మతం, కులం వద్దంటే పట్టించుకోరే?

by Disha edit |
మతం, కులం వద్దంటే పట్టించుకోరే?
X

ముఖ్యమంత్రి గారికి బహిరంగ విన్నపం...

మాది కులాంతర మతాంతర ప్రేమ వివాహం .. కులి కుతుబ్, బాగమతిల ప్రేమ చిహ్నంగా ఏర్పడిందని చెప్పుకునే హైదరాబాద్ లోనే మా ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, పిల్లల చదువులు, జీవితం కొనసాగుతున్నాయి. మా పిల్లలకు ఎటువంటి కుల మత నేపథ్యాలు ఇవ్వకుండా పెంచాలని మేము భావించాం.. అయితే మనకు పుట్టక నుంచి చనిపోయే దాకా వివిధ సందర్భాలలో కుల, మతాల ప్రస్తావన అవసరం ఉంటోంది .. మా పిల్లలకు కులం, మతం చిహ్నాలు పద్దని మేం న్యాయస్థానంలో వేసిన కేసు, పిటిషన్ గత 15 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది.

సామాజిక నేపథ్యాలు అనుసరించి అణగారిన వర్గాల ప్రజలకు చదువు, ఉద్యోగాలలో కొద్దిపాటి అవకాశాలు కల్పించడం, చట్ట సభలలో కొన్ని సీట్లు కేటాయించడం మనకు తెలిసినదే.. ఆ క్రమంలో వివిధ అస్తిత్వ సమూహాలను గుర్తిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అయితే కుల, మతాల వెలుపల , ఆ పరిధి దాటిన అస్తిత్వాలను అంటే కుల, మత రహిత అస్తిత్వాలను అలా అవసరమైన వారికి గుర్తించి నిరాకరిస్తున్నారు. గుర్తించే అవకాశం లేదు. ఈ సమస్యను మేము మా చిన్నమ్మాయి సహజను ఎల్‌కేజిలో చేర్చడానికి బయలుదేరినప్పటి నుంచీ అంటే 2009 నవంబర్ డిసెంబర్ నుంచి ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్లో అయినా, ఆఫ్ లైన్‌లో అయినా కుల రహిత, మత రహిత అస్తిత్వ ప్రకటనకూ అవకాశం ఉండాలి. ఇది మన సామాజిక ఉద్యమకారుల స్వప్నం.

మతాన్ని, కులాన్ని ఆచరించని హక్కు

ఆ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ స్థాయిలలో అధికారులకు అర్జీలు పెట్టుకున్నా సాధ్యం కాకపోవడంతో న్యాయవాది డి సురేష్ కుమార్ సహకారంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాం. జస్టిస్ సి.వి.నాగర్జునరెడ్డి మా పిటిషన్‌పై స్పందిస్తూ మతం నమ్మడానికి, ఆచరించడానికి హక్కు ఉందంటే , ఏ మతమూ ఆచరించకుండా ఉండడానికి కూడా హక్కు ఉన్నట్లేనని, పిటిషనర్‌ను మతం రాయమని ఒత్తిడి చేయొద్దని 2010 ఏప్రిల్‌లో మా చిన్నమ్మాయి విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ సందర్భంలోను ఈ పదిహేనేళ్లలోనూ అనేకమంది మత రహిత, కుల రహిత అస్తిత్వ ప్రకటన తమకు కూడా అవసరమనీ, ఎలా, ఎవరిని సంప్రదించాలనీ అడిగారు.. అడుగుతూనే ఉన్నారు. అలా మమ్మల్ని సంప్రదించిన వారిలో అత్యధికులు దళిత, బహుజన, మైనారిటీ నేపథ్యాలు ఉన్న మిత్రులే ఉన్నారు.

ఫీజు కట్టాలన్నా మతం కావాలి!

సమస్య అక్కడితో అయిపోలేదు. మా పెద్దమ్మాయి స్పందన ఇంటర్మీడియట్ సందర్భంలోనూ ఆన్లైన్ దరఖాస్తులో ఏదో ఒక మతం ఎంపిక చేసుకోనిదే పరీక్షల ఫీజు కట్టడానికి అవకాశం లేదు. అందువల్ల మళ్ళీ మళ్ళీ ఎదురవుతున్న మా సమస్యను, మాలాంటి వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ న్యాయవాది డి సురేష్ కుమార్ గారి సహకారంతో 2017 లో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం. ఈ ఏడేళ్లలో ఆయా సందర్భాలలో సంబంధిత ప్రభుత్వ శాఖలను స్పందించవలసిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లు అయిపోయిన సందర్భంలో ఇటీవల మా న్యాయవాది మా వ్యాజ్యంపై తీర్పు ఇవ్వవలసిందిగా న్యాయస్థానాన్ని కోరారు. మా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్ -పిల్) నంబర్ 662017 ఫిబ్రవరి 5న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కి వచ్చింది. మా పిల్ గురించి ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే, న్యాయమూర్తి జూకటి అనిల్ కుమార్‌లకు న్యాయవాది వివరించారు. రానున్న దేశ జనాభా లెక్కలు, రాష్ట్రంలో కుల గణన , విద్యా సంవత్సర ప్రారంభం, జనన , మరణాల నమోదు ఇలా అనేక అంశాలలో కుల రహిత , మత రహిత అస్తిత్వ ప్రకటనకూ అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తులు దీనిపై ప్రభుత్వ వైఖరిని 3 వారాల్లో తెలియజేయాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. మా పోరాటం ఇలా దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతోంది.

కులమతాల్ని దాటిన జీవితం కావాలి!

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని ఈ అంశంపై సానుకూలంగా స్పందించమని కోరుతూ మా విజ్ఞప్తిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారికి మెయిల్ చేసాం. విజ్ఞప్తితో పాటు మా కరపత్రాన్నీ , మా నో రెలిజియన్ నో కేస్ట్ చేంజ్ డాట్ ఆర్గ్ ఆన్లైన్ పిటిషన్‌లో మాకు మద్దతుగా చేసిన 55,746 సంతకాల జాబితాను కూడా మెయిల్ చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దిశగా మీరు సానుకూల నిర్ణయం చేస్తారని ఆశిస్తున్నాం. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాం. ఇవాళ మునుపెన్నటి కన్నా కుల మతాల పరిధులు దాటి మానవత్వ పతాకను మరింత సమున్నతంగా ఎత్తి పట్టాల్సిన ఒక సున్నిత సందర్భంలో మనమంతా ఉన్నామన్న విషయాన్ని మీ దృష్టిలో పెడుతున్నాం. ఇటువంటి ప్రజాస్వామిక ఆకాంక్షకూ, ప్రగతి దాయక ఆచరణకూ అవకాశం కలిగించమని, మిమ్మల్ని కోరుతున్నాం.. కృతజ్ఞతలతో ..

- డి.వి రామక్రిష్ణా రావు,

9989189250

Next Story

Most Viewed