగ అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షలకు అదనంగా, ఈ టీచర్ల కోసం సంవత్సరానికి రెండు సార్లు ప్రత్యేక టెట్ నిర్వహించాలని విద్యాశాఖ, ప్రభుత్వం భావించడం ప్రశం సనీయం. ఇది ఉపాధ్యాయులకు కొంత ఉపశమనాన్ని కలిగించే అంశం. అయితే ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రాబోయే ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌లో సిలబస్, పరీక్షా విధానం, అర్హతా మార్కుల విషయంలోనూ ఉపాధ్యాయుల అనుభవానికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు, పలు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న టెట్ సెలబస్‌ను పరిశీలిస్తే.. ఒక గణితం బోధించే ఉపాధ్యాయుడు టెట్ రాయాలంటే తనకు సంబంధం లేని జీవశాస్త్రం కంటెంట్ చదవాల్సి వస్తోంది. అలాగే సైన్స్ ఉపాధ్యాయుడు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల సబ్జెక్టు అంశాలను చదవడం, లాంగ్వేజెస్ టీచర్లు సోషల్ స్టడీస్ సబ్జెక్టు అంశాలను అభ్యసించాల్సి రావడం తలకు మించిన భారంగా మారుతోంది.
అర్హత మార్కులు తగ్గించాలి!
అలాగే అర్హత మార్కుల విషయంలోనూ.. దశాబ్దాలుగా బోధనానుభవం ఉన్న టీచర్లను కొత్త అభ్యర్థులతో సమానంగా పరిగణించకుండా.. వారి సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అర్హత మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఓసీ తదితర వర్గాల వారందరికీ సమానమైన వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలి.. తెలంగాణ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరించి రాబోయే ఇన్ సర్వీస్ టీచర్ల ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ పైన పేర్కొన్న మార్పులు చేస్తూ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే ఇన్‌సర్వీస్ టీచర్లకు న్యాయం చేసినట్లవుతుంది. అప్పుడు మాత్రమే ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థుల భవిష్యత్తును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దగలుగుతారు..
- బుర్రి శేఖర్
ప్రభుత్వ ఉపాధ్యాయులు






